
సాక్షి, హైదరాబాద్ : బయోడైవర్సిటీ ప్లైఓవర్ కారు ప్రమాదం కేసులో రాయదుర్గం పోలీసులకు మరోసారి చుక్కెదురైంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కృష్ణ మిలన్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. కృష్ణ మిలన్‌రావును జనవరి 3వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని న్యాయస్థానం ఈ సందర్భంగా పోలీసులను ఆదేశించింది. కారు యాక్సిడెంట్ చేసిన వ్యక్తిపై 304(2) సెక్షన్ ఎలా పెడతారని రాయదుర్గం పోలీసులను ప్రశ్నించింది. తదుపరి విచారణను జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది. కాగా, కృష్ణ మిలన్‌రావు నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు కోర్టుకు తెలిపారు. నిందితుడు అధిక వేగంతో దూసుకెళ్లినందునే ఈ ప్రమాదం జరిగినట్లు ఆధారాలు సేకరించామన్నారు. అంతకుముందు నిందితుడిని డిసెంబర్ 12వ తేదీ వరకు అరెస్ట్ చేయరాదని కోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలసిందే.
కాగా, నవంబర్ 23న మధ్యాహ్నం బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పైనుంచి కారు అదుపు తప్పి ఫల్టీలు కొడుతూ రోడ్డుపై పడిన ఘటనలో సత్యవతి(56) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా కుబ్రా(23), బాలరాజ్ నాయక్, ప్రణిత గాయాల పాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment