వేసవి మధ్యాహ్నం, మండుటెండలు! పని మీద బయటకు వెళ్తూ ఉండగా, రోడ్డు మీద ఓ పక్షి పడిపోయి ఉంది. అయ్యో! చనిపోయినట్టుంది. మరీ రోడ్డు మధ్యన ఉందే, తీసి పక్కన గుబుర్లలో పడేద్దాం అనుకొని ఆ రంగు రంగుల పక్షిని చేతితో లేవ దీసాను. అది చనిపోలేదు! దాని గుండె చప్పుడు నాకు స్పష్టంగా తెలిసింది. 'అయ్యో! ఎండ దెబ్బకు పడిపోయినట్టు ఉంది. పని మీద ఎక్కడికో వెళ్తూ దీనిని వెంట తీసుకెళ్ళడం సాధ్యం కాదు. ఏం చేయాలో తెలియట్లేదే!' అని నిస్సహాయంగా పక్కనున్న ఫుట్ పాత్ మీద పెట్టేసి వెళ్ళిపోయాను. ఆ పిట్టకి ఏ సహాయం చెయ్యలేదు అన్న భావన చాలా రోజులు నన్ను తొలిచి వేసింది. హైదరాబాద్ నగరం నడిబొడ్డున అంత రంగురంగుల పక్షి ఒకటి ఉండగలదు అన్న విషయం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇళ్ళల్లో పంజరాల్లో పెంచుకునే లవ్ బర్డ్స్ కే అన్ని రంగులు ఉంటాయి అనుకునే నాకు ఇలా బయట స్వేచ్ఛగా తిరిగే పక్షుల్లో కాకి, కోయిల, పావురం, పిచ్చుక , గోరింక కాని ఇటువంటి పక్షి పేరేమిటో తెలియలేదు.
ఓ సంవత్సరం తరువాత మా అయిదేళ్ల అబ్బాయితో పాటు పక్షులను గమనించడం, వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టాను. కనీసం 20-30 రకాల పక్షులు మన చుట్టూ మనతో పాటే ఉంటాయని, అప్పటివరకు నేనే వాటిపై ఎప్పుడూ దృష్టి పెట్టలేదని, అప్పుడు తెలిసింది
హైదరాబాద్ నగరంలో కూడా పక్షులను గమనించే అవకాశాలు ఎన్నో ఉన్నాయని క్రమేపి నాకు అర్ధం అయ్యింది. బోలెడన్ని చెరువులు, కెబీఆర్ పార్క్ , సంజీవయ్య పార్క్ లాంటి ఉద్యానవనాలు, దట్టమైన చెట్లతో నిండిన ఉస్మానియా మరియు HCU లాంటి విశ్వవిద్యాలయ ప్రాంగణాల వంటి ప్రదేశాల్లో చెట్ల పై విహరించే పక్షులే కాక, చిత్తడి ప్రాంతాలలో నివసించే పక్షులు ఎన్నో మనకు కనిపిస్తాయి.
చెరువుల వద్ద ఏడాది పొడవునా మనకు కనిపించే పక్షులలో నీటి కాకి(Cormorant), చుక్క ముక్కు బాతు (Indian Spot- billed Duck), తెల్ల బొర నీటి కోడి (White -breasted water hen) , ఊదా చెంచు కోడి (Grey-headed swamphen), నల్ల బొల్లి కోడి ( Eurasian Coot), గుడ్డి కొంగ (Indian Pond Heron) లాంటివి కొన్ని. ఇవే కాకుండా శీతా కాలంలో ఉత్తర అర్ధగోళంలో ఉన్న ప్రదేశాలలో తీవ్రమైన చలి నుండి తప్పించుకోవడానికి కొన్ని వేల మైళ్ళు ప్రయాణించి దక్షిణ భారత దేశానికి వచ్చే వలస పక్షులు కూడా కనువిందు చేస్తాయి. అటువంటి పక్షుల్లో ఒకటి నార్తెన్ షవెలర్. ఈ పక్షులు ఉత్తర ఆసియా నుంచి భారతదేశానికి ప్రయాణించి హైదరాబాద్ లో మనకు డిసెంబర్, జనవరి , ఫిబ్రవరి నెలలలో ఎక్కువ లోతు లేని కొన్ని చెరువులలో కనిపిస్తాయి. గత సంవత్సరం కాప్రా ఇంకా యాప్రాల్ చెరువుల్లో నేను మొట్ట మొదటి సారి వీటిని గుంపులు గుంపులుగా చూసి చాలా సంతోషించాను. అలానే శీతాకాలపు నెలలలో వలస వచ్చే పూకొంగలు (flamingo) కూడా అమీన్ పూర్ లాంటి చెరువుల్లో కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ నీటి లోతు ఎక్కువగా ఉన్నా, వాటికి అనుకూలమైన పరిసరాలు లేకున్నా, అక్కడ బస చెయ్యకుండా వేరే ప్రాంతాన్ని వెతుక్కునే ప్రయత్నంలో వెళ్ళిపోతాయి. పిట్టలకి ఎంత తెలివో కదా!
పక్షుల గురించి నేర్చుకునే ప్రయాణంలో ఎప్పుడో నేను ఫుట్ పాత్ పై ఉంచి వెళ్ళిపోయిన పక్షి ఏంటో తెలిసింది. అది హిమాలయాల నుంచి దక్షిణ భారత దేశానికి వలస వచ్చే పొన్నంగి పిట్ట (Indian Pitta). 'పిట్ట కొంచెం ఆహార్యం ఘనం' అన్న నానుడికి తగ్గట్టు ఉంటుందని, ఈ పిట్టను హిందీలో 'నవ్ రంగ్'- (తొమ్మిది రంగులు కలది) అంటారు. ఉదయం మరియు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మాత్రమే ఒకటి, రెండు సార్లు దాని కూత వినిపిస్తుంది కాబట్టి, దానిని 'ఆరు మణి కురువి' (ఆరు గంటల పిట్ట) అని తమిళంలో అంటారు. ఇంతటి ఆసక్తికరమైన పక్షి సాధారణంగా దట్టమైన చెట్లున్న ప్రాంతాల్లో, నేలపై రాలిన ఆకుల నడుమ పురుగుల కోసం వెతుకుతూ కనిపించవచ్చని, అంత తేలికగా నగరం నడిబొడ్డున కనబడదన్న విషయం కూడా తరువాత తెలిసింది. కొన్ని సార్లు వాటి సుదీర్ఘ ప్రయాణంలో అలసిపోయి, నీరసించి నెలకొరగడం జరగవచ్చట. నేను చూసిన పిట్ట వేసవి ముదిరేలోపు దాని తిరుగు ప్రయాణం సాగిస్తూ, నేల రాలి ఉండవచ్చు అన్న సంగతి నాకు బోధపడింది. అలా జరిగినప్పుడు, అవి పుంజుకోవాలంటే నీడగా ఉన్న ప్రదేశంలో ఉంచి, కొంత గ్లూకోస్ కలిపిన నీరును పట్టించినట్టయితే, రెండు రోజుల్లో మళ్ళీ ప్రయాణానికి సిద్ధమయిపోతాయట. ఉదయం లేక సాయంత్ర సమయాల్లోనే మనకు ఎక్కడైతే అది నెలకొరిగిందో అక్కడికే తీసుకు వెళ్లి వదిలిపెట్టినట్టైతే, వాటి మానాన అవి వెళ్ళిపోతాయని పక్షి సంరక్షకులు చెబుతారు.
ఒక్క చిన్న పిట్ట వెనుకే ఇన్ని విశేషాలుంటే, మరి మన దేశంలో ఉన్న వేల పక్షుల వెనుక ఎన్ని రహస్యాలు దాగున్నాయో అనిపించడం సహజం. పక్షుల గురించి తెలుసుకోవాలి అన్న ఆసక్తి ఉన్నవారికి సహాయపడటానికి వివిధ యా ప్స్ ఉన్నాయి. ఆ పక్షి సుమారుగా ఎంత పెద్దదో (కాకంత, పిచ్చుకంత, బాతంత), ఏ రంగులు కలదో, మనకు అది ఎక్కడ కనిపంచిందో (నీళ్లలో, తీగలపై, కొమ్మల మీద, నెల మీద ) - ఇటువంటి వివరాలను మనం యాప్ లో పొందు పరచినట్టైతే, మనం ఈ పక్షిని చూసిన ప్రాంతాన్ని(GPS location) బట్టి అది ఏ పక్షి అయ్యి ఉండచ్చో కూడా Merlin యాప్ సలహాల పట్టికను మనకు అందిస్తుంది. అంతే కాదండోయ్, ఆ పక్షుల అరుపులు, పాటల రికార్డింగులు కూడా మన వినగలిగే అవకాశం ఉంది.
e -bird అన్న యాప్ మనకు ఇంకొన్ని విధాలుగా సహాయ పడుతుంది. పక్షులను గమనించడానికి ఏదైనా ఓ ప్రదేశానికి వెళ్తున్నట్టయితే, ఆ ప్రాంతంలో, ఆ ఋతువు /నెలలో ఏయే రకాల పక్షులు కనిపించగలవు అన్న జాబితా మనకు అందుబాటులో ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళినపుడు మనకు కనిపించిన పక్షుల పేర్లన్నీ యాప్ లోనే నమోదు చేసే వీలు కూడా ఉంది. మనం తయారు చేసిన జాబితా మనలా అక్కడికి వెళ్లాలని అనుకునే సందర్శకులకు కూడా ఉపయోగ పడుతుందన్నమాట.
మరి, ఆలస్యమెందుకు? మన చుట్టూ ఎగురుతూ కనిపించే ఈ అద్భుత ప్రాణుల ప్రపంచంలోకి ప్రవేశించాలంటే అడవుల్లోకే వెళ్ళక్కర్లేదు. ఓ బైనాక్యులర్స్ చేతబట్టుకుని మీ పిట్ట గోడ వద్ద కూర్చుంటే చాలు. వాటి విన్యాసాలతో మీకు అవే స్వాగతం పలుకుతాయి!
రచయిత: VS పవిత్ర
ఫోటో గ్రాఫర్ : శ్రీరామ్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment