జీవ వైవిధ్య పరిరక్షించుకుందాం
– జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్
కర్నూలు (అర్బన్): జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకుందామని, ఇందుకు గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, నగర పాలక, పురపాలక సంస్థల్లో యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్ అన్నారు. మంగళవారం ఉదయం నగరంలోని ఓ హోటల్‌లో జీవవైవిధ్య మండలి ఆధ్వర్యంలో ‘‘జీవ వైవిధ్య భావనలు, జీవ వైవిధ్య చట్టం, జీవవనరుల వినియోగం ద్వారా వచ్చే లాభాలు’’ అనే అంశంపై జిల్లా స్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఏపీఎస్‌బీడీబీ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు) చైర్మన్ ఎస్.బి.ఎల్.మిశ్రా, మెంబర్ సెక్రటరీ రమేష్ కుమార్ సుమన్, డీపీఓ బి.పార్వతి, వ్యవసాయ శాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ, కర్నూలు, నంద్యాల డీఎఫ్‌ఓలు డి.చంద్రశేఖర్, శివ ప్రసాద్, జడ్పీ డిప్యూటీ సీఈఓ డి.ప్రతాపరెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ప్రస్తుతం శబ్ద, వాతావరణ కాలుష్యం అధికమవ్వడంతో జీవరాశులు కనుమరుగు అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీఎస్‌బీడీబీ చైర్మన్ ఎస్.డి.ఎల్.మిశ్రా మాట్లాడుతూ బయోడైవర్సిటీ మేనేజ్‌మెంట్ కమిటీలు పీపుల్స్ బయో డై వర్సిటీ రిజిష్టర్ల తయారీకి ఉపయోగపడతాయన్నారు. ఈ రిజిష్టర్లు స్థానిక జీవసంబంధ వనరుల లభ్యత, జ్ఞానం, ఔషధ ఇతర ఉపయోగాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కలిగి ఉంటాయన్నారు.
మెంబర్ సెక్రటరీ రమేష్ కుమార్ సుమన్ మాట్లాడుతూ మానవ సంఘాలు, సంస్కృతుల మనుగడ, జీవ వైవిధ్యం మీద ఆధారపడి ఉంటుందన్నారు. సదస్సుకు రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎల్.వరలక్ష్మి, వివిధ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు డాక్టర్ బి.రవిప్రసాదరావు, డాక్టర్ టి.రవిశంకర్, డాక్టర్ ఎం.సుబ్బారావు, శ్రీశైలం ఫీల్డ్ డైరెక్టర్ ఎస్.శరవనన్, జిల్లా కోఆర్డినేటర్ జి.రాముడుతో పాటు ఈఓఆర్‌డీ, ఎంపీడీఓ, అటవీ శాఖకు చెందిన అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.