జీవవైవిధ్యానికి దర్పణం
వ్యక్తిగత సక్సెస్‌స్టోరీలంటే బాగా డబ్బు సంపాదించిన వారి గురించి ప్రస్తావించుకోవడం, దేశాల సక్సెస్‌స్టోరీలంటే పారిశ్రామిక ప్రగతి సాధించిన వాటి గురించి మాట్లాడుకోవడం... ప్రపంచం దృష్టిలో చెప్పుకోదగ్గ సక్సెస్ అంటే ప్రస్తుతానికి ఇదే! ఇలాంటి వెల్లువకు భిన్నమైన విజయగాథ ఇది. చీకటి ఖండంలోని ఒక దేశం కథ. ఆ దేశం పేరు నమీబియా. ఎడారి దేశమే అయినా జీవవైవిధ్యాన్ని కాపాడటంలో, ప్రకృతి పరిరక్షణలో ఉత్తమమైనదిగా గుర్తింపు పొందింది ఈ దేశం. భూమి అంటే అది దున్నేవాడిదే కాదు, వాడితో పాటు మనుగడ సాగిస్తున్న జంతుజాలాలకు, వృక్షాలకు దాంట్లో వాటా ఉంటుందని నమ్మి, వాటి వాటా వాటికి ఇచ్చేసి జీవవైవిధ్యానికి ప్రాధాన్యమిస్తున్న దేశం నమీబియా.
ప్రకృతి పరిరక్షణ కోసం ప్రతి దేశం కొన్ని నియమాలు పెట్టుకొంది, అయితే అవన్నీ చెప్పుకోవడానికి మాత్రమే. నమీబియాలో మాత్రం నీతులు, సూక్తులు మాటల్లో కాదు ఆచరణలో దర్శనమిస్తాయి.
విస్తీర్ణం విషయంలో ప్రపంచంలో 34వ స్థానంలో ఉన్నప్పటికీ, జంతుజాలాల కోసం ఎక్కువ భూభాగాన్ని అభయారణ్యాలుగా వదిలేసిన జాబితాలో మాత్రం ఈ దేశం తొలి స్థానంలో నిలుస్తుంది. ఈ దేశంలో 42 శాతం భూభాగం అభయారణ్యమే. చాలా ఏళ్ళపాటు తెల్లవాళ్ల పాలనలో ఉండిపోయిన ఈ దేశం, స్వాతంత్య్రం పొంది కేవలం పాతికేళ్లు మాత్రమే అయింది. వెంటనే ఏర్పాటైన ప్రభుత్వం ప్రజల విషయంలోనే కాక, జంతు పరిరక్షణపై కూడా దృష్టిసారించి, ‘ప్రకృతి పరిరక్షణ కోసం ఎవరు మంచి మాటలు చెప్పినా విని, వాటిని అమలులో పెడదాం.
నమీబియన్లుగా ప్రకృతి పరిరక్షకులుగా నిలుద్దాం..’ అనేది ఆ దేశరాజ్యాంగంలోని ఆర్టికల్ 95 గా రాసుకొన్నారు.
ఇతర ఆఫ్రికన్ దేశాలన్నీ మైనింగ్, పారిశ్రామికీకరణ అంటుంటే.. నమీబియా మాత్రం వాటికి దూరంగా అడవుల్లోనే ఉండిపోవాలని బలంగా నిర్ణయించుకొంది. చెట్లను నరికి అడవులకు నిప్పెట్టి గాలినీ, నీటిని కలుషితం చేసి తెచ్చుకొనే అభివృద్ధి తమకు అనవసరమని నమీబియా పాలకులు, ప్రజలు ప్రకృతి పరిరక్షణలో మునిగి తేలుతున్నారు.
ఈ విషయంలో ఐక్యరాజ్యసమితితో పాటు అనేక సంస్థలు వీరి కృషిని గుర్తించి, అనేక అవార్డులతో సత్కరిస్తూనే ఉన్నాయి. పారిశ్రామిక ప్రగతి లేకపోతే ఆ దేశం అభివృద్ధి చెందేదెలా? అని కొన్ని అమాయకపు బుర్రలు ప్రశ్నించవచ్చు. కానీ ఆర్థిక ప్రగతిలో కూడా ఈ దేశం వెనుకపడలేదు. జీవవైవిధ్యానికి నిలువెత్తు దర్పణమైన ఈ దేశం ‘పర్యాటకుల స్వర్గం’ మారింది. దీంతో పర్యాటక పరిశ్రమ నిధుల వనరుగా మారి విదేశీమారకాన్ని ఆర్జించి పెడుతోంది.