ఐడియా ప్రకారం తయారు చేసిన బాటిల్, ఆడుతుపాడుతూ పనిచేస్తూ , చెట్టుకు కట్టిన ఆహారం నింపిన బాటిల్
కర్ణాటక, దొడ్డబళ్లాపురం: మనసుంటే మార్గం...అంటారు పెద్దలు...వంద మంచి మాటలు చెప్పడం కన్నా ఒక మంచి పని చేసి చూపించడం మేలు అంటారు ఈ యువతీ యువకులు... అవును...మొన్నటికి మొన్న పట్టణంలో వందలాది ఖాళీ వాటర్ బాటిళ్లు సేకరించి నీరు లభించక ఎండిపోతున్న వందలాది మొక్కలకు బిందు సేద్యం తరహాలో నీరు కట్టి శభాష్ అనిపించుకున్న యువతీ యువకుల స్టోరీ మీకు తెలిసిందే. దొడ్డ పట్టణంలో వివిధ రంగాల్లో స్థిరపడి ఉద్యోగాలు చేసుకుంటున్న సుమారు పాతికమంది యువతీ యువకులు ‘యువ సంచలన’ పేరున ఒక సంస్థ ఏర్పాటు చేసుకుని వీకెండ్స్‌లో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అసలే ఇది ఎండాకాలం..పక్షులు ఆహారం, నీరు దొరక్క పిట్టల్లా రాలిపోతూ ప్రాణాలు వదులుతున్నాయి. ఈ విషయంపై తీవ్రంగా చర్చించుకున్న వీరంతా సరికొత్త ఐడియా కనిపెట్టారు.
ఐడియా వచ్చిందే తడవు...పట్టణంలో హోటళ్లు, బార్‌లు, వీధులు తిరిగి వందల సంఖ్యలో ఖాళీ వాటర్ బాటిళ్లు సేకరించారు. అందరూ కొంత డబ్బులు వేసుకుని సిరిధాన్యాలు కొనుగోలు చేశారు. చెట్లు ఎండిపోయి ఆహారం, నీరు దొరకని అటవీ ప్రదేశాలను గుర్తించారు. బాటిళ్లకు ఐడియా ప్రకారం రంధ్రాలు చేసి నీరు, ఆహారం ఏర్పాటు చేశారు.
ఎలాగంటే...?
వాటర్ బాటిల్‌లో ధాన్యం గింజలు నింపి కింద భాగంలో పక్షి వాలి కూర్చోడానికి అనుకూలంగా కట్టిపుల్ల కట్టారు. కాస్త పైన స్పూన్ చివరి భాగం మాత్రం వెళ్లేలా రంధ్రం చేసి పక్షి ధాన్యాలు తినడం ప్రారంభించాక ధాన్యం గింజలు స్పూన్‌లో పడేలా ఏర్పాటు చేశారు. ఆ బాటిల్‌కు దగ్గరలోనే మరో బాటిల్‌లో నీరు నింపి చెట్టుకు కట్టారు. ఈ విధంగా వందలాది బాటిళ్లు ఏర్పాటు చేసారు వీరంతా. ఇక ఈ చిన్న ప్రయత్నం గురించి చిదానంద్, భరత్, దివాకర్‌నాగ్, రమ్య,రశ్మి, సతీష్, నంద, సుభాష్, సునీల్ తదితరులు మాట్లాడుతూ... ఈ వేసవి కాలం ఎండలు మండిపోతున్నాయి. మనుషులే తట్టుకోలేకపోతున్నాం. పక్షులు నీటి కోసం, ఆహారం కోసం వెదికివెదికి ప్రాణాలు వదులుతున్నాయి.
అన్ని పక్షులకూ నీరు, ఆహారం అందించలేకపోయినా కనీసం తమ శాయశక్తులా వీలయినన్ని పక్షులను బతికించాలన్న చిన్న ప్రయత్నం చేస్తున్నామన్నారు. పక్షులు తిరిగే చోట స్థానికులు కూడా వాటికి తమవంతుగా నీరు, ఆహారం అందేలా చూడాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment