సాక్షి, సిటీబ్యూరో: విశ్వసనీయ సమాచారం మేరకు నిపుణుల కమిటీ తన నివేదికలో 40 కి.మీ.ల వేగం బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ప్రయాణం సురక్షితమేనని పేర్కొంది. ఇదే సమయంలో ఫ్లైఓవర్‌పై నిర్ణీత వేగం మించి వెళ్లకుండా ఉండేందుకు వేగ నిరోధక చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. ఫ్లైఓవర్‌కు ఇప్పటికే ఉన్న భద్రత చర్యలకు తోడు అదనంగా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని నివేదికలో పేర్కొంది. వివిధ అంశాలను, ఇండియన్ రోడ్ కాంగ్రెస్ ప్రమాణాలను, ఫ్లైఓవర్ డిజైన్, జామెట్రి తదితర అంశా>లను కూలంకషంగా విశ్లేషించిన కమిటీ ఫ్లైఓవర్‌పై వెళ్లే వాహనదారులు వేగ పరిమితి కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. కమిటీ సిఫార్సులకనుగుణంగా జీహెచ్‌ఎంసీ అదనపు భద్రత ఏర్పాట్లను వెంటనే చేపట్టనుంది. ఈ ఏర్పాట్లు పూర్తి చేశాక, నిపుణుల కమిటీ వాటిని పరిశీలించి ప్రయాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాకే జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు తిరిగి వాహన ప్రయాణానికి అనుమతించనున్నారు. మానవ వైఖరి వల్ల, విపరీత వేగం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, వేగాన్ని కట్టడి చేసేందుకు కమిటీ కొన్ని అంశాలు సిఫార్సు చేసినట్లు తెలిసింది. సిఫార్సుల్లో ముఖ్యాంశాలిలా ఉన్నాయి.
చిన్నపాటి స్పీడ్‌బ్రేకర్లు..
♦ సాఫీగా రయ్‌మని దూసుకుపోయేలా ఉన్న ఫ్లైఓవర్‌పై వేగాన్ని తగ్గించకుండా వెళ్లేవారిని కట్టడి చేసేందుకు సాధారణ రంబుల్‌స్ట్రిప్స్‌కు వాడేథర్మోప్లాస్టిక్ పెయింట్ కాకుండా బాగా దృఢంగా ఉండే ప్రత్యేకమైన మెటీరియల్‌ను వాడాలని కమిటీ సిఫార్సు చేసింది.
♦ ప్రత్యేక మెటీరియల్‌తో రంబుల్ స్ట్రిప్స్ 20 మి.మీ. మందంతో ఉండేవి ఒకదాని తర్వాత ఒకటిగా వరుసగా 6 ఏర్పాటు చేయాలి. అంటే ఇవి చిన్నపాటి స్పీడ్‌బ్రేకర్లలా ఉంటాయి. సాధారణంగా రంబుల్‌స్ట్రిప్స్ నగరంలో 2.5 మి.మీల నుంచి 5 మి.మీ., 7.5 మి.మీ. మందంతో వేస్తున్నారు. 20 మి.మీ.ల మందంతో ప్రతి వంద మీటర్ల చొప్పున ఫ్లై ఓవర్ పొడవునా దాదాపు 9 ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. వీటిని అప్పటికప్పుడే అక్కడే తయారు చేసి వేయాల్సి ఉంటుంది. దీన్ని ఇన్‌సిటు రంబుల్‌స్ట్రిప్‌గా వ్యవహరిస్తారు.
♦ ఫ్లై ఓవర్ కర్వ్ ప్రాంతానికి 135 మీటర్లకుముందు కూడా ఇవి ఏర్పాటు చేయాలి.
♦ ప్రస్తుతమున్న క్రాస్ బారియర్ ఎత్తును అదనంగా మరో 1.5 మీటర్లు పెంచాలి.
♦ తద్వారా సెల్ఫీలు తీసుకోవాలనే ఆలోచన రాదు. మానసికంగానూ ధైర్యంగా ఉంటారు.
♦ ఫ్లైఓవర్ పైకి ఎక్కడానికి ముందునుంచే అడుగడుగునా హెచ్చరికలు, వేగపరిమితిని సూచించే సైనేజీలు ఏర్పాటు చేయాలి. వాటిని ఎక్కడెక్కడ ఎలా ఏర్పాటుచేయాలో కూడా కమిటీ సూచించింది.
♦ అందరికీ బాగా కనిపించేలా పెద్దదైన ఓవర్‌హెడ్ సైనేజీని ఫ్లై ఓవర్‌కు దాదాపు 100 మీటర్లకు ముందుగా ఏర్పాటు చేయాలి. దీనిపై వేగపరిమితి 40 కేఎంపీహెచ్ దాటవద్దని, మలుపులున్నాయని సూచించాలి. ఐదున్నర మీటర్ల పొడవుతో దీన్ని ఏర్పాటు చేయాలి. ఓరియన్ విల్లా దగ్గరున్న ఎఫ్‌ఓబీ మీద కానీ, మరో చోట కానీ దీన్ని ఏర్పాటు చేయవచ్చని సూచించారు.
♦ మైండ్‌స్పేస్, మాదాపూర్, కూకట్‌పల్లి వైపు వెళ్లే వారే ఫ్లైఓవర్ ఎక్కాలి. గచ్చిబౌలి, లింగంపల్లి వైపు వెళ్లేవారు ఎక్కరాదు అని తెలుపుతూ కూడా సైనేజీలు ఏర్పాటు చేయాలి.
♦ స్పీడ్ కంట్రోల్ కావడానికి ఏయే లొకేషన్లలో మార్కింగ్‌లు, సైనేజీలు ప్రత్యేకంగా ఎలా ఉండాలో కూడా సిఫార్సు చేశారు.
♦ ప్రమాదం జరిగిన ఫ్లైఓవర్‌పై నిపుణుల కమిటీ సభ్యులు వివిధ రోజుల్లో, రాత్రుళ్లు వివిధ సమయాల్లో నాలుగైదు పర్యాయాలు వివిధ వేగాలతో ప్రయాణించి చూశారు.
♦ కమిటీ సభ్యులు డిజైన్ డ్రాయింగ్‌లు, టెండర్లకు ముందుగా ఆమోదం పొందిన డీపీఆర్, ఈపీసీ ప్రాజెక్ట్ షెడ్యూల్స్, నిర్మాణ డ్రాయింగ్‌లు పరిశీలించారు. బంప్ ఇంటిగ్రేటర్‌తో రఫ్‌నెస్ సర్వే, బ్రిటిష్ పెండ్యులమ్ టెస్టర్‌తో స్కిడ్ రెసిస్టెన్స్, శాండ్ ప్యాచర్ పరీక్ష ద్వారా టెక్స్‌చర్ మీన్ డెప్త్ తదితరాలను అధ్యయనం చేశారు.
♦ నలుగురు నిపుణుల కమిటీలో ప్రపంచబ్యాంకు రోడ్డు సేఫ్టీ విభాగం సలహాదారుప్రొఫెసర్ ఎస్.నాగభూషణ్‌రావు, రోడ్డుసేఫ్టీ, ట్రాఫిక్, ఇంజినీరింగ్ నిపుణులు డా.టి.ఎస్.రెడ్డి, ఓయూ ట్రాఫిక్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీనివాస్ కుమార్, రోడ్‌సేఫ్టీ ఆడిట్ ఎక్స్‌పర్ట్ ప్రదీప్‌రెడ్డిలు ఉండటంతెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment