
రాయదుర్గం: గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై రాకపోకలు మళ్లీ ప్రారంభమయ్యాయి. శనివారం ఉదయం 9.30 గంటల నుంచి వాహనాలను పోలీసులు అనుమతించారు. రాయదుర్గం మీదుగా మాదాపూర్ వెళ్లే వాహనాలను ఈ ఫ్లైఓవర్ మీదుగా వెళ్లేందుకు అనుమతించారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, ట్రాఫిక్ డీసీపీ విజయకుమార్, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ హరిచందన, జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసు అధికారులు తమ వాహన శ్రేణితో ఫ్లైఓవర్‌పై ట్రయల్‌రన్ నిర్వహించారు. అనంతరం ఇతర వాహనాలను అనుమతించారు. నవంబర్ 23న ఈ ఫ్లైఓవర్‌పై కారు ప్రమాదం చోటు చేసుకోవడంతో గత 42 రోజులుగా వాహనాల రాకపోకలను నిలిపివేసిన విషయం తెలిసిందే.
సీసీ కెమెరాలు, సైన్ బోర్డుల ఏర్పాటు...
ఫ్లైఓవర్‌పై ప్రమాదాలు చోటుచేసుకోకుండా అధికారులు పలు చర్యలు చేపట్టారు. 40 కిలోమీటర్లకు మించి వేగంగా వెళ్లరాదని రోడ్డుపై అక్కడక్కడా రబ్బర్ స్ట్రిప్స్, సైన్ బోర్డుల ఏర్పాటుతోపాటు సైడ్‌వాల్ రీలింగ్‌ను మరింత ఎత్తుకు పెంచారు. అలాగే స్పీడ్ బ్రేకర్లు, సీసీ కెమెరాలు, మలుపులను సూచించే బోర్డులు ఏర్పాటు చేశారు. భారీ వాహనాలకు, పాదచారులకు అనుమతిలేదని బోర్డులు పెట్టారు.