దేశాధ్యక్షుడి భార్యను ‘ఫస్ట్ లేడీ’ అంటారని తెలుసు. కానీ అతగాడు ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్కని ‘ఫస్ట్ డాగ్’ అంటారని తెలుసా? అలా పిలిపించుకున్న ఘనత... ‘బో’కి దక్కింది. ఎందుకంటే... దాన్ని పెంచుకుంటున్నది సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరి! పోర్చుగీస్ వాటర్ డాగ్ జాతికి చెందిన ‘బో’ని సెనేటర్ కెనడీ ఒబామాకు బహూకరించారు. ఒబామాకి కుక్కలంటే విపరీతమైన ప్రేమ. అప్పటికే వారి ఇంట్లో ఓ మేలుజాతి కుక్క ఉంది. అయినా మరోదాన్ని పెంచుకోవాలని అనుకున్నారు. అయితే దేన్ని పడితే దాన్ని పెంచుకోవడానికి వీలు కాదు. కారణం... ఒబామా కూతురు మాలియాకి కొన్ని కుక్కల వల్ల తీవ్రమైన అలర్జీ కలుగుతుంది. అందువల్లే ఆమెకు ఇబ్బంది లేకుండా పోర్చుగీస్ వాటర్ డాగ్‌ని తెచ్చుకోవాలనుకున్నారు. ఆ విషయం తెలిసిన కెనడీ ‘బో’ని తెచ్చి ఇచ్చారట.
ఎప్పుడైతే బో తమ ఇంట్లో అడుగుపెట్టిందో, అప్పుడే తమ కుటుంబంలో భాగమైపోయింది అంటారు ఒబామా. తన పిల్లలతో సమానంగా ఆయన కూడా ఈ బుజ్జికుక్కతో ఆడుతూ ఉంటారు. చాలాచోట్లకు దాన్ని వెంటబెట్టుకునే వెళ్తారు. దాంతో బాగా ఫేమస్ అయిపోయింది బో. ఒబామా గారితో పాటు దాని వార్తలు కూడా రెగ్యులర్‌గా వస్తూనే ఉంటాయిట అమెరికా పత్రికల్లో!
కొంగలు విడాకులు తీసుకుంటాయా!
ప్రపంచంలో మొత్తం పదిహేను రకాల కొంగ జాతులున్నాయి. అంటార్కిటికా, దక్షిణ అమెరికాల్లో తప్ప అన్ని ఖండాల్లోనూ కొంగలు కనిపిస్తాయి!
కొంగ పిల్లల్ని చిక్స్ అంటారు. కొంగల గుంపును ఫ్లాక్ అంటారు!
వీటి పిల్లలు ఎంత త్వరత్వరగా ఎదిగిపోతాయో తెలుసా? పుట్టాక రెండు నెలలు తిరిగేసరికల్లా రెక్కలు పెరిగి, ఆరోగ్యంగా తయారై, ఎగరడం మొదలుపెడతాయి. తమంతట తామే ఆహార వేటకు వెళ్లిపోతాయి!
చల్లటి నీటిలో గంటల పాటు కొంగలు నిలబడి ఎలా ఉండగలుగుతాయో ఎప్పుడైనా ఆలోచించారా? వాటికి తమ కాళ్లలోని రక్తనాళాలను నియంత్రించుకునే శక్తి ఉంటుంది. తద్వారా రక్తప్రసరణ వేగాన్ని పెంచుకోగలవు, తగ్గించుకోగలవు. బయటి వాతావరణాన్ని తట్టుకోవడమనేది శరీరంలోని రక్తప్రసరణను బట్టే ఉంటుంది కాబట్టి చల్లటి నీటిలో ఉన్నా వాటికేమీ కాదు!
చూడటానికి సన్నగా ఉన్నా, వీటి కాళ్లు చాలా బలంగా ఉంటాయి. గోళ్లు చాలా వాడిగా ఉంటాయి. శత్రువు నుంచి తప్పించుకోవడానికి కాలితో తొక్కిపెట్టి, గోళ్లతో రక్కేస్తాయి కొంగలు!
కొంగలు నిలబడి నిద్రపోతాయని చాలామంది అంటూ ఉంటారు. అది నిజమే కానీ... అన్ని కొంగలూ అలా చేయవు. రెండు జాతుల కొంగలు మాత్రమే అలా నిద్రపోతాయి. మిగిలినవి గూళ్లలోనే నిద్రిస్తాయి!
కొంగలు జీవితాంతం ఒకే కొంగతో కలసివుంటాయి. తమ జోడీ చనిపోతే ఒంట రిగానే ఉంటాయి. విడాకులు తీసుకున్నప్పుడు మాత్రమే మరోదానికి చేరువవుతాయి. ఆశ్చర్యంగా ఉంది కదూ! అవును... కొంగలు విడిపోతాయి. ఆడకొంగ గర్భం దాల్చడంలో విఫలమైతే అవి విడిపోతాయి. వేరే దానికి దగ్గరై సంతానోత్పత్తికి తిరిగి ప్రయత్నిస్తాయి. ఏది తనకు సంతానాన్ని ఇస్తుందో ఆ ఆడకొంగతోనే మగకొంగ జీవితాంతం ఉంటుందని పరిశోధనల్లో తేలింది!
కొంగలు ఇరవై నుంచి నలభయ్యేళ్లు జీవిస్తాయి. ఇన్నేళ్ల పాటు జీవించే పక్షులు కాస్త అరుదనే చెప్పాలి!
అరణ్యం: అధ్యక్షుల వారి ఆటవిడుపు... బో!
Published Sun, Sep 15 2013 2:39 AM | Last Updated on Fri, Oct 5 2018 9:08 PM
Advertisement
Advertisement