సాక్షి, సిటీబ్యూరో: బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై గత నవంబర్‌లో జరిగిన ప్రమాదం నేపథ్యంలో కొత్తగా నిర్మించే ఫ్లైఓవర్లన్నింటితోపాటు పాతవాటికి కూడా తగిన సేఫ్టీ ఏర్పాట్లు తీసుకోవడమే కాక.. నిపుణుల కమిటీ సూచనకనుగుణంగా అవసరాన్ని బట్టి అదనపు సేఫ్టీ ఏర్పాట్లు కూడా చేయాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. బయోడైవర్సిటీఫ్లెఓవర్ కారణంగా ముగ్గురు మృతి చెందడంతో ఫ్లైఓవర్ డిజైన్‌లోనే లోపాలనే ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తడం తెలిసిందే. స్వతంత్ర నిపుణుల కమిటీ సూచనలకనుగుణంగా ప్రయాణికులు వేగనిరోధక చర్యలు పాటించేందుకుఅవసరమైన సైనేజీలతోపాటు రంబుల్‌స్ట్రిప్స్ పెంచడం.. ప్రత్యేక మెటీరియల్‌తో రబ్బర్‌స్ట్రిప్స్ ఏర్పాటు చేయడం తెలిసిందే.
ఈ అనుభవం నేర్పిన పాఠంతో ప్రస్తుతంపురోగతిలో ఉన్న ఫ్లై ఓవర్లకు, కొత్తగా చేపట్టబోయే ఫ్లై ఓవర్లకు అన్నింటికీ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను సిఫార్సు చేసేందుకు స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని, ఫ్లై ఓవర్లు పూర్తయ్యాక కూడా సదరు నిపుణులతో సేఫ్టీ ఆడిట్ చేశాకే అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. పనిలోపనిగా ఇప్పటికే వినియోగంలో ఉన్న పాత ఫ్లై ఓవర్లకు కూడా కమిటీ సిపార్సుల మేరకు తగిన సేఫ్టీ ఏర్పాట్లు చేయాలని యోచిస్తున్నారు. అన్ని ఫ్లై ఓవర్లకు కూడా వేగ పరిమితి హెచ్చరికలు, రంబుల్‌స్ట్రిప్స్‌తోపాటు క్రాష్‌బారియర్స్, వ్యూకట్టర్స్ తదితరమైన వాటితో రీడిజైన్‌లకు సిద్ధమవుతున్నారు. అంతేకాదు.. బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌కు తీసుకున్న సేఫ్టీ ఏర్పాట్లన్నీ కూడా తీసుకోనున్నారు. ముఖ్యంగా రెండో వరుసలో భూమికి దాదాపు 20మీటర్ల ఎత్తులో నిర్మించే ఫ్లై ఓవర్ల విషయంలో మరింత శ్రద్ధతో వీటిని అమలు చేయనున్నారు.
రెండో వరుస ఫ్లై ఓవర్లపై ప్రత్యేక శ్రద్ధ..
వ్యూహాత్మక రహదారుల పథకం(ఎస్సార్‌డీపీ)లో భాగంగా దాదాపు రూ.25వేల కోట్లతో ఫ్లై ఓవర్లు, ఎక్స్‌ప్రెస్‌వేలు, తదితర పనులకు జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టడం తెలిసిందే. ఇందులో భాగంగా వివిధ దశల్లోని పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు రూ. 3వేల కోట్ల విలువైన పనులుపురోగతిలో ఉన్నాయి. వీటిల్లో రెండో వరుసలో వచ్చే ఫ్లై ఓవర్లు కొన్ని ఉన్నాయి. బైరామల్‌గూడ జంక్షన్ వద్ద ఒవైసీ హాస్పిటల్‌వైపు నుంచి నాగార్జునసాగర్ రోడ్‌వైపు, విజయవాడ రోడ్‌వైపు వెళ్లే ఫ్లై ఓవర్ రెండో వరుసలో రానుంది. దాదాపు కిలోమీటరు పొడవుండే ఇది దాదాపు 15 మీటర్ల కంటే ఎత్తులో ఉంటుంది. అలాగే ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వైపు వెళ్లేందుకు నిర్మించే స్టీల్‌బ్రిడ్జి అత్యంత ఎత్తులో భూమికి 20 మీటర్ల ఎత్తులోరానుంది. ఉప్పల్ జంక్షన్ వద్ద , ఇతరత్రా ప్రాంతాల్లోనూ రెండో వరుసలో ఫ్లై ఓవర్లు రానున్నాయి. దుర్గంచెరువుపై నిర్మించే కేబుల్ బ్రిడ్జి కూడా 20మీటర్ల ఎత్తులో రానుంది. అది చెరువుపైన ఉంటుంది కనుక దాని విషయంలో మరిన్నిజాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారు.
అంతేకాదు.. భవిష్యత్‌లో ఓఆర్‌ఆర్ వరకు ఎక్కడ ఫ్లై ఓవర్ నిర్మించినా రెండు, మూడు వరుసల్లో నిర్మించాలనే యోచన ఉంది. ప్రస్తుతానికి ఒక వరుస మాత్రమే అవసరమైనా భవిష్యత్ అవసరాల కనుగుణంగా భూసేకరణ కష్టాలు లేకుండా ఉండేందుకు, ప్రాజెక్టుల వ్యయం పెరగకుండా ఉండేందుకు నాగపూర్ తదితర నగరాల్లో మాదిరిగా రెండు వరుసల్లో ఫ్లై ఓవర్లు నిర్మించే యోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక వచ్చే ఫ్లై ఓవర్లన్నింటికీ సేఫ్టీ ఆడిట్ కీలకంగా మారింది. సేఫ్టీ ఏర్పాట్ల వల్ల పెరిగే అదనపు లోడ్‌ను కూడా దృష్టిలో ఉంచుకొని నిర్మాణం ఆరంభం నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారు. పాత ఫ్లై ఓవర్లు ఎంతోకాలంగా వినియోగంలో ఉన్నందున సేఫ్టీ ఆడిట్ అవసరం లేదనే అభిప్రాయాలున్నా, ఎందుకైనా మంచిదనే తలంపుతో అవసరమని భావించిన వాటికి మాత్రం పాతవాటికి కూడా సేఫ్టీ ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు.కాగా ప్రమాదం అనంతరం
కొద్ది రోజులు మూసివేసి...ఇటీవల అందుబాటులోకి తెచ్చిన బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై సేఫ్టీ మెజర్స్‌ను నెలరోజుల పాటు పరిశీలించి..అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ ప్రారంభంలో పెద్ద గ్యాంట్రీ (ఓవర్‌హెడ్) సైన్‌బోర్డును ఏర్పాటు చేయాల్సిందిగా నిపుణుల కమిటీ సూచించినా, ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఆపనులు సాధ్యం కాకపోవడంతో చేపట్టలేదు. సంక్రాంతి సెలవుల సందర్భంగా నగరంలో ట్రాఫిక్ తగ్గుతుంది కనుక ఆ సమయంలో గ్యాంట్రీ నిర్మాణం చేపట్టనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment