చెన్నై: అధికారంలో ఉన్నవారిలో సమాజంలో చీలిక తెచ్చే వ్యాఖ్యలు చేసే ధోరణి ప్రబలుతోందంటూ మద్రాస్ హైకోర్టు ఆందోళన వెలిబుచి్చంది. ఇలాంటి వ్యాఖ్యలు సమాజంపై చూపే ప్రతికూల ప్రభావం తాలూకు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకోవాలని హితవు పలికింది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సెపె్టంబర్‌లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడం తెలిసిందే.
‘సనాతన ధర్మ నిర్మూలన’పేరిట జరిగిన ఆ సభలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు అందులో పాల్గొన్న అధికార డీఎంకేకు చెందిన పలువురు ఇతర మంత్రులు కూడా మద్దతు పలికారు. ఈ ధోరణిపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రతికూల వ్యాఖ్యలకు దిగే బదులు డ్రగ్స్, అవినీతి, అంటరానితనం తదితర పెడ ధోరణుల నిర్మూలనపై దృష్టి పెడితే మంచిదని వారికి సూచించింది. సదరు మంత్రులపై ఇంకా చర్యలెందుకు తీసుకోలేదంటూ పోలీసులకు తలంటింది.
మంత్రుల వ్యాఖ్యలకు పోటీగా ద్రవిడ సిద్ధాంత నిర్మూలన సదస్సుకు అనుమతించేలా పోలీసులను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను న్యాయమూర్తి స్టవిస్ జి.జయచంద్రన్ కొట్టేశారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘సనాతన ధర్మ నిర్మూలన సభను ఉదాహరిస్తూ, అందుకు పోటీగా సభ పెట్టుకునేందుకు పిటిషనర్ అనుమతి కోరుతున్నారు.
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన మంత్రులు తదితరులపై అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితే వచ్చేది కాదు కదా! పిటిషనర్ విజ్ఞప్తికి అంగీకరించడమంటే సమాజంలో మరింత చీలిక తేవడమే కాదా?’’అని ప్రశ్నించారు. మంత్రుల తీరుపైనా ఈ సందర్భంగా న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెడతామంటూ చేసిన ప్రమాణాలకు విరుద్ధంగా అధికారంలో ఉన్న కొందరు ప్రవర్తిస్తున్న తీరుతో ప్రజలు ఇప్పటికే విసిగిపోయి ఉన్నారు. ఇలాంటి సమావేశాలకు అనుమతినిచ్చి వారికి శాంతిని మరింత కరువు చేయమంటారా?’’అన్నారు.
నా వ్యాఖ్యలకు కట్టుబడ్డా: ఉదయనిధి
చెన్నై: సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు తమిళనాడు యువజన సంక్షేమ మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ పునరుద్ఘాటించారు. ఈ అంశంపై న్యాయ వివాదం తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధమన్నారు. ‘సనాతన ధర్మం కరోనా, మలేరియా, డెంగీ వంటిది. అది సామాజిక న్యాయానికి వ్యతిరేకం. దాన్ని నిర్మూలించాలి‘ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్త దుమారానికి దారితీయడం తెలిసిందే. అణగారిన, పీడిత వర్గాల తరఫున తనలా మాట్లాడానని ఆయన సోమవారం చెప్పుకొచ్చారు. అంబేడ్కర్, పెరియార్ రామస్వామి నాయకర్ వంటి గొప్ప నేతలు కూడా గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment