సాక్షి, అమరావతి: దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా జీవ వైవిధ్య పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ నడుం కట్టింది. గ్రామ స్థాయిలో జీవ వైవిధ్య యాజమాన్య కమిటీలు, అక్కడి ప్రత్యేకతలతో జీవ వైవిధ్య రిజిస్టర్లు రూపొందించి జీవ వైవిధ్య సంరక్షణకు పటిష్టమైన పునాదులు వేసింది. 2002లో జీవ వైవిధ్య చట్టం అమల్లోకి వచ్చినా.. రాష్ట్రంలో దాని అమలుకు సంబంధించిన నియమ నిబంధనలకు మాత్రం 2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఆమోదం లభించింది. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వంలో జీవ వైవిధ్య సంరక్షణకు ప్రాధాన్యత పెరిగి ఆ అంశంలో దేశంలోనే అగ్రగామిగా ఎదిగింది.
అన్ని గ్రామాల్లో యాజమాన్య కమిటీలు
జీవ వైవిధ్య చట్టం ప్రకారం రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థల్లో జీవ వైవిధ్య యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేసి.. తద్వారా ప్రజా జీవ వైవిధ్య రిజిస్టర్లను రూపొందించాల్సి ఉంది. కానీ.. జీవ వైవిధ్య మండలి ఏర్పాటైన 13 సంవత్సరాల వరకు దాని గురించి ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. మిగిలిన రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో జాతీయ హరిత ట్రిబ్యునల్ 2020 డిసెంబర్‌లోపు అన్ని స్థానిక సంస్థల్లోను వాటిని ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో 2020 జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం జీవ వైవిధ్య మండలికి పీసీసీఎఫ్ (ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్) స్థాయి అధికారిని సభ్య కార్యదర్శిగా నియమించడంతో మండలి కార్యకలాపాలు ఊపందుకున్నాయి. సిబ్బంది కొరతను అధిగమించడానికి ప్రతి మండలానికి ఒక స్వచ్ఛంద సేవా సంస్థను కో–ఆర్డినేటర్‌గా మండలి నియమించింది. రాష్ట్రంలో మొత్తం 14,157 స్థానిక సంస్థల్లో ఈ కమిటీలు ఏర్పాటు చేయగా.. వాటిలో 13,363 గ్రామ పంచాయతీ స్థాయివి కాగా 661 మండల పరిషత్, 13 జిల్లా పరిషత్ స్థాయి కమిటీలు ఉండటం విశేషం. ఆ తర్వాత రాష్ట్రంలోని ప్రధాన యూనివర్సిటీల్లో జీవ శాస్త్ర శాఖాధిపతులను సంప్రదించి జీవ వైవిధ్య రిజిస్టర్లను తయారు చేసే పనిలో పాల్గొనేలా చేసింది.
సమగ్ర కార్యాచరణ అమలు
జీవ వైవిధ్య కమిటీలు పని చేసేందుకు 15 అంశాలతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను తయారు చేశారు. గ్రామ వనాలు, మండల, జిల్లా స్థాయిలో జీవ వైవిధ్య ఉద్యాన వనాలు ఏర్పాటు, అంతరించే జాతుల నర్సరీలను పెంచడం, మొక్కలు నాటడం, చెరువులు, కుంటలను శుభ్రం చేయడం, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం, సేంద్రియ, ప్రకృతి వ్యవసాయాన్ని పెంపొందించడం, స్కూళ్లు, కాలేజీలలో మొక్కలు నాటడం, మహిళా సంఘాలు, యువతకు అవగాహన కార్యక్రమాలు, స్థానిక వైద్యులు, నాటు వైద్యులను గుర్తించి వారి వద్ద ఉన్న జ్ఞానాన్ని గ్రంథస్తం చేయడం వంటి పనులను ఈ కమిటీలు చేయాల్సి ఉంటుంది.
అంతేకాకుండా అన్ని స్థానిక సంస్థల సర్పంచ్‌లు, గ్రామ సచివాలయ కార్యదర్శులు, క్రియాశీలక సభ్యులతో జాయింట్ బ్యాంక్ ఖాతాలను తెరిపించి వారికి మంజూరు చేసిన నిధులను బదిలీ చేశారు. ఇప్పటివరకు 10 వేల గ్రామ పంచాయతీలకు రూ.75 వేల చొప్పున మొదటి విడతగా రూ.12 కోట్లను బదిలీ చేశారు.
జీవ వైవిధ్య సంరక్షణలో ఓ మైలురాయి
అన్ని స్థానిక సంస్థల్లోనూ 15 సంవత్సరాల నుంచి అసంపూర్తిగా ఉన్న జీవ వైవిధ్య యాజమాన్యాల కమిటీలను అతి తక్కువ కాలంలో పూర్తి చేయడం జీవ వైవిధ్య సంరక్షణలో ఒక మైలు రాయి. ఇది దేశం మొత్తంలో మన రాష్ట్రానికి ఒక ప్రత్యేకతను, ఒక విశిష్టమైన గుర్తింపును తీసుకువచ్చింది. ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఏపీలో జీవవైవిధ్య సంరక్షణకు సంస్థాగత నిర్మాణం జరిగింది.
– దెందులూరి నళినీమోహన్, అటవీ శాఖ పూర్వ పీసీసీఎఫ్, జీవ వైవిధ్య మండలి రిటైర్డ్ సభ్య కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment