
అధ్వానంగా ఉన్న ఐదో దేశంగా భారత్
జొహన్నెస్‌బర్గ్: వాహన డ్రైవింగ్ విషయంలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశంగా దక్షిణాఫ్రికా నిలిచింది. వరుసగా రెండో ఏడాది ఈ అపప్రథ మూటగట్టుకున్న దేశంగా ఉంది. ఈ విషయంలో భారత్ ఐదో స్థానంలో ఉంది. అదేసమయంలో, ప్రపంచంలోనే డ్రైవింగ్‌కు అత్యంత సురక్షితమైన దేశంగా నార్వే వరుసగా నాలుగోసారి కీర్తి కిరీటం ధరించింది. అమెరికాకు చెందిన డ్రైవర్ ట్రెయినింగ్ కంపెనీ జుటోబీ వార్షిక నివేదికలో ఈ విషయాలున్నాయి. మొత్తం 53 దేశాలకు గాను దక్షిణాఫ్రికా అట్టడుగున 53వ స్థానంలో ఉండగా అమెరికాకు 51, భారత్‌కు 49వ ర్యాంకులు దక్కా యి.
రహదారులపై స్పీడ్ లిమిట్లు, డ్రైవర్లకు బ్లడ్ ఆల్కహాల్ మోతాదు పరిమితులు, రహదారి ప్రమాదాల స్థాయిలు ఆధారంగా డ్రైవింగ్‌కు సురక్షితమైన, ప్రమాదకరమైన దేశాలను విశ్లేషించామ ని జుటోబీ తెలిపింది. ప్రతి లక్ష మందిగాను రోడ్డు ట్రాఫిక్ ప్రమాదాల్లో చనిపోయే సరాసరి సంఖ్య గతేడాది 8.9 ఉండగా ఈసారి ఇది 6.3కు తగ్గిందని జుటోబీ పేర్కొంది. దక్షిణాఫ్రికాలో చట్టాలున్నా అవినీతి అధికారుల కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయన్నది అందరికీ తెలిసిన విషయమని జొహన్నెస్‌బర్గ్‌కు చెందిన డ్రైవింగ్ కంపెనీ ఉద్యోగి అలిషా చిన్నాహ్ వ్యాఖ్యానించారు.