నదిని శుద్ధి చేసే సిమెంటు చేప
హైదరాబాద్‌లో మూసీ, బెజవాడలో కృష్ణ, కోల్‌కతాలో హూగ్లీ.. ఇలా ప్రతి నగరంలోనూ కాలుష్యంతో నిండిన నది ఏదో ఒకటి ఉంటుంది. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోనూ హాన్ నది ఉండనే ఉంది. మనమేమో వందల కోట్లు గుమ్మరించి సీవరేజ్ ట్రీట్‌మెంట్లు కట్టేసి.. నదినీటిని శుభ్రం చేసేయాలని తంటాలు పడుతున్నామా... సియోల్ దీనికి భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది. నదివెంబడి ... ఇదిగో ఇలా ఫొటోల్లో కనిపిస్తున్నట్లు అందమైన నిర్మాణాలను చేపట్టనుంది.
ఏంటి వీటి స్పెషాలిటీ అంటే బోలెడన్ని అని చెప్పక తప్పదు. ముందుగా... నదిలో షికారు చేసే ఫెర్రీ బోట్లు నిలిపే బోట్ స్టేషన్‌గా పనికొస్తాయి ఇవి. దాంతోపాటే ఈ స్టేషన్ ప్రాంతంలో తీరం వెంబడి చిత్తడి నేలల్లో రకరకాల మొక్కలు పెంచుతారు. వీటివల్ల నీరు సహజసిద్ధంగా శుభ్రమైపోతుందన్నమాట. అంతేకాకుండా ఈ మొక్కల కారణంగా నది తాలూకూ గట్టు కూడా పటిష్టంగా మారి వరదల సమయంలో ముంపు ప్రమాదం తగ్గుతుంది. స్టేషన్‌పైన ఒక అంతస్తులో నదిని, అటుపక్కనున్న నగరాన్ని చూసేందుకు ఏర్పాట్లు ఉంటే.. రెండో అంతస్తుపై సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు తో పాటు.. పచ్చటి మొక్కలు, క్రికెట్ బ్యాట్‌ల తయారీలో వాడే విల్లో వృక్షాలు పెంచుతారట.
ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ విన్సెంట్ కాలబోట్ డిజైన్ చేసిన ఈ బోట్ స్టేషన్.. మాంటా రే అనే చేప ఆకారాన్ని పోలి ఉంటుంది. అందుకే ఈ ప్రాజెక్టుకూ అదే పేరు పెట్టేశారు. నీటిని శుద్ధి చేసేందుకు కేవలం మొక్కలపైనే ఆధారపడలేదు. పై అంతస్తు అంచుల్లో దాదాపు 3500 చదరపు మీటర్ల మేర సోలార్‌ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. దీంతోపాటు నిలువుగా తిరిగే గాలి మరలనూ వాడుకుంటారు. బోట్ స్టేషన్‌కు ఆనుకుని నదీతీరం వెంబడి ఉండే పార్కుల్లోంచి సేకరించే సేంద్రీయ వ్యర్థాలను బయోమెథనైజేషన్ ప్లాంట్‌కు సరఫరా చేసి అదనపు విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. ఇలా వేర్వేరు మార్గాల ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్తును నీటిశుద్దీకరణకు వాడుకుంటారన్నమాట. భలే ఐడియా కదూ!
– సాక్షి నాలెడ్జ్ సెంటర్