సాకేత్ మైనేని (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్: సియోల్ ఓపెన్ ఏటీపీ–100 చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జోడీ సంచలన విజయంతో బోణీ చేసింది. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ విభాగంలో సాకేత్–రామ్‌కుమార్ ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
తొలి రౌండ్‌లో సాకేత్–రామ్‌కుమార్ జంట 7–6 (7/5), 6–4తో రెండో సీడ్ క్రిస్టియన్ రోడ్రిగెజ్ (కొలంబియా)– రోమియోస్ (ఆస్ట్రేలియా) జోడీని కంగుతినిపించింది. 86 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్–రామ్ జంట ఐదు ఏస్‌లు సంధించింది. ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది.
అనిరుధ్ జోడీ ముందంజ
ఇదే టోర్నీలో ఆడుతున్న హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ భారత్‌కే చెందిన తన భాగస్వామి నిక్కీ కలియంద పూనాచాతో కలిసి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. తొలి రౌండ్‌లో మూడో సీడ్ అనిరుధ్–నిక్కీ ద్వయం 6–3, 7–5తో ఎస్కోఫియర్–బెనోట్ పెయిర్ (ఫ్రాన్స్) జోడీపై గెలిచింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో దివిజ్ శరణ్ (భారత్)–ఇసారో (థాయ్‌లాండ్) జంట 3–6, 5–7తో మొరెనో (అమెరికా)–రూబిన్ స్థాతమ్ (న్యూజిలాండ్) జోడీ చేతిలో ఓడిపోయింది.
రిత్విక్ ద్వయం ముందంజ
సాక్షి, హైదరాబాద్: స్లొవాక్ ఓపెన్ ఏటీపీ–125 చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ–అర్జున్ ఖడే (భారత్) జోడీ ముందంజ వేసింది. స్లొవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఈ టోర్నీ జరుగుతోంది. తొలి రౌండ్‌లో రిత్విక్–అర్జున్ ద్వయం 6–4, 6–4తో భారత్‌కే చెందిన జీవన్ నెడుంజెళియన్–విజయ్ సుందర్ ప్రశాంత్ జంటను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
ఇటీవల కజకిస్తాన్‌లో జరిగిన అల్మాటీ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో టైటిల్ నెగ్గిన రిత్విక్–అర్జున్ ఈ మ్యాచ్‌లో కీలకదశలో పాయింట్లు గెలిచింది. తొలి సెట్‌లో ఒకసారి, రెండో సెట్‌లో ఒకసారి ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను బ్రేక్ చేసి తమ సర్వీస్‌లను కాపాడుకొని విజయాన్ని దక్కించుకుంది.
భారత్‌కే చెందిన శ్రీరామ్ బాలాజీ కూడా డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్‌లో శ్రీరామ్ బాలాజీ (భారత్)–గిడో ఆండ్రెజి (అర్జెంటీనా) ద్వయం 6–3, 6–7 (2/7), 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో ఫ్రాన్సిస్కో కబ్రాల్ (పోర్చుగల్)–మాట్వీ మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జంటను ఓడించింది.
క్వార్టర్ ఫైనల్లో రష్మిక జోడీ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ75 మహిళల టెన్నిస్ టోర్నమెంట్ లో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మికకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సింగిల్స్ విభాగంలో తొలి రౌండ్‌లో ఓడిపోయిన రష్మిక... డబుల్స్ విభాగంలో భారత్‌కే చెందిన తన భాగస్వామి వైదేహి చౌదరీతో కలిసి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.
ప్రపంచ 422వ ర్యాంకర్ గాబ్రియేలా డ సిల్వా ఫిక్ (ఆస్ట్రేలియా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 300వ ర్యాంకర్ రష్మిక 5–7, 3–6తో ఓడిపోయింది. 88 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక నాలుగు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. డబుల్స్ తొలి రౌండ్‌లో రష్మిక–వైదేహి జోడీ 7–6 (7/3), 6–4తో మూడో సీడ్ లీ యు యున్ (చైనీస్ తైపీ)–నీనా వర్గోవా (స్లొవేకియా) జంటపై సంచలన విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment