సాక్షి, హైదరాబాద్: ఒక చోట కుడి వైపు, మరో చోట ఎడమ వైపు ప్రమాదకరంగా ఉన్న మలుపులతో బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ అంటేనే ప్రయాణికుల్లో దడ అని చెప్పాలి. రెండో ప్రమాదంతో నవంబర్ 23న జీహెచ్‌ఎంసీ అధికారులు ఫ్లైఓవర్‌ను మూసి వేశారు. నెల రోజులు దాటినా ఇప్పటి వరకు వాహనాల రాకపోకలు పునరుద్ధరించలేదు. ఇంకా భద్రతా చర్యల పేరిట దిద్దుబాటు పనులు చేపడుతున్నారు. నిపుణుల కమిటీ అధ్యయనం, నివేదికతో దిద్దుబాటు చర్యల్లో కొంత జాప్యం జరిగింది. సరిగ్గా నెల రోజుల క్రితం బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ కారు ప్రమాదంతో ఉలిక్కిపడ్డ ఐటీ కారిడార్, ఆ ఘటన ఇంకా అక్కడి ప్రయాణికుల కళ్లలో మెదులుతూనే ఉంది.
ప్రారంభమైన వారానికే ప్రమాదం...
రూ.69.47 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసుకున్న బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ నవంబర్ 4న ప్రాంభించారు. సరిగ్గా వారం రోజులు తిరగక ముందే నవంబర్ 10న అర్థరాత్రి ఫ్లైఓవర్‌పై సెల్ఫీ దిగుతుండగా ఐ20 కారు అతి వేగంగా వచ్చి ఢీ కొనడంతో ప్రవీణ్(22), సాయి వంశీ రాజు(22) ఫ్లై ఓవర్‌పై నుంచి కిందపడి అక్కడిక్కడే మృతి చెందారు. మరో 13 రోజులకు అంటే నవంబర్ 23న వోక్స్ వ్యాగన్ కారు 105.8 కిలోమీటర్ల వేగంతో వచ్చి ఫ్లైఓవర్‌పై నుంచి పల్టీలు కొడుతూ కిందపడటంతో పసల సత్యవేణి(56) మృతి చెందగా మరో నలుగురికి గాయలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జీహెచ్‌ఎంసీ అధికారులు ఫ్లై ఓవర్‌ను మూసివేశారు.
1200కు పైగా రంబుల్ స్ట్రిప్స్...
బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై 1200కు పైగా రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేశారు. నాలుగు వరుసలుగా చిన్నవి వెయ్యికి పైగా ఉన్నాయి. అడ్డం ఫ్లై ఓవర్ పొడవునా 12 చోట్ల స్పీడ్ బ్రేకర్లుగా రంబుల్ స్ట్రిప్స్ వేశారు. ఫ్లై ఓవర్ పొడవునా నాలుగు వరుసలుగా తెల్ల రంగు, ఎరుపు రంగు క్యాట్ ఐస్‌ను ఏర్పాటు చేశారు. ఫ్లైఓవర్ మధ్యలో ఎడమ వైపు సైడ్ వాల్‌పై రేలింగ్ ఏర్పాటు చేశారు. బయట ఉంచి ఏమి కనిపించ కుండా రేలింగ్‌కు సైనేజీ బోరుల్డను ఏర్పాటు చేయనున్నారు. వంద మీటర్ల పొడవునా రేలింగ్ ఏర్పాటు చేసి సైనేజీ బోర్డులను ఏర్పాటు చేస్తారు. రాయదుర్గం వైపు నుంచి వాహనదారులకు ప్రమాదకరంగా ఉన్న మలుపు వద్ద ఎడమ వైపు వ్యూ కనిపించదు. దీంతో వాహనాలను నెమ్మదిగా నడిపే వీలుంటుంది. స్పీడ్ లిమిట్, మూల మలుపులు, ట్రాఫిక్ నిబంధనలు తెలియజేసే సైన్ బోర్డులను ఫ్లై ఓవర్ పొడవునా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉంచారు. అంతే కాకుండా ప్రత్యేక మెటీరియల్‌తో ఫ్లైఓవర్‌పై స్పీడ్‌లిమిట్ 40 కి. మీ. అని తెలిసేలా రంబుల్ స్ట్రిప్స్ వేశారు. అవసర మైన చోట రబ్బర్ స్పీడ్ బ్రేకర్లు అమర్చనున్నారు.
రోడ్డు దాటాలంటే నరకం...
బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై నుంచి వెళ్లే వాహనాలు ఐకియా వైపు వేగంగా వెళుతుంటాయి.ఫ్లై ఓవర్ ఎండ్ కాగానే 200 మీటర్ల దూరంలో అనేక మంది వలస కూలీలు రోడ్డు దాటుతుంటారు. ఫ్లై ఓవర్ నుంచి రోడ్డుపైకి వచ్చే వాహనాల వేగం ఎక్కువగా ఉండడంతో రోడ్డు దాటే పాదాచారులు ప్రమాదాల బారీన పడే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఇద్దరు కూలీలు మృతి చెందారు. గత నవంబర్ 18న రాత్రి 12 గంటల సమయంలో మై హోం భూజకు వెళ్లేందుకు హౌస్ కీపింగ్ పనులు చేసే నవల్ రాయ్(49), భాగేలు మహతో(56)లు రోడ్డు దాటుతుండగా ఫ్లై ఓవర్ పై నుంచి వేగంగా వచ్చిన ఎక్స్‌యూవీ కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని బహుళ అంతస్తుల నిర్మాణ పనుల్లో వేలాది మంది కూలీలు పని చేస్తున్నారు. నిత్యం ఉదయం, సాయంత్రం, రాత్రి సమయాల్లో రోడ్డు దాటుతుంటారు. ఫ్లై ఓవర్ పై నుంచి వచ్చే వాహనాల వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment