Business Center
-
తేలియాడే రెస్టారెంట్లు.. రూఫ్‌టాప్ గార్డెన్లు
(సియోల్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) ఒకప్పుడు మురికికూపంగా ఉన్న హాన్ నదిని మూడు దశల్లో అభివృద్ధి చేయాలని 2008లో నిర్ణయించిన దక్షిణ కొరియా ప్రభుత్వం తొలిదశలో నీటిశుద్ధితోపాటు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దింది. స్థానికులతోపాటు విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు నదిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసింది. నదికి ఇరువైపులా తేలియాడే రెస్టారెంట్లు, రూఫ్‌టాప్ గార్డెన్లు, కేఫటేరియాలు, 40కిపైగా షాపింగ్ కాంప్లెక్స్‌లు, యాంఫీ థియేటర్లను నిర్మించింది.పిల్లలంతా ఆహ్లాదంగా గడిపేందుకు వీలుగా 15 పార్క్‌లను అభివృద్ధి చేసింది. 78 కి.మీ. మేర సైకిల్ ట్రాక్‌లు, బైక్ పాత్లను ఏర్పాటు చేసింది. నదిలో జీవవైవిధ్యం దెబ్బతినకుండానే ఈ చర్యలన్నీ చేపట్టింది. దీంతో స్థానిక ప్రజలతోపాటు విదేశీ పర్యాటకులను ఆకర్షించే హాట్‌స్పాట్‌గా హాన్ నది మారింది. నదిలో బోటింగ్, నదీ తీరం వెంబడి సైక్లింగ్, వాకింగ్ ట్రాక్స్, పార్క్‌లతో నిత్యం సందర్శకులతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడుతోంది. ప్రస్తుతం ఏటా సగటున 6.69 కోట్ల మంది పర్యాటకులు హాన్ నదిని సందర్శిస్తున్నారు.తాగునీటి అవసరాలు సైతం తీరుస్తూ..దక్షిణ కొరియాలోని సియోల్ నగరవాసుల తాగునీటి అవసరాలను హాన్ నదే తీరుస్తోంది. హైదరాబాద్ జంటనగరవాసుల దాహార్తిని గతంలో ఎలాగైతే మూసీ తీర్చిందో.. అచ్చం అలాగే హాన్ నది సియోల్ ప్రజలకు జీవనదిగా మారింది. స్వచ్ఛమైన మంచినీటిని సియోల్వాసులకు అందించేందుకు హాన్ నది పరీవాహక ప్రాంత పరిధిలో నాలుగు చోట్ల నీటి ఫిల్టరేషన్ కేంద్రాలను అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నదిలోని నీటి నాణ్యత మెరుగ్గా ఉందని ఐరాస సైతం గుర్తించింది. -
ఎలక్ట్రానిక్ పరిశ్రమలతో తిరుపతికి మరింత ప్రగతి
రేణిగుంట (చిత్తూరు జిల్లా) : ఎలక్ట్రానిక్ పరిశ్రమలను తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో ఎక్కువగా తీసుకొచ్చి ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పించాలనే దృక్పథంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అన్నారు. రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బిజినెస్ సెంటర్ నూతన భవనాన్ని ఆయన శుక్రవారం ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామితో కలసి ప్రారంభించారు. వింగ్‌టెక్ సారథ్యంలో నడుస్తున్న సెల్కాన్ ఫెసిలిటీలో సెల్ఫోన్లు, చార్జర్ల తయారీ విభాగాన్ని పరిశీలించారు. అక్కడి కార్మికులతో మాట్లాడారు. కార్బన్ కంపెనీని పరిశీలించారు. ఇప్పటికే 7 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు, రెండో యూనిట్ పూర్తయితే మరో 7 వేల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని కంపెనీ ప్రతినిధులు మాలిక్, నాగేంద్ర మంత్రికి తెలిపారు. డిక్సన్ ఫేజ్–2 ప్రారంభం.. ఈఎంసీ–2లో నిర్మాణంలో ఉన్న సెవెన్ హిల్స్ డిజిటల్ పార్కును మేకపాటి గౌతంరెడ్డి, నారాయణస్వామి, స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి పరిశీలించారు. డిక్సన్ కంపెనీ ఫేజ్–2 కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. వివిధ కంపెనీల ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతంలో సుమారు 10 వేల మందికి ఉద్యోగావకాశాలు రానున్నట్లు మేకపాటి చెప్పారు. పలు కంపెనీల్లో పనిచేస్తున్న యువతకు సాంకేతిక నైపుణ్యాన్ని అందించేందుకు ప్రభుత్వ నైపుణ్య సంస్థ ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. పరిశ్రమల స్థాపనకు భూములిచ్చిన వారికి ఉద్యోగాల కల్పనలో మొదటి ప్రాధాన్యం ఉంటుందని బియ్యపు మధుసూదన్‌రెడ్డి తెలిపారు. చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, కలెక్టర్ నారాయణ భరత్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
మాయాబజార్!
దేవరకొండ : దేవరకొండ నగర పంచాయతీ.. నగరం నడిబొడ్డులో వ్యాపార కేంద్రంగా ఉన్న మాయాబజార్ దుకాణ సముదాయంలో 35 దుకాణాలను ఇతరులకు అద్దెకిచ్చారు. ఇప్పుడు వాటి విలువ సుమారు రూ.10 కోట్లు. గ్రామపంచాయతీగా ఉన్న సమయంలో అప్పటి పాలకవర్గం 1973లో కొంతమంది వ్యాపారులకు పంచాయతీ స్థలాన్ని లీజుకిచ్చింది. 15 సంవత్సరాల కాలానికి అగ్రిమెంట్ ఇచ్చిన అప్పటి పంచాయతీ ఒక్కో షాపునకు రోజుకు ఒక్క రూపాయ చొప్పున నెలకు అద్దె 30 రూపాయలుగా నిర్ధారించింది. అప్పటి నుంచి ఆ వ్యాపారుల ఆధీనంలో ఉన్న ఈ షాపులపై పాలకవర్గాలు, అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో ప్రస్తుతం ఆ షాపులకే ముప్పొచ్చింది. ప్రస్తుతం ఈ షాపుల వి లువ బాగా పెరిగింది. ఇదే బజార్లో ఈ దుకాణాలకు ఎదురుగా ఉన్న షాపులకు నెల కు రూ. 3 నుంచి 4 వేల రూపాయల అద్దె ఉం డగా, అడ్వాన్సులు రూ.లక్షల్లో ఉన్నాయి. ఇది లా ఉండగా 15 సంవత్సరాల కాల పరిమితి ముగిసినప్పటికీ ఆ తర్వాత పాలకవర్గాలు, అధికారులు ఈ షాపులను స్వాధీనం చేసుకుని బహిరంగ వేలం ద్వారా అద్దెకివ్వాల్సి ఉన్నా పట్టించుకోవలేదు. మరికొంత మంది అధికారులు తమ స్వలాభానికి ప్రాధాన్యతనిచ్చారు. దీంతో ఇప్పటివరకు ఆ షాపులను స్వాధీనపరుచుకున్న దాఖలాలు కానీ, బహిరంగ వేలంలో వేరే వారికి ఇచ్చిందికాని లేదు. 2009లో అగ్రిమెంట్ రెన్యువల్ నిబంధనల ప్రకారం ఆ దుకాణాలను అగ్రిమెంట్ ముగియగానే సదరు దుకాణదారుల నుంచి స్వాధీనపరుచుకుని బహిరంగ వేలం వేయాల్సి ఉన్నా అప్పుడున్న స్థానిక ఒత్తిడితో వారికే రెన్యువల్ చేస్తూ అద్దెను మాత్రం పెంచింది. ఈ షాపులను మూడు కేటగిరీలుగా విభజించి ఎ- కేటగిరికి రూ. 10 వేల డిపాజిట్, నెలకు రూ. 1200 కిరాయిగా, బీ- కేటగిరికి రూ. 8వేలు డిపాజిట్, నెలకు రూ. 800 అద్దెగా, సీ- కేటగిరికి రూ. 5వేలు డిపాజిట్, నెలకు రూ. 400 కిరాయి పొందేలా ఆమోదించింది. ఆ లీజు డబ్బులు ఏమయ్యాయి ? 2009లో తీర్మానం చేసిన ప్రకారం దుకాణపు యజమానులు చెల్లిస్తున్న డబ్బుకు నగర పంచాయతీలో ఇప్పటి వరకు రికార్డే లేదు. ఎవరికి వారు ఇష్టానుసారంగా లీజు డబ్బులు వసూలు చేస్తూ నొక్కేస్తున్నారు. దుకాణపు యజమానులు 2015 మార్చి నెల వరకు ఇప్పటికే అద్దె చెల్లించామని చెబుతున్నా.. ఆ సొమ్ము ఏమైందో ఎవరికీ తెలియదు. డిపాజిట్ల రూపంలో వచ్చిన రూ. 2 లక్షల 73వేలు, నెలకు అద్దె రూపంలో ఈ ఆరేళ్లలో రావాల్సిన రూ. లక్షా 80వేలు మొత్తం సుమారు 5 లక్షల ఆదాయం ఏమైందో అధికారులే తేల్చాలి. 42 ఏళ్లుగా నోటీసుల ప్రహసనం ఈ అద్దె దుకాణాల విషయంలో 42 సంవత్సరాలుగా నోటీసుల ప్రహసనం కొనసాగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు ఖాళీ చేయాలంటూ నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో అధికారులు వెనుకంజ వేయడం తంతుగానే మారింది. ఇప్పటి వరకు షాపులను ఖాళీ చేయించింది గానీ బహిరంగ వేలం ద్వారా అద్దెకిచ్చిన దాఖలాలు కానీ లేవు. ఇటీవల దేవరకొండ నగర పంచాయతీగా పునః వ్యవస్థీకృతమయ్యాక అధికారులు షాపులు ఖాళీ చేయాలని ప్రస్తుత షాపుల యజమానులకు నోటీసులు ఇచ్చారు. ఫైనల్ నోటీస్ నెంబర్ ఎన్.పి.డివికె/189/2014 ప్రకారం ఈ ఏడాది జనవరి 21 వరకు షాపులు ఖాళీ చేయడానికి తుది గడువునిచ్చారు. ఈ గడువు కూడా ముగిసినప్పటికీ అధికారులు స్వాధీనపరుచుకోవడానికి ముందడుగు వేయడం లేదు. దొడ్డిదారిన క్రమబద్ధీకరణకు యత్నం రూ.కోట్ల విలువ చేసే ఈ షాపులను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో నంబర్ 58,59లను తీసుకొచ్చింది. ఈ నిబంధల ప్రకారం ప్రభుత్వ భూములను స్వాధీనపరుచుకుని ఉన్న 150 గజాల లోపు స్థలాన్ని ఉచితంగా క్రమబద్ధీకరించనున్నారు. ఈ క్రమబద్ధీకరణను ఆసరాగా చేసుకుని దుకాణదారులు ఈ భూములు ప్రభుత్వ సర్వే నంబర్ 667గా కారీజు ఖాతాగా పేర్కొంటూ రెవెన్యూ అధికారులకు 35 దుకాణాల యజమానులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే వీటిని సొంతం చేసుకునేందుకు మంతనాలు జరిగిపోయాయి. ఇదిలా ఉండగా ఈ వ్యవహారం నగర పంచాయతీకి చేరడంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఆ భూమి ప్రభుత్వ భూమి కాదని నగర పంచాయతీకి చెందినదని, క్రమబద్ధీకరణ జీఓలో ప్రభుత్వ భూములకు మాత్రమే రెగ్యులరైజ్ చేయాలని ఉందని నగర పంచాయతీ కమిషనర్ స్వామినాయక్, పంచాయతీ చైర్మన్, వైస్ చైర్మన్లు అంటున్నారు. ఈ వ్యవహారంలో చివరకు ఏం జరుగుతుందో వేచిచూడాలి. -
నేడు సీఎం రాక
తిరుపతి, న్యూస్‌లైన్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం జిల్లాకు రానున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఆయన బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి స్పెషల్విమానంలో చెన్నైకి చేరుకుంటారు. హెలికాప్టర్లో సత్యవేడు సమీపంలోని శ్రీసిటీకి ఉదయం 8.40 గంటలకు చేరుకుని అధికార, అనధికార ప్రముఖులతో సమావేశమవుతారు. శ్రీసిటీ బిజినెస్ సెంటర్‌కు చేరుకు ని వివిధ యూనిట్లకు భూమిపూజ నిర్వహిస్తారు. హెలికాప్టర్ ద్వారా 11.45 గంటలకు తిరుపతి ఎస్వీయూ మైదానంలో ఏర్పాటు చేసి న హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 12 గంటలకు తిరుపతిలో నిర్మించనున ్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి శంకుస్థాపన చేస్తారు. అక్కడ నుం చి 12.20 గంటలకు స్విమ్స్‌కు చేరుకుని పద్మావతి మహిళా మెడికల్ కళాశాల, చిత్తూరుకు నీటిసరఫరా పథకాలకు శంకుస్థాన చేస్తారు. జిల్లేళ్లమందలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. 30 ఎకరాల్లో మూడు గ్రౌండ్లు తిరుపతిలో నిర్మించే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి ఎస్వీ యూనివర్సిటీకి చెందిన ముప్పై ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. ఇక్కడ ముఖ్యమంత్రి బుధవారం స్టేడియం పనులకు భూమి పూజ చేయనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చురుగ్గా సాగుతున్నాయి. రూ.30 కోట్ల అంచనాతో మూడు మైదానాల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ప్రణాళికలు సిద్ధం చేసింది. అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌లు ఆడడానికి వీలుగా ఒకటి, రంజీ మ్యాచ్‌ల కోసం మరొకటి, జిల్లా స్థాయి మ్యాచ్‌లకు మరొకటి మొత్తం మూడు మైదానాలు ఏర్పాటు చేయనున్నారు.