అధికారుల ఉదాసీనత... ప్రశ్నించేతత్వం లేని పాలకవర్గం... పట్టించుకోని ఉన్నతాధికారుల నైజం... వెరసి దేవరకొండ నగర పంచాయతీ పాలన అస్తవ్యస్తంగా మారింది. పాలన పేలవంగా మారడంతో పట్టణ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పంచాయతీకి ఆదాయ వనరులున్నా... అభివృద్ధికి నిధులున్నా... వ్యవస్థ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. అనుమతి లేని వెంచర్లు, పంచాయతీ ఫైళ్ల మాయం, అనధికార నల్లా కనెక్షన్లతో తాగునీటి కష్టాలు, యోచన లేని పన్నుల విధానంతో ఒక్కసారిగా ప్రజలపై పడే పెను పన్నుభారం, మాయాబజార్ దుకాణాల వ్యవహారం, పారిశుద్ధ్యం అస్తవ్యస్తం.. ఇలా సమస్యలు నగర పంచాయతీని పట్టిపీడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గాడి తప్పిన దేవరకొండ నగర పంచాయతీ వ్యవహారంపై ఈ రోజు నుంచి సాక్షి ప్రత్యేక కథనాలు...
దేవరకొండ... ఒకప్పుడు గ్రామపంచాయతీ. ఇప్పుడు నగర పంచాయతీ.. కానీ పరిస్థితిలో కించిత్తు మార్పు లేదు. చెప్పాలంటే పంచాయతీ వ్యవస్థ కంటే నగర పంచాయతీ వ్యవస్థ దుర్భరంగా మారింది. నగర పంచాయతీ కమిషనర్, పాలకవర్గం ప్రజల బాధలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా తాగునీటి కష్టాలు పట్టణ ప్రజలను వేధిస్తున్నాయి. దేవరకొండ పట్టణంలో సుమారు 40వేల జనాభా ఉండగా 3500 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఇది అధికారులు చెప్పే లెక్క. కాని అనధికారికంగా ఈ లెక్క 4వేలను మించిందంటే అతిశయోక్తి కాదు.
ఎందుకీ పరిస్థితి..
దేవరకొండకు కృష్ణా జలాలు సరఫరా అవుతుండగా దేవరకొండ మండలం పెండ్లిపాకల ప్రాజెక్టు నుంచి నిత్యం 10 లక్షల లీటర్ల నీరు దేవరకొండ నీటి సరఫరా సంప్‌కు చేరుతుంది. అదే సమయంలో చింతపల్లి మండలం నసర్లపల్లి వాటర్‌ప్లాంట్ నుండి సుమారు 25 లక్షల లీటర్లు ప్రతి నిత్యం సరఫరా అవుతుండగా రోజుకు 35 లక్షల లీటర్ల నీరు కొండకు చేరుతుంది. దీంతోపాటు అదనంగా పట్టణంలో ఉన్న పలుబోర్ల నుంచి వాడుకకు మరికొన్ని నల్లాలు కూడా అందుబాటులో ఉన్నాయి. సుమారు 40 వేల జనాభా ఉన్న దేవరకొండ పట్టణంలో 35 లక్షల లీటర్ల నీటిని సరాసరిగా పంచితే ఒక్కో ఇంట్లో ఒక్కో వ్యక్తికి సుమారు 80 లీటర్ల నీరు అందాల్సి ఉంది. ఆ ప్రకారం దేవరకొండకు సరఫరా అవుతున్న నీటితో దేవరకొండ ప్రజలకు నిరంతరాయంగా నీరందించే అవకాశం ఉంది. కానీ దేవరకొండ ప్రజలకు కనీసం 10 రోజులకొకసారి కూడా నల్లా నీటిని అందించలేని పరిస్థితి ఉందంటే కేవలం అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణం. ప్రణాళిక లేకపోవడంతో నీరు వృథాగా మారిపోతుంది. అనుమతి లేని నల్లా కనెక్షన్లు నీటిని దోచేస్తున్నాయి. అధికారులు చెబుతున్నట్లు పట్టణంలో 3500 నల్లా కనెక్షన్లు ఉన్నాయని చెబుతున్నా అనధికారికంగా ఈ సంఖ్య మరో 500 కనెక్షన్లను పెంచుతుంది.
నీటి కష్టాలు అన్నీ...ఇన్నీ కావు
దేవరకొండ పట్టణంలో ప్రజలు నీటికి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం పది పదిహేను రోజులకొకసారి కూడా కృష్ణా జలాలు సరఫరా కావడం లేదు. దీంతో పట్టణ ప్రజలు కూడా బోరుబావులు, నీటి ట్యాంకర్ల కొనుగోలుపై ఆధాపడుతున్నారు. ఇదిలా ఉండగా నెల రోజుల కాలంలోనే సుమారు 500 బోర్లకు పైగా వట్టిపోయాయి. అలాగే చాలామంది మళ్ళీ బోర్లు వేయించినప్పటికీ భూగర్భ జలాలు అడుగంటడంతో 500 నుంచి 600 ఫీట్ల మేర లోతు వేయించినా నీరు పడని పరిస్థితి ఉంది. దీంతో చాలా మంది ట్యాంకర్లను ఆశ్రయిస్తుండగా ఒక్కో ట్యాంకర్‌ను రూ. 500 నుంచి 600 వరకు కొనుగోలు చేయాల్సి వస్తుంది. నాలుగు పోర్షన్లు ఉన్న ఒక్కో ఇంటికి మూడురోజులకొకసారి ట్యాంకు నీటిని కొనుగోలు చేయాలంటే వేల రూపాయలు నీటికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కనీసం వాడుకోవడానికి కూడా నీరు లేక జనం అలమటిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. దేవరకొండలో సంప్ హౌస్‌లో బోర్లు ఇటీవల కాలిపోగా నీటికి అంతరాయం ఏర్పడుతుందని తెలిసినా అధికారులు తక్షణమే స్పందించకపోవడం వారి నిర్లక్ష్యానికి నిలువుటద్దం. నగర పంచాయతీలో అదనపు బోర్లు వేయడానికి నిధులు వచ్చి ఉన్నా.. వాటిని ఖర్చు చేసేందుకు అధికారులు లేరన్న వంకతో చోద్యం చూస్తున్నారు.
నీరు వృథా..రూ.లక్షలో హెచ్‌ఎండబ్ల్యూస్‌కు నీటి బకాయిలు
అక్రమ నల్లా కనెక్షన్లు ఉన్నా అధికారులు వాటిని తొల గించేందుకు నిర్ణయం తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. దీంతో కొంత నీరు వృధా అవుతుండగా దేవరకొండలో పైప్‌లైన్ వ్యవస్త అస్తవ్యస్తంగా ఉంది. ఎక్కడ స్విచ్ వేస్తే ఎటు నీరు పోతుందో, ఎన్ని స్విచ్‌లు, ఎన్ని మోటర్లు ఉన్నాయో కూడా పంచాయతీ అధికారులకు సరిగ్గా తెలియదంటే అతిశయోక్తి లేదు. దీంతో నీరు వృథాగా పోతున్నది. నసర్లపల్లి నుంచి దేవరకొండకు నీరు వస్తుండగా చాలాచోట్ల నీరు పక్క దారిపడుతోంది. మధ్యలో ఉన్న గ్రామాలకు, తండాలకు కొంత దేవరకొండ పట్టణానికి వస్తున్న నీరు చేరుతుండగా మరికొంత లీకేజీలతో వృథాగా పోతున్నాయి. పైప్‌లైన్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో సంప్ నుంచి నీరు సక్రమంగా వెళ్లడం లేదు. దీన్ని సరిచేయాలన్న ఆలోచన కూడా అధికారులకు రావడం లేదు. గతంలో పైప్‌లైన్ వ్యవస్తను సరిచేయడానికి అధికారులు నిర్ణయం తీసుకున్నా.. నిధులు, తీర్మానం వంటి ఆటంకాలు ఏర్పడటంతో ఆ ఊసే మరిచారు. సుమారు రోజు 35 లక్షల లీటర్ల నీరు దేవరకొండకు అందుతుండగా హిందుస్తాన్ మెట్రో వాటర్ స్కీం అధికారులకు కిలో లీటర్‌కు రూ.10 చొప్పున చెల్లించాల్సి వస్తుంది. ఇదంతా ప్రజలపై భారంగానే పడుతుంది. నల్లా బిల్లుల రూపంలో వేల రూపాయలు వసూలు చేస్తున్నా పంచాయతీ నీటిని అందించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పంచాయతీ.. పాడుగాను!!
Published Tue, Mar 17 2015 12:17 AM | Last Updated on Sat, Sep 2 2017 10:56 PM
Advertisement
Advertisement