stork
-
స్పూర్తిదాయకమైన కథ.. 'బాతు–కొంగ యుద్ధం!'
విశ్వామిత్రుడి కారణంగా హరిశ్చంద్రుడు రాజ్యభ్రష్టుడై అష్టకష్టాలు పడ్డాడు. ఎన్ని కష్టాలు పడినా సత్యసంధతను వదులుకోని హరిశ్చంద్రుడిని చూసి దేవతలు నివ్వెరపోయారు. ఆయనను స్వర్గానికి రమ్మని ఆహ్వానించారు. ధర్మప్రభువైన హరిశ్చంద్రుడు దేవతల కోరికను వెంటనే మన్నించలేదు. తనతో పాటు తన అయోధ్యానగర పౌరులందరికీ స్వర్గవాసం కల్పిస్తేనే వస్తానన్నాడు. హరిశ్చంద్రుడి కోరికను దేవేంద్రుడు మన్నించాడు. వేలాది విమానాలను రప్పించి, హరిశ్చంద్రుడితో పాటు అయోధ్య వాసులందరినీ స్వర్గానికి తరలించుకుపోయాడు. హరిశ్చంద్రుడి స్వర్గారోహణం చూసి దైత్యగురువు శుక్రాచార్యుడు చకితుడయ్యాడు. ‘హరిశ్చంద్రుడిలాంటి ప్రభువు ముల్లోకాల్లోనూ మరొకరు లేరు. తన త్యాగంతో, దానంతో మహాపుణ్యాన్ని ఆర్జించి, తన పౌరులను కూడా స్వర్గానికి తీసుకుపోయాడంటే అతడిది ఎంతటి త్యాగనిరతి! హరిశ్చంద్రుడి వంటి రాజు ఇంకెవడుంటాడు?’ అని శ్లాఘించాడు. హరిశ్చంద్రుడు స్వర్గానికి వెళ్లిన తర్వాత, అప్పటికి పన్నెండేళ్లుగా గంగా నదిలో మెడలోతు వరకు నీళ్లలో నిలబడి తపస్సు చేసుకుంటూ ఉన్న వశిష్ఠుడు తన తపస్సును చాలించి బయటకు వచ్చాడు. వశిష్ఠుడు హరిశ్చంద్రుడికి కులగురువు. తన శిష్యుడైన హరిశ్చంద్రుడి యోగక్షేమాలు తెలుసుకోవడానికి నేరుగా అయోధ్యకు వెళ్లాడు. అక్కడి జనాల ద్వారా విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని పెట్టిన బాధలను తెలుసుకుని, అమిత ఆగ్రహం చెందాడు. ‘ఈ విశ్వామిత్రుడు ఎంతటి దుర్మార్గుడు! పూర్వం నా వందమంది కొడుకులను నిర్దాక్షిణ్యంగా చంపాడు. అప్పుడు కూడా అంత కోపం రాలేదు. సత్యధర్మ నిబద్ధుడైన హరిశ్చంద్రుడిని రాజ్యభ్రష్టుడిని చేసినందుకు మాత్రం నాకు పట్టరాని కోపం వస్తోంది’ అనుకున్నాడు వశిష్ఠుడు. ఎంత నియంత్రించుకోవాలనుకున్నా కోపం తగ్గకపోవడంతో వశిష్ఠుడు ‘దుర్మార్గుడు, బ్రహ్మద్వేషి, క్రూరుడు, మూర్ఖుడు, యజ్ఞవినాశకుడు అయిన విశ్వామిత్రుడు కొంగ రూపాన్ని పొందుగాక’ అని శపించాడు. వశిష్ఠుడి శాపాన్ని తెలుసుకున్న విశ్వామిత్రుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. ‘నన్ను శపించ సాహసించిన వశిష్ఠుడు బాతు రూపం పొందుగాక’ అని ప్రతిశాపం ఇచ్చాడు. పరస్పర శాపాల కారణంగా విశ్వామిత్రుడు కొంగగా, వశిష్ఠుడు బాతుగా మారిపోయారు. వారి రూపాలు సామాన్యమైన కొంగ, బాతుల మాదిరిగా లేవు. కొంగ మూడువేల యోజనాల పొడవు ఉంటే, బాతు రెండు వేల యోజనాల పొడవు ఉంది. భీకరమైన కొంగ, బాతు రూపాలు పొందిన విశ్వామిత్ర, వశిష్ఠులు పరస్పరం తారసపడ్డారు. పూర్వవైరం ఇంకా చల్లారని వారిద్దరూ యుద్ధానికి తలపడ్డారు. బాతు, కొంగల రూపాల్లో వారు హోరాహోరీగా పోరు సాగిస్తుంటే, వారి ధాటికి మహావృక్షాలు నేలకూలాయి. పర్వతాల నుంచి గిరిశిఖరాలు నేల మీదకు దొర్లిపడ్డాయి. భూమి కంపించింది. సముద్రాలు అల్లకల్లోలంగా మారి హోరెత్తాయి. భీకరమైన బాతు, కొంగల కాళ్ల కిందపడి ఎన్నో జీవులు మరణించాయి. ఇన్ని ఉత్పాతాలు జరుగుతున్నా అవేమీ పట్టకుండా బాతు కొంగల రూపాల్లో వశిష్ఠ విశ్వామిత్రులు హోరాహోరీగా రోజుల తరబడి పోరు కొనసాగిస్తూనే ఉన్నారు. వారి యుద్ధానికి దేవతలు కూడా భీతిల్లారు. అందరూ బ్రహ్మదేవుడి వద్దకు పరుగులు తీశారు. ‘ఓ విధాతా! వశిష్ఠ విశ్వామిత్రులు పరస్పర శాపాలతో బాతు కొంగ రూపాలు పొంది భూమ్మీద పోరు సాగిస్తున్నారు. వారి యుద్ధంలో ఇప్పటికే ఎన్నో జీవులు మరణించాయి. ప్రకృతి అల్లకల్లోలంగా ఉంది. వారి యుద్ధాన్ని నివారించకుంటే, భూమ్మీద ప్రళయం వచ్చేలా ఉంది. వారి పోరును నువ్వే అరికట్టాలి. భూలోకానికి పెను విపత్తును తప్పించాలి’ అని ప్రార్థించారు. బ్రహ్మదేవుడు దేవతలందరితోనూ కలసి భూమ్మీద పోరు జరుగుతున్న చోటుకు హుటాహుటిన వచ్చాడు. ‘వశిష్ఠ విశ్వామిత్రులారా! ఏమిటీ మూర్ఖత్వం? తక్షణమే యుద్ధాన్ని ఆపండి’ ఆజ్ఞాపించాడు బ్రహ్మదేవుడు. బాతు కొంగ రూపాల్లో ఉన్న వారిద్దరూ బ్రహ్మదేవుడి మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా, మరింత ఘోరంగా యుద్ధం చేయసాగారు. ‘ఇప్పటికే మీ వల్ల ఎంతో అనవసర ప్రాణనష్టం జరిగింది. బుద్ధి తెచ్చుకుని యుద్ధాన్ని మానుకోండి’ మరోసారి హెచ్చరించాడు బ్రహ్మదేవుడు. వశిష్ఠ విశ్వామిత్రులు అప్పటికీ అతడి మాటలను పట్టించుకోకుండా యుద్ధాన్ని కొనసాగించారు. చివరకు బ్రహ్మదేవుడు తన శక్తితో వారిద్దరి తామస గుణాన్ని హరించాడు. వశిష్ఠ విశ్వామిత్రులు పూర్వరూపాల్లోకి వచ్చారు. బ్రహ్మదేవుడి వద్ద చేతులు జోడించి నిలుచున్నారు. ‘వశిష్ఠా! విశ్వామిత్రుడి తప్పేమీ లేదు. హరిశ్చంద్రుడి ధర్మనిరతిని లోకానికి చాటడానికే అతణ్ణి పరీక్షలకు గురిచేసి, స్వర్గానికి పంపించాడు. నువ్వు అదేదీ గ్రహించకుండా అతణ్ణి శపించావు. ఈ విశ్వామిత్రుడు కూడా కోపాన్ని అణచుకోలేక నిన్ను శపించాడు. మీ వల్ల ఎంతో అనర్థం జరిగింది. ఇకనైనా తామస గుణాన్ని విడనాడి, శాంతం వహించండి. మీ వంటి మహర్షులకు తామసం తగదు’ అని బ్రహ్మదేవుడు హితవు పలికాడు. బ్రహ్మదేవుడి మాటలకు వశిష్ఠ విశ్వామిత్రులిద్దరూ సిగ్గుపడ్డారు. పరస్పరం క్షమాపణలు చెప్పుకుని, ఒకరినొకరు కౌగలించుకున్నారు. ఈ దృశ్యం చూసి దేవతలంతా సంతోషించారు. బ్రహ్మదేవుడితో కలసి అక్కడి నుంచి సంతృప్తిగా నిష్క్రమించారు. — సాంఖ్యాయన ఇవి చదవండి: నా స్టూడెంట్ టీచర్ అయింది! -
వీరాపురానికి విదేశీ అతిథి
ఎక్కడ సైబీరియా...ఎక్కడ చిలమత్తూరు మండలంలోని వీరాపురం. దాదాపు 5 వేల కిలో మీటర్ల దూరం. ఎందులోనూ పొంతన ఉండదు. కానీ ఈరెండు ప్రాంతాలను ఓ పక్షి కలిపింది. అతిథిగా వచ్చి ఇక్కడి ప్రజల మనస్సు గెలుచుకుంది. ఈ ప్రాంతానికి గుర్తించి తెచ్చింది. అందుకే ఏటా జనవరి నుంచి ఫిబ్రవరిలోపు ఇక్కడ వచ్చి సందడి చేసే ఆ అతిథిగా కోసం వీరాపురం ఎదురుచూస్తోంది. సాక్షి, పుట్టపర్తి: వీరాపురం.. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో కర్ణాటక సరిహద్దున ఓ మారుమూల గ్రామం. కానీ ఆ గ్రామానికి అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. అదీ ఓ అతిథి వల్ల. అందుకే ఆ అతిథికి గ్రామస్తులు రాచమర్యాదలు చేస్తారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటారు. వేడిని వెతుక్కుంటూ రష్యా దేశం సైబీరియన్ ప్రాంతానికి చెందిన స్టార్క్ పెయింటెడ్ పక్షులు (ఎర్రముక్కు కొంగలు). సమ శీతోష్ణస్థితి కలిగిన ప్రాంతాల్లో జీవిస్తాయి. ఈ క్రమంలోనే వచ్చే ఫిబ్రవరి నుంచి సైబీరియాలో చలికాలం ప్రారంభమవుతుంది. ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలకు పడిపోతుంది. దీంతో వేడిని వెతుక్కుంటూ ఈ పక్షులు మైళ్ల దూరం ప్రయాణించి నుంచి ఏటా వీరాపురం వస్తుంటాయి. ముందుగా జనవరిలోనే కొన్ని పక్షులు వచ్చి ఇక్కడి వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తాయి. అనుకూలంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత తమ దేశానికి వెళ్లి మిగతా పక్షులతో తిరిగి వస్తాయి. ఇలా మన రాష్ట్రంలోని కొల్లేటి సరస్సు, తేలినీలాపురం, పులికాట్ సరస్సు, నేలపట్టుతో పాటు మన జిల్లాలోని చిలమత్తూరు మండలం వీరాపురం గ్రామానికి ఏటా సైబీరియన్ పక్షులు రావడం మూడు దశాబ్దాలుగా ఆనవాయితీగా కొనసాగుతోంది. ఆరు నెలల పాటు సందడి వీరాపురంలోని 188 ఎకరాల విస్తీర్ణంలో పురాతనమైన చెరువు ఉంది. దీని కింద 80 ఎకరాల ఆయకట్టుంది. దీని చుట్టూ వందలాది చెట్లు ఉండటంతో మూడు దశాబ్దాలుగా సైబీరియా నుంచి వేల సంఖ్యలో ఈ పక్షులు ఫిబ్రవరిలో ఇక్కడకు వస్తున్నాయి. ఇక్కడే గుడ్లు పొదిగి పిల్ల పక్షులు ఎగిరే దశకు చేరుకున్నాక (సెప్టెంబర్ నుంచి అక్టోబర్ లోపు) తిరిగి స్వస్థలానికి వెళ్లిపోతాయి. వీటిని స్థానికులంతా ప్రేమగా ఎర్రముక్కు కొంగలంటారు. కొన్నేళ్లుగా వీరాపురంతో ఈ పక్షులు మమేకమయ్యాయి. అందువల్లే సీజన్లో పక్షులను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తుండగా... వీరాపురం కళకళలాడుతుంది. బంధువుల్లా ఆదరణ తమ గ్రామానికి ఖ్యాతి తెచ్చిన ఈ కొంగలను వీరాపురం వాసులు ప్రత్యేకంగా చూస్తారు. ఇళ్ల మధ్య చెట్లపైనే ఉంటూ 24 గంటలూ అరుస్తూ ఉన్నా వాటికి ఎలాంటి ఇబ్బంది కలగనివ్వరు. అంతేకాకుండా వీరాపురం చెరువును చారిత్రక సంపదగా ప్రకటించారు. చెరువు కింద 80 ఎకరాల ఆయకట్టు ఉన్నా... ఈ చెరువు నీటితో వ్యవసాయం చేస్తే నీరు తగ్గిపోయి మత్స్యసంపద అంతరిస్తుందని, అప్పుడు సైబీరియన్ పక్షులకు ఆహారం లేకుండా పోతుందన్న భయంతో ఏకంగా చెరువు కింద ఆయకట్టులో వ్యవసాయం చేయడమే మానేశారు. మేలు జరుగుతుందని నమ్మకం ఈ కొంగల రాకతో ఊరికి మేలు జరుగుతుందని వీరాపురం వాసులు నమ్ముతారు. ఎవరైనా వాటికి హాని తలపెడితే అందరూ ఒక్కటవుతారు. వారిని పట్టుకుని గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ చేసి జరిమానా విధిస్తారు. కేసులు పెడతారు. సైబీరియా నుంచి సుమారు ఐదు వేల కిలోమీటర్లు ప్రయాణించి ఈ కొంగలు వీరాపురం చేరుకుంటుండడం విశేషం. పోషణ భారం ఆడ కొంగలదే పెయింటెడ్ స్టార్క్ పక్షి చూడముచ్చటగా ఉంటుంది. సికొనిడే జాతికి చెంది ఈ పక్షి శాస్త్రీయ నామం ’మిక్టీరియాలూకోసిఫల’. ఎత్తు 3 నుంచి 3.5 అడుగులు. ఎగరడానికి రెక్కలు విప్పినప్పుడు ఐదు అడుగుల వెడల్పు ఉంటుంది. బరువు సుమారు 3.5 కిలోల నుంచి 4 కిలోల వరకు ఉంటుంది. ఈ పక్షులు నీళ్లను గొంతు వరకు నింపుకొని పిల్ల పక్షులకు అందించేందుకు మొత్తం నీరు బయటకు తీసి ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంటుంది. ఆహారం కోసం ఊరికి 50 కిలోమీటర్ల దూరంలోపు ఉండే చెరువులు, పంట పొలాల వైపు వెళ్లి తిరిగి సాయంత్రం గూటికి చేరుకుంటాయి. ఒక గూడులో జంట పక్షులుంటాయి. గుడ్లు పెట్టి పిల్లలు వచ్చాక వాటి సంరక్షణను మగపక్షి చూసుకుంటుంది. ఆడకొంగలు బయటకు వెళ్లి చెరువుల్లో వేటాడి చేపలు, నీళ్లు తీసుకొచ్చి పిల్లలకు అందిస్తాయి. అనువైన వాతావరణం సైబీరియాతో పోలిస్తే వీరాపురంలో వేడి వాతావరణం ఉండటం, వేసవిలోనూ దగ్గరలోని చెరువుల్లో నీళ్లుండటంతో పక్షులు మా ఊరికే వస్తుంటాయి. కేవలం చేపలను మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి. తమ పిల్లలకు కూడా మేత తీసుకొస్తాయి. – ఎల్.లక్ష్మీపతి, వీరాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ పక్షులతో విడదీయరాని బంధం ఒంటరిగా వచ్చే ఈ పక్షులు గుడ్లు పెట్టి పొదిగి పిల్లలతో పాటే తిరిగి సైబీరియా వెళ్లిపోతాయి. మా తాతల కాలం నుంచి ఈ పక్షులు వస్తున్నాయి. పక్షులతో మా గ్రామానికి విడదీయరాని అనుబంధం. ఏటా పక్షుల సీజన్ కోసం ఎదురు చూస్తుంటాం. – నరసింహారెడ్డి, వీరాపురం -
జనావాసాల్లో గాయపడ్డ విదేశీ కొంగ
సాక్షి, అంబర్‌పేట(హైదరాబాద్): ఉస్మానియా యూనివర్సిటీ అడవికి ఆనుకొని ఉన్న బాగ్ అంబర్‌పేట మల్లికార్జున్‌నగర్‌లో ఓ విదేశీ పక్షి గాయపడింది. బుధవారం ఉదయం స్థానికులు గమనించి అంబర్‌పేట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పక్షిని పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చి జూ పార్కు అధికారులకు సమాచారం అందించారు. జూ పార్కు అధికారులు ఈ పక్షి నైబీరియా నుంచి వలస వచ్చినట్లుగా జూ పార్కు అధికారులు గుర్తించారు. గాలిపటం మాంజా కారణంగా ఈ పక్షి గాయపడి నేలపై పడ్డట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. జూ పార్కుకు తరలించి చికిత్స అందిస్తామని అధికారులు తెలిపారు. -
కొల్లేరు అంబాసిడర్‌గా గూడకొంగ
సాక్షి, అమరావతి: కొల్లేరు అంబాసిడర్‌గా గూడకొంగ(స్పాట్ బిల్డ్ పెలికాన్)ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర అటవీ దళాధిపతి ఎన్.ప్రతీప్‌కుమార్ బుధవారం వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఐకానిక్ వీక్ కార్యక్రమంలో భాగంగా ఈ పక్షిని అంబాసిడర్‌గా గుర్తించినట్లు చెప్పారు. గుంటూరులోని అటవీ శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బుధవారం దీనికి సంబంధించిన పోస్టర్, లోగోను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ వారం దేశవ్యాప్తంగా చిత్తడి నేలల పరిరక్షణ కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రతి రాష్ట్రంలో చిత్తడి నేలలకు సంబంధించిన ఒక పక్షి లేదా అక్కడి వైవిధ్యమైన జంతువును అంబాసిడర్‌గా ఎంపిక చేయాల్సి ఉందన్నారు. ఏపీలో గూడకొంగను ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రపంచంలో ఉన్న పెలికాన్ పక్షుల్లో 40 శాతం ప్రతి ఏడాదీ కొల్లేరుకు వస్తాయని, అందుకే దీన్ని అంబాసిడర్‌గా ఎంపిక చేశామన్నారు. చిత్తడి నేలల పరిరక్షణ కోసం వెట్ ల్యాండ్ మిత్రాస్‌ను నియమిస్తామని తెలిపారు. స్థానికంగా సేవా దృక్పథం ఉన్నవారిని ఇందుకు ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ సెల్వం తదితరులు పాల్గొన్నారు. -
వైరల్ వీడియో: సృష్టికర్తకు జోహార్లు
అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ ప్రేమను వర్ణించడానికి మాటలు చాలవు. అమ్మ ప్రేమకు హద్దులుండవు.. అనంతం. బిడ్డల్ని సంరక్షించడంలో తల్లి తర్వాతనే ఎవరైనా. వర్షం వస్తే పిల్లలకు తాను గొడుగవుతుంది.. ఎండలో నీడవుతుంది... ఇలా అన్ని వేళలా బిడ్డను కంటికి రెప్పలా కాపాడుతుంది తల్లి. అందుకే ఓ మాట అంటుంటారు.. సృష్టికర్త తాను అన్ని చోట్ల ఉండలేక.. తల్లిని సృష్టించాడంటారు. ఈ మాట అక్షరాల నిజం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఓ వీడియో చూస్తే.. తల్లి ప్రేమను అనుభూతి చెందుతారు. ఆ వివరాలు.. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుధా రామెన్ తన ట్విటర్లో ఓ వీడియో షేర్ చేశారు. 12 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో జోరుగా వర్షం కురుస్తుంటుంది. నిలువుగా పొడవుగా ఉన్న ఓ కర్రలాంటి దాని మీదున్న గూడులో ఓ కొంగ, పిల్లలతో కలిసి ఉంటుంది. పైన ఏ ఆధారం లేకపోవడంతో గూడు, దానిలోని పిల్లలు తడుస్తుంటాయి. ఈ క్రమంలో తన పిల్లలను వర్షంలో తడవకుండా ఉండటం కోసం కొంగ తన రెక్కలను తెరచి.. దాని కాళ్ల మధ్య పిల్లలను నిలుపుతుంది. అయినా పిల్లలు తడుస్తుండటంతో ఆ తల్లి కొంగ అలానే తన రెక్కలను విప్పార్చి.. కూర్చుంటుంది. ‘‘ఎందుకంటే తనొక అమ్మ’’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు ఆ కొంగ చూపిన తల్లి ప్రేమను ప్రశంసిస్తున్నారు. ‘‘తను ఒక అమ్మ.. ప్రకృతి తనకు ప్రేమను పంచడం, రక్షించడం, దారి చూపడం వంటి ఎన్నో లక్షణాలను అందించింది. తల్లి అంటేనే ప్రేమ.. సృష్టికర్తకు జోహార్లు..’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. -
ప్రేమయాత్రలో 14వేల కిలోమీటర్లు...
బ్కోడ్స్కా వారోస్, క్రొయేషయా : ప్రేమ ఎంత గొప్పదంటే అనాముకుడిని సైతం ఆకాశమంతా ఎత్తు ఎదిగేలా చేస్తుంది. పిరికివారిని సైతం గొప్ప సాహసికులుగా మారుస్తుంది. దూర, భారాల్ని సైతం లెక్కచేయదు. ప్రేమకున్న శక్తే అలాంటిది. అందుకే క్లెపెతాన్ ప్రతి ఏడాది శీతాకాలం అయిపోగానే దక్షిణాఫ్రిక నుంచి 14వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి తూర్పు క్రొయేషియాలోని బ్రోడ్స్కి వారోస్ గ్రామంలో ఉన్న తన ప్రియురాలు మలేనాను కలుసుకుంటాడు. శీతకాలం అయిపోగానే రావడం ఏంటి, ఎప్పుడు మలేనా దగ్గరే ఉండొచ్చు కదా అంటే శీతకాలం కొంగలకు క్రొయేషియా అనుకూలమైన తావు కాదు. అవును మలేనా, క్లెపెతాన్ రెండు కొంగలు. మరి మలేనా కూడా క్లెపెతాన్తో దక్షిణాఫ్రికా వెళ్లొచ్చు కదా అనుకుంటే అది కుదరరు. ఎందుకంటే మలేనా వికలాంగురాలు. మనుషులకే ఆదర్శంగా నిలిచిన ఈ ప్రేమ కొంగలు తూర్పు క్రొయేషియాలోని ఒక రిటైర్డ్ పాఠశాల ఉపాధ్యాయుడు స్టెపెన్ వోకిక్ ఇంట్లో జతకట్టాయి. ఓసారి వీటి ప్రేమకథను వినమంటున్నాడు వోకిక్. కొన్నాళ్ల క్రితం వోకిక్కి తన ఇంటి దగ్గరలోని చెరువు వద్ద గాయాలతో ఉన్న ఆడకొంగ మలేనా కనిపించింది. వేటగాడు మలేనాను తూపాకీతో కాల్చడం వల్ల మలేనా కాలు విరిగిపోయింది. గాయంతో బాధపడుతున్న మలేనాను వోకిక్ తన ఇంటికి తీసుకువచ్చాడు. దానికి వైద్యం చేసి ప్రాణాలు కాపాడాడు. ఈ క్రమంలోనే మలేనా క్లెపెతాన్ రెండు జతయ్యాయి. ఇవి ఇప్పటికే 62 పిల్లలను కూడా చేశాయి. శీతాకాలం క్లెపెతాన్ తూర్పు క్రొయేషియా నుంచి దక్షిణాఫ్రికకు వలస వెళ్తాడు. ఆ సమయంలో వోకిక్ మలేనాకు తన ఇంటిలోనే ఒక గదిలో హీటర్‌ను ఏర్పాటు చేసి వెచ్చగా ఉండేలా చుస్తాడు. వసంత రుతువు మొదలవ్వగానే క్లెపెతాన్ దక్షిణాఫ్రిక నుంచి తూర్పుక్రొషియాకి వస్తాడు. వేసవిలో ఈ ప్రేమ జంట కోసం వోకిక్ తన ఇంటి పైన వసతిని ఏర్పాటు చేస్తాడు. ఇప్పటి నుంచే క్లెపెతాన్ తన పిల్లలకు ఎగరడంలో శిక్షణ ఇస్తున్నాడు. ఈ సారి ఆగస్టులో తన పిల్లలతో కలిసి ఈ మగ కొంగ దక్షిణాఫ్రికకు వలస వెళ్లనుంది. ఈ ప్రేమ పక్షులు ప్రస్తుతం క్రొయేషియాలో సెలబ్రటీలయ్యాయి. 1993లో వోకిక్ మలేనాను తన ఇంటికి తీసుకువచ్చాడు. నాటి నుంచి నేటి వరకూ మలేనా వోకిక్తో పాటే కలసి ఉంటుంది. వీరిద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. వోకిక్ తనతోపాటు మలేనాను చేపలుపట్టడానికి తీసుకువెళ్తాడు, ఇద్దరూ కలిసి టీవీ కూడా చూస్తారు. మలేనా పూర్తి బాధ్యత నాదే అంటున్నారు వోకిక్. క్రొయేషియాలో దాదాపు 1500 జతల తెల్ల కొంగలు ఉన్నాయి. సెంట్రల్ క్రొయేషియాలోని సిగాక్ 1994లో తొలి కొంగల గ్రామంగా పొందింది. ప్రస్తుతం బోడ్స్కా వారోస్ గ్రామంలో 210 పక్షులు ఉన్నాయి. ఇవి గ్రామస్తుల ఇళ్ల పైన ఏర్పాటుచేసుకున్న తమ గూళ్లలో నివసిస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ మనుషుల సంఖ్య కన్నా రెట్టింపుగా పక్షుల సంఖ్య ఉండటం గమనార్హం. -
విహంగాలపై వింత నమ్మకాలు
నమ్మకం పక్షిని స్వేచ్ఛకు చిహ్నమంటారు. ఉదయాన్నే లేచి ఆహారం కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించే వాటిని... క్రమశిక్షణకు మారుపేరుగా కూడా చెబుతారు. అయితే పక్షి అదృష్టానికి సంకేతం, దురదృష్టానికి ప్రతీక అని ఎవరైనా అంటారా? అనేవాళ్లు ఉన్నారు. ప్రపంచంలోని పలు దేశాల్లో పక్షుల విషయంలో కొన్ని విశ్వాసాలు ఉన్నాయి. అవి అంధ విశ్వాసాలా అంటే అవునని అనలేం. అయితే వాస్తవమేనా అంటే... కాదనీ చెప్పలేం. ఎవరి నమ్మకాలు వారివి అని ఊరుకోవాలి అంతే! కొంగ: ఇది స్వచ్ఛతకు, ప్రశాంతతకు చిహ్నమట. అందుకే ఉదయం లేచిన తరువాత కొంగను చూస్తే... ఆ రోజంతా ప్రశాంతంగా గడుస్తుందని, అదే సంవత్సరం తొలి రోజున చూస్తే మరుసటి యేడు వచ్చేవరకూ అంతా సంతోషంగా గడిచిపోతుందని పలు దేశాల్లో నమ్ముతారు. అంతేకాదు... ఆరోగ్యం కూడా బాగుంటుందని అంటారు. కాకి: ఇది వచ్చి వాలితే మంచి జరుగుతుందని కొందరు, చెడు జరుగుతుందని కొందరు నమ్ముతారు. కాకి సందేశాల్ని మోసుకొస్తుందని, అది అరిస్తే బంధువులు కానీ శుభవార్త కానీ వస్తుందని చాలామంది అంటారు. కొందరేమో... కాకి నల్లగా ఉంటుంది కాబట్టి, నలుపు పాపానికి, విషాదానికి ప్రతీక కాబట్టి చెడు జరుగుతుందని అంటారు. పావురం: ప్రతి చోటా ఒకే రకంగా నమ్మేది పావురం ఒక్కదాన్నే. దాదాపు ప్రపంచమంతటా దాన్ని శాంతి చిహ్నంగానే భావిస్తున్నారు. పరిశుద్ధతకు ప్రతీక అంటున్నారు. గద్ద: రాజసానికి, ఆత్మవిశ్వాసానికి, స్వేచ్ఛకి, శక్తికి గద్దను ప్రతీకగా భావిస్తున్నారు కొన్ని ఐరోపా దేశాల్లో. ఉదయాన్నే గద్దను చూస్తే... ఆ రోజంతా విజయమే లభిస్తుందని నమ్మేవాళ్లకు కొదవ లేదు. ఇలాంటిదే అయిన రాబందును మాత్రం మృత్యువుకి, దురదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. రాబందు కనిపిస్తే ఎవరికో మూడిందని ఫిక్సైపోతారు. బాతు: ఇది బలహీనతకు చిహ్నమని కొందరు అంటే... కొన్నిచోట్ల దీన్ని సింప్లిసిటీకి చిహ్నంగా భావిస్తున్నారు. దీనికి కారణాలు ఉన్నాయి. బాతు చాలా బలహీనంగా ఉంటుంది. అందువల్ల పొద్దున్నే లేచి దాని ముఖం చూస్తే శక్తి అంతా ఆవిరైపోతుందని అంటూంటారు కొన్ని ఆఫ్రికన్ ప్రాంతాల్లో. అయితే బాతు జీవనం చాలా సింపుల్‌గా ఉంటుందని, ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుందని, అందుకే దాన్ని చూస్తే శుభమని ఆస్ట్రియా, ప్యారిస్, ఇండోనేసియా తదితర ప్రాంతాల్లో నమ్ముతారు. గుడ్లగూబ: దీన్ని దుష్టపక్షిగా భావించేవారు చాలామంది ఉన్నారు. రాత్రిళ్లు సంచరించే పక్షి కావడంతో దుష్టశక్తులను వెంటబెట్టుకొస్తుందని, దురదృష్టాన్ని మోసుకొస్తుందని చాలామంది నిందిస్తూ ఉంటారు దీన్ని. అయితే ఆఫ్రికా, ఐరోపా దేశాల్లోని కొన్ని ప్రాంతాల వారు దీన్ని జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. చీకట్లో సైతం సంచరిస్తుంది కాబట్టి ధైర్యానికి చిహ్నమని కూడా అంటారు. పిచ్చుక: దీన్ని ఉత్సాహానికి, తెలివితేటలకు చిహ్నంగా భావిస్తారు. చిన్నదే అయినా చాలా డిసిప్లిన్డ్గా ఉంటుందని, పెద్ద పెద్ద గాలివానలను కూడా తట్టుకుంటుందని అంటారు. అందుకే దీన్ని సంవత్సరం తొలి రోజున కనుక చూస్తే... ఇక ఆ సంవత్సరమంతా ఉత్సాహంగా ఉంటారని, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తట్టుకుని నిలబడతారని రొమేనియా, ఇటలీ వంటి దేశాల వారు చెబుతుంటారు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఇవన్నీ ఆయా పక్షులకున్న ప్రత్యేక లక్షణాలను బట్టి ఏర్పడిన నమ్మకాలని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే స్ఫూర్తిని పొందడానికి, ఉత్సాహంగా ముందుకు వెళ్లడానికి పక్షులనే కాదు... వేటిని అనుసరించినా నష్టం లేదు. అయితే... వాటిలో ఏవో కొన్ని బలహీనతలు ఉన్నాయని, వాటిని మనకు అన్వయించుకుని చెడు జరుగుతుందని, దురదృష్టం చుట్టుకుంటుందని భయపడటమే అంత మంచిది కాదు. కానీ ఒక్కసారి నమ్మకం ఏర్పడితే దాన్ని మనసులోంచి తీయడం చాలా కష్టం. కాకపోతే ఆ నమ్మకం భయాన్ని సృష్టించేది అయితే... దాన్ని ఎలాగైనా వదులుకోవడమే మంచిది! -
అరణ్యం: అధ్యక్షుల వారి ఆటవిడుపు... బో!
దేశాధ్యక్షుడి భార్యను ‘ఫస్ట్ లేడీ’ అంటారని తెలుసు. కానీ అతగాడు ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్కని ‘ఫస్ట్ డాగ్’ అంటారని తెలుసా? అలా పిలిపించుకున్న ఘనత... ‘బో’కి దక్కింది. ఎందుకంటే... దాన్ని పెంచుకుంటున్నది సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరి! పోర్చుగీస్ వాటర్ డాగ్ జాతికి చెందిన ‘బో’ని సెనేటర్ కెనడీ ఒబామాకు బహూకరించారు. ఒబామాకి కుక్కలంటే విపరీతమైన ప్రేమ. అప్పటికే వారి ఇంట్లో ఓ మేలుజాతి కుక్క ఉంది. అయినా మరోదాన్ని పెంచుకోవాలని అనుకున్నారు. అయితే దేన్ని పడితే దాన్ని పెంచుకోవడానికి వీలు కాదు. కారణం... ఒబామా కూతురు మాలియాకి కొన్ని కుక్కల వల్ల తీవ్రమైన అలర్జీ కలుగుతుంది. అందువల్లే ఆమెకు ఇబ్బంది లేకుండా పోర్చుగీస్ వాటర్ డాగ్‌ని తెచ్చుకోవాలనుకున్నారు. ఆ విషయం తెలిసిన కెనడీ ‘బో’ని తెచ్చి ఇచ్చారట. ఎప్పుడైతే బో తమ ఇంట్లో అడుగుపెట్టిందో, అప్పుడే తమ కుటుంబంలో భాగమైపోయింది అంటారు ఒబామా. తన పిల్లలతో సమానంగా ఆయన కూడా ఈ బుజ్జికుక్కతో ఆడుతూ ఉంటారు. చాలాచోట్లకు దాన్ని వెంటబెట్టుకునే వెళ్తారు. దాంతో బాగా ఫేమస్ అయిపోయింది బో. ఒబామా గారితో పాటు దాని వార్తలు కూడా రెగ్యులర్‌గా వస్తూనే ఉంటాయిట అమెరికా పత్రికల్లో! కొంగలు విడాకులు తీసుకుంటాయా! ప్రపంచంలో మొత్తం పదిహేను రకాల కొంగ జాతులున్నాయి. అంటార్కిటికా, దక్షిణ అమెరికాల్లో తప్ప అన్ని ఖండాల్లోనూ కొంగలు కనిపిస్తాయి! కొంగ పిల్లల్ని చిక్స్ అంటారు. కొంగల గుంపును ఫ్లాక్ అంటారు! వీటి పిల్లలు ఎంత త్వరత్వరగా ఎదిగిపోతాయో తెలుసా? పుట్టాక రెండు నెలలు తిరిగేసరికల్లా రెక్కలు పెరిగి, ఆరోగ్యంగా తయారై, ఎగరడం మొదలుపెడతాయి. తమంతట తామే ఆహార వేటకు వెళ్లిపోతాయి! చల్లటి నీటిలో గంటల పాటు కొంగలు నిలబడి ఎలా ఉండగలుగుతాయో ఎప్పుడైనా ఆలోచించారా? వాటికి తమ కాళ్లలోని రక్తనాళాలను నియంత్రించుకునే శక్తి ఉంటుంది. తద్వారా రక్తప్రసరణ వేగాన్ని పెంచుకోగలవు, తగ్గించుకోగలవు. బయటి వాతావరణాన్ని తట్టుకోవడమనేది శరీరంలోని రక్తప్రసరణను బట్టే ఉంటుంది కాబట్టి చల్లటి నీటిలో ఉన్నా వాటికేమీ కాదు! చూడటానికి సన్నగా ఉన్నా, వీటి కాళ్లు చాలా బలంగా ఉంటాయి. గోళ్లు చాలా వాడిగా ఉంటాయి. శత్రువు నుంచి తప్పించుకోవడానికి కాలితో తొక్కిపెట్టి, గోళ్లతో రక్కేస్తాయి కొంగలు! కొంగలు నిలబడి నిద్రపోతాయని చాలామంది అంటూ ఉంటారు. అది నిజమే కానీ... అన్ని కొంగలూ అలా చేయవు. రెండు జాతుల కొంగలు మాత్రమే అలా నిద్రపోతాయి. మిగిలినవి గూళ్లలోనే నిద్రిస్తాయి! కొంగలు జీవితాంతం ఒకే కొంగతో కలసివుంటాయి. తమ జోడీ చనిపోతే ఒంట రిగానే ఉంటాయి. విడాకులు తీసుకున్నప్పుడు మాత్రమే మరోదానికి చేరువవుతాయి. ఆశ్చర్యంగా ఉంది కదూ! అవును... కొంగలు విడిపోతాయి. ఆడకొంగ గర్భం దాల్చడంలో విఫలమైతే అవి విడిపోతాయి. వేరే దానికి దగ్గరై సంతానోత్పత్తికి తిరిగి ప్రయత్నిస్తాయి. ఏది తనకు సంతానాన్ని ఇస్తుందో ఆ ఆడకొంగతోనే మగకొంగ జీవితాంతం ఉంటుందని పరిశోధనల్లో తేలింది! కొంగలు ఇరవై నుంచి నలభయ్యేళ్లు జీవిస్తాయి. ఇన్నేళ్ల పాటు జీవించే పక్షులు కాస్త అరుదనే చెప్పాలి!