మలేనా, క్లెపెతాన్ జంట
బ్కోడ్స్కా వారోస్, క్రొయేషయా : ప్రేమ ఎంత గొప్పదంటే అనాముకుడిని సైతం ఆకాశమంతా ఎత్తు ఎదిగేలా చేస్తుంది. పిరికివారిని సైతం గొప్ప సాహసికులుగా మారుస్తుంది. దూర, భారాల్ని సైతం లెక్కచేయదు. ప్రేమకున్న శక్తే అలాంటిది. అందుకే క్లెపెతాన్ ప్రతి ఏడాది శీతాకాలం అయిపోగానే దక్షిణాఫ్రిక నుంచి 14వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి తూర్పు క్రొయేషియాలోని బ్రోడ్స్కి వారోస్ గ్రామంలో ఉన్న తన ప్రియురాలు మలేనాను కలుసుకుంటాడు. శీతకాలం అయిపోగానే రావడం ఏంటి, ఎప్పుడు మలేనా దగ్గరే ఉండొచ్చు కదా అంటే శీతకాలం కొంగలకు క్రొయేషియా అనుకూలమైన తావు కాదు. అవును మలేనా, క్లెపెతాన్ రెండు కొంగలు. మరి మలేనా కూడా క్లెపెతాన్‌తో దక్షిణాఫ్రికా వెళ్లొచ్చు కదా అనుకుంటే అది కుదరరు. ఎందుకంటే మలేనా వికలాంగురాలు.
మనుషులకే ఆదర్శంగా నిలిచిన ఈ ప్రేమ కొంగలు తూర్పు క్రొయేషియాలోని ఒక రిటైర్డ్ పాఠశాల ఉపాధ్యాయుడు స్టెపెన్ వోకిక్ ఇంట్లో జతకట్టాయి. ఓసారి వీటి ప్రేమకథను వినమంటున్నాడు వోకిక్. కొన్నాళ్ల క్రితం వోకిక్‌కి తన ఇంటి దగ్గరలోని చెరువు వద్ద గాయాలతో ఉన్న ఆడకొంగ మలేనా కనిపించింది. వేటగాడు మలేనాను తూపాకీతో కాల్చడం వల్ల మలేనా కాలు విరిగిపోయింది. గాయంతో బాధపడుతున్న మలేనాను వోకిక్ తన ఇంటికి తీసుకువచ్చాడు. దానికి వైద్యం చేసి ప్రాణాలు కాపాడాడు. ఈ క్రమంలోనే మలేనా క్లెపెతాన్ రెండు జతయ్యాయి. ఇవి ఇప్పటికే 62 పిల్లలను కూడా చేశాయి. శీతాకాలం క్లెపెతాన్ తూర్పు క్రొయేషియా నుంచి దక్షిణాఫ్రికకు వలస వెళ్తాడు. ఆ సమయంలో వోకిక్ మలేనాకు తన ఇంటిలోనే ఒక గదిలో హీటర్‌ను ఏర్పాటు చేసి వెచ్చగా ఉండేలా చుస్తాడు. వసంత రుతువు మొదలవ్వగానే క్లెపెతాన్ దక్షిణాఫ్రిక నుంచి తూర్పుక్రొషియాకి వస్తాడు. వేసవిలో ఈ ప్రేమ జంట కోసం వోకిక్ తన ఇంటి పైన వసతిని ఏర్పాటు చేస్తాడు.
ఇప్పటి నుంచే క్లెపెతాన్ తన పిల్లలకు ఎగరడంలో శిక్షణ ఇస్తున్నాడు. ఈ సారి ఆగస్టులో తన పిల్లలతో కలిసి ఈ మగ కొంగ దక్షిణాఫ్రికకు వలస వెళ్లనుంది. ఈ ప్రేమ పక్షులు ప్రస్తుతం క్రొయేషియాలో సెలబ్రటీలయ్యాయి. 1993లో వోకిక్ మలేనాను తన ఇంటికి తీసుకువచ్చాడు. నాటి నుంచి నేటి వరకూ మలేనా వోకిక్‌తో పాటే కలసి ఉంటుంది. వీరిద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. వోకిక్ తనతోపాటు మలేనాను చేపలుపట్టడానికి తీసుకువెళ్తాడు, ఇద్దరూ కలిసి టీవీ కూడా చూస్తారు. మలేనా పూర్తి బాధ్యత నాదే అంటున్నారు వోకిక్. క్రొయేషియాలో దాదాపు 1500 జతల తెల్ల కొంగలు ఉన్నాయి. సెంట్రల్ క్రొయేషియాలోని సిగాక్ 1994లో తొలి కొంగల గ్రామంగా పొందింది. ప్రస్తుతం బోడ్స్కా వారోస్ గ్రామంలో 210 పక్షులు ఉన్నాయి. ఇవి గ్రామస్తుల ఇళ్ల పైన ఏర్పాటుచేసుకున్న తమ గూళ్లలో నివసిస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ మనుషుల సంఖ్య కన్నా రెట్టింపుగా పక్షుల సంఖ్య ఉండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment