వీరాపురంలో చెట్లపై సైబీరియన్ పక్షులు
ఎక్కడ సైబీరియా...ఎక్కడ చిలమత్తూరు మండలంలోని వీరాపురం. దాదాపు 5 వేల కిలో మీటర్ల దూరం. ఎందులోనూ పొంతన ఉండదు. కానీ ఈరెండు ప్రాంతాలను ఓ పక్షి కలిపింది. అతిథిగా వచ్చి ఇక్కడి ప్రజల మనస్సు గెలుచుకుంది. ఈ ప్రాంతానికి గుర్తించి తెచ్చింది. అందుకే ఏటా జనవరి నుంచి ఫిబ్రవరిలోపు ఇక్కడ వచ్చి సందడి చేసే ఆ అతిథిగా కోసం వీరాపురం ఎదురుచూస్తోంది.
సాక్షి, పుట్టపర్తి: వీరాపురం.. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో కర్ణాటక సరిహద్దున ఓ మారుమూల గ్రామం. కానీ ఆ గ్రామానికి అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. అదీ ఓ అతిథి వల్ల. అందుకే ఆ అతిథికి గ్రామస్తులు రాచమర్యాదలు చేస్తారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటారు.
వేడిని వెతుక్కుంటూ
రష్యా దేశం సైబీరియన్ ప్రాంతానికి చెందిన స్టార్క్ పెయింటెడ్ పక్షులు (ఎర్రముక్కు కొంగలు). సమ శీతోష్ణస్థితి కలిగిన ప్రాంతాల్లో జీవిస్తాయి. ఈ క్రమంలోనే వచ్చే ఫిబ్రవరి నుంచి సైబీరియాలో చలికాలం ప్రారంభమవుతుంది. ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలకు పడిపోతుంది. దీంతో వేడిని వెతుక్కుంటూ ఈ పక్షులు మైళ్ల దూరం ప్రయాణించి నుంచి ఏటా వీరాపురం వస్తుంటాయి.
ముందుగా జనవరిలోనే కొన్ని పక్షులు వచ్చి ఇక్కడి వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తాయి. అనుకూలంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత తమ దేశానికి వెళ్లి మిగతా పక్షులతో తిరిగి వస్తాయి. ఇలా మన రాష్ట్రంలోని కొల్లేటి సరస్సు, తేలినీలాపురం, పులికాట్ సరస్సు, నేలపట్టుతో పాటు మన జిల్లాలోని చిలమత్తూరు మండలం వీరాపురం గ్రామానికి ఏటా సైబీరియన్ పక్షులు రావడం మూడు దశాబ్దాలుగా ఆనవాయితీగా కొనసాగుతోంది.
ఆరు నెలల పాటు సందడి
వీరాపురంలోని 188 ఎకరాల విస్తీర్ణంలో పురాతనమైన చెరువు ఉంది. దీని కింద 80 ఎకరాల ఆయకట్టుంది. దీని చుట్టూ వందలాది చెట్లు ఉండటంతో మూడు దశాబ్దాలుగా సైబీరియా నుంచి వేల సంఖ్యలో ఈ పక్షులు ఫిబ్రవరిలో ఇక్కడకు వస్తున్నాయి. ఇక్కడే గుడ్లు పొదిగి పిల్ల పక్షులు ఎగిరే దశకు చేరుకున్నాక (సెప్టెంబర్ నుంచి అక్టోబర్ లోపు) తిరిగి స్వస్థలానికి వెళ్లిపోతాయి.
వీటిని స్థానికులంతా ప్రేమగా ఎర్రముక్కు కొంగలంటారు. కొన్నేళ్లుగా వీరాపురంతో ఈ పక్షులు మమేకమయ్యాయి. అందువల్లే సీజన్‌లో పక్షులను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తుండగా... వీరాపురం కళకళలాడుతుంది.
బంధువుల్లా ఆదరణ
తమ గ్రామానికి ఖ్యాతి తెచ్చిన ఈ కొంగలను వీరాపురం వాసులు ప్రత్యేకంగా చూస్తారు. ఇళ్ల మధ్య చెట్లపైనే ఉంటూ 24 గంటలూ అరుస్తూ ఉన్నా వాటికి ఎలాంటి ఇబ్బంది కలగనివ్వరు. అంతేకాకుండా వీరాపురం చెరువును చారిత్రక సంపదగా ప్రకటించారు. చెరువు కింద 80 ఎకరాల ఆయకట్టు ఉన్నా... ఈ చెరువు నీటితో వ్యవసాయం చేస్తే నీరు తగ్గిపోయి మత్స్యసంపద అంతరిస్తుందని, అప్పుడు సైబీరియన్ పక్షులకు ఆహారం లేకుండా పోతుందన్న భయంతో ఏకంగా చెరువు కింద ఆయకట్టులో వ్యవసాయం చేయడమే మానేశారు.
మేలు జరుగుతుందని నమ్మకం
ఈ కొంగల రాకతో ఊరికి మేలు జరుగుతుందని వీరాపురం వాసులు నమ్ముతారు. ఎవరైనా వాటికి హాని తలపెడితే అందరూ ఒక్కటవుతారు. వారిని పట్టుకుని గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ చేసి జరిమానా విధిస్తారు. కేసులు పెడతారు. సైబీరియా నుంచి సుమారు ఐదు వేల కిలోమీటర్లు ప్రయాణించి ఈ కొంగలు వీరాపురం చేరుకుంటుండడం విశేషం.
పోషణ భారం ఆడ కొంగలదే
పెయింటెడ్ స్టార్క్ పక్షి చూడముచ్చటగా ఉంటుంది. సికొనిడే జాతికి చెంది ఈ పక్షి శాస్త్రీయ నామం ’మిక్టీరియాలూకోసిఫల’. ఎత్తు 3 నుంచి 3.5 అడుగులు. ఎగరడానికి రెక్కలు విప్పినప్పుడు ఐదు అడుగుల వెడల్పు ఉంటుంది. బరువు సుమారు 3.5 కిలోల నుంచి 4 కిలోల వరకు ఉంటుంది. ఈ పక్షులు నీళ్లను గొంతు వరకు నింపుకొని పిల్ల పక్షులకు అందించేందుకు మొత్తం నీరు బయటకు తీసి ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంటుంది.
ఆహారం కోసం ఊరికి 50 కిలోమీటర్ల దూరంలోపు ఉండే చెరువులు, పంట పొలాల వైపు వెళ్లి తిరిగి సాయంత్రం గూటికి చేరుకుంటాయి. ఒక గూడులో జంట పక్షులుంటాయి. గుడ్లు పెట్టి పిల్లలు వచ్చాక వాటి సంరక్షణను మగపక్షి చూసుకుంటుంది. ఆడకొంగలు బయటకు వెళ్లి చెరువుల్లో వేటాడి చేపలు, నీళ్లు తీసుకొచ్చి పిల్లలకు అందిస్తాయి.
అనువైన వాతావరణం
సైబీరియాతో పోలిస్తే వీరాపురంలో వేడి వాతావరణం ఉండటం, వేసవిలోనూ దగ్గరలోని చెరువుల్లో నీళ్లుండటంతో పక్షులు మా ఊరికే వస్తుంటాయి. కేవలం చేపలను మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి. తమ పిల్లలకు కూడా మేత తీసుకొస్తాయి.
– ఎల్.లక్ష్మీపతి, వీరాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్
పక్షులతో విడదీయరాని బంధం
ఒంటరిగా వచ్చే ఈ పక్షులు గుడ్లు పెట్టి పొదిగి పిల్లలతో పాటే తిరిగి సైబీరియా వెళ్లిపోతాయి. మా తాతల కాలం నుంచి ఈ పక్షులు వస్తున్నాయి. పక్షులతో మా గ్రామానికి విడదీయరాని అనుబంధం. ఏటా పక్షుల సీజన్ కోసం ఎదురు చూస్తుంటాం.
– నరసింహారెడ్డి, వీరాపురం
Comments
Please login to add a commentAdd a comment