దేవరకొండ : దేవరకొండ నగర పంచాయతీ.. నగరం నడిబొడ్డులో వ్యాపార కేంద్రంగా ఉన్న మాయాబజార్ దుకాణ సముదాయంలో 35 దుకాణాలను ఇతరులకు అద్దెకిచ్చారు. ఇప్పుడు వాటి విలువ సుమారు రూ.10 కోట్లు. గ్రామపంచాయతీగా ఉన్న సమయంలో అప్పటి పాలకవర్గం 1973లో కొంతమంది వ్యాపారులకు పంచాయతీ స్థలాన్ని లీజుకిచ్చింది. 15 సంవత్సరాల కాలానికి అగ్రిమెంట్ ఇచ్చిన అప్పటి పంచాయతీ ఒక్కో షాపునకు రోజుకు ఒక్క రూపాయ చొప్పున నెలకు అద్దె 30 రూపాయలుగా నిర్ధారించింది. అప్పటి నుంచి ఆ వ్యాపారుల ఆధీనంలో ఉన్న ఈ షాపులపై పాలకవర్గాలు, అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో ప్రస్తుతం ఆ షాపులకే ముప్పొచ్చింది.
ప్రస్తుతం ఈ షాపుల వి లువ బాగా పెరిగింది. ఇదే బజార్‌లో ఈ దుకాణాలకు ఎదురుగా ఉన్న షాపులకు నెల కు రూ. 3 నుంచి 4 వేల రూపాయల అద్దె ఉం డగా, అడ్వాన్సులు రూ.లక్షల్లో ఉన్నాయి. ఇది లా ఉండగా 15 సంవత్సరాల కాల పరిమితి ముగిసినప్పటికీ ఆ తర్వాత పాలకవర్గాలు, అధికారులు ఈ షాపులను స్వాధీనం చేసుకుని బహిరంగ వేలం ద్వారా అద్దెకివ్వాల్సి ఉన్నా పట్టించుకోవలేదు. మరికొంత మంది అధికారులు తమ స్వలాభానికి ప్రాధాన్యతనిచ్చారు. దీంతో ఇప్పటివరకు ఆ షాపులను స్వాధీనపరుచుకున్న దాఖలాలు కానీ, బహిరంగ వేలంలో వేరే వారికి ఇచ్చిందికాని లేదు.
2009లో అగ్రిమెంట్ రెన్యువల్
నిబంధనల ప్రకారం ఆ దుకాణాలను అగ్రిమెంట్ ముగియగానే సదరు దుకాణదారుల నుంచి స్వాధీనపరుచుకుని బహిరంగ వేలం వేయాల్సి ఉన్నా అప్పుడున్న స్థానిక ఒత్తిడితో వారికే రెన్యువల్ చేస్తూ అద్దెను మాత్రం పెంచింది. ఈ షాపులను మూడు కేటగిరీలుగా విభజించి ఎ- కేటగిరికి రూ. 10 వేల డిపాజిట్, నెలకు రూ. 1200 కిరాయిగా, బీ- కేటగిరికి రూ. 8వేలు డిపాజిట్, నెలకు రూ. 800 అద్దెగా, సీ- కేటగిరికి రూ. 5వేలు డిపాజిట్, నెలకు రూ. 400 కిరాయి పొందేలా ఆమోదించింది.
ఆ లీజు డబ్బులు ఏమయ్యాయి ?
2009లో తీర్మానం చేసిన ప్రకారం దుకాణపు యజమానులు చెల్లిస్తున్న డబ్బుకు నగర పంచాయతీలో ఇప్పటి వరకు రికార్డే లేదు. ఎవరికి వారు ఇష్టానుసారంగా లీజు డబ్బులు వసూలు చేస్తూ నొక్కేస్తున్నారు. దుకాణపు యజమానులు 2015 మార్చి నెల వరకు ఇప్పటికే అద్దె చెల్లించామని చెబుతున్నా.. ఆ సొమ్ము ఏమైందో ఎవరికీ తెలియదు. డిపాజిట్ల రూపంలో వచ్చిన రూ. 2 లక్షల 73వేలు, నెలకు అద్దె రూపంలో ఈ ఆరేళ్లలో రావాల్సిన రూ. లక్షా 80వేలు మొత్తం సుమారు 5 లక్షల ఆదాయం ఏమైందో అధికారులే తేల్చాలి.
42 ఏళ్లుగా నోటీసుల ప్రహసనం
ఈ అద్దె దుకాణాల విషయంలో 42 సంవత్సరాలుగా నోటీసుల ప్రహసనం కొనసాగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు ఖాళీ చేయాలంటూ నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో అధికారులు వెనుకంజ వేయడం తంతుగానే మారింది. ఇప్పటి వరకు షాపులను ఖాళీ చేయించింది గానీ బహిరంగ వేలం ద్వారా అద్దెకిచ్చిన దాఖలాలు కానీ లేవు. ఇటీవల దేవరకొండ నగర పంచాయతీగా పునః వ్యవస్థీకృతమయ్యాక అధికారులు షాపులు ఖాళీ చేయాలని ప్రస్తుత షాపుల యజమానులకు నోటీసులు ఇచ్చారు. ఫైనల్ నోటీస్ నెంబర్ ఎన్.పి.డివికె/189/2014 ప్రకారం ఈ ఏడాది జనవరి 21 వరకు షాపులు ఖాళీ చేయడానికి తుది గడువునిచ్చారు. ఈ గడువు కూడా ముగిసినప్పటికీ అధికారులు స్వాధీనపరుచుకోవడానికి ముందడుగు వేయడం లేదు.
దొడ్డిదారిన క్రమబద్ధీకరణకు యత్నం
రూ.కోట్ల విలువ చేసే ఈ షాపులను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో నంబర్ 58,59లను తీసుకొచ్చింది. ఈ నిబంధల ప్రకారం ప్రభుత్వ భూములను స్వాధీనపరుచుకుని ఉన్న 150 గజాల లోపు స్థలాన్ని ఉచితంగా క్రమబద్ధీకరించనున్నారు. ఈ క్రమబద్ధీకరణను ఆసరాగా చేసుకుని దుకాణదారులు ఈ భూములు ప్రభుత్వ సర్వే నంబర్ 667గా కారీజు ఖాతాగా పేర్కొంటూ రెవెన్యూ అధికారులకు 35 దుకాణాల యజమానులు దరఖాస్తు చేసుకున్నారు.
ఇప్పటికే వీటిని సొంతం చేసుకునేందుకు మంతనాలు జరిగిపోయాయి. ఇదిలా ఉండగా ఈ వ్యవహారం నగర పంచాయతీకి చేరడంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఆ భూమి ప్రభుత్వ భూమి కాదని నగర పంచాయతీకి చెందినదని, క్రమబద్ధీకరణ జీఓలో ప్రభుత్వ భూములకు మాత్రమే రెగ్యులరైజ్ చేయాలని ఉందని నగర పంచాయతీ కమిషనర్ స్వామినాయక్, పంచాయతీ చైర్మన్, వైస్ చైర్మన్‌లు అంటున్నారు. ఈ వ్యవహారంలో చివరకు ఏం జరుగుతుందో వేచిచూడాలి.
మాయాబజార్!
Published Sun, Feb 1 2015 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 8:35 PM
Advertisement
Advertisement