
అంతర్జాతీయ క్రికెట్‌లో సౌతాఫ్రికా ఎంత దురదృష్టమైన జట్టో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఐసీసీ టోర్నీలో ఈ జట్టు దురదృష్టం పతాకస్థాయిలో ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ (1991) ఇచ్చిన నాటి నుంచి సౌతాఫ్రికా ఒకే ఒక ఐసీసీ టైటిల్ (1998 ఛాంపియన్స్ ట్రోఫీ) గెలిచింది. టన్నుల కొద్ది టాలెంట్ ఉన్నా ఈ జట్టుకు అదృష్టం కలిసి రాదు. ఐసీసీ టోర్నీల్లో మొదటి దశలో రెచ్చిపోయే సౌతాఫ్రికన్లు నాకౌట్ మ్యాచ్‌లు వచ్చే సరికి తేలిపోతారు. నాకౌట్ మ్యాచ్‌ల్లో.. ముఖ్యంగా సెమీఫైనల్స్‌లో సౌతాఫ్రికాను ఏదో ఒక రూపంలో దురదృష్టం వెంటాడుతుంది. తాజాగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనలే ఇందుకు నిదర్శనం.
కాగా, సౌతాఫ్రికా దురదృష్టాన్ని ఆ జట్టు విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ కొనసాగిస్తున్నాడు. క్లాసెన్ ఎక్కడ నాకౌట్ మ్యాచ్‌లు ఆడినా అతని జట్టు ఓటమిపాలవుతుంది. క్లాసెన్ నాకౌట్ ఫోబియా ఒక్క సౌతాఫ్రికాకే పరిమితం కాలేదు. ప్రైవేట్ లీగ్‌ల్లోనూ క్లాసెన్‌ను నాకౌట్ బూచి వెంటాడుతుంది. ప్రైవేట్ లీగ్‌ల్లో క్లాసెన్ ఆడిన మూడు నాకౌట్ మ్యాచ్‌ల్లో అతను ప్రాతినిథ్యం వహించిన జట్లు ఓడాయి.
2023 మేజర్ లీగ్ క్రికెట్ ఫైనల్లో క్లాసెన్ ప్రాతినిత్యం వహించిన సియాటిల్ ఓర్కాస్ ముంబై ఇండియన్స్ న్యూయార్క్ చేతుల్లో ఓడింది.
2024 సౌతాఫ్రికా టీ20 లీగ్ ఫైనల్లో క్లాసెన్ ప్రాతినిథ్యం వహించిన డర్బన్ సూపర్ జెయింట్స్ సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ చేతుల్లో ఓటమిపాలైంది.
2024 ఐపీఎల్ ఫైనల్లో క్లాసెన్ ప్రాతినిథ్యం వహించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కేకేఆర్ చేతుల్లో పరాజయంపాలైంది.
తొలి నాకౌట్ నుంచే..
క్లాసెన్ ప్రాతినిథ్యం వహించిన తొలి ఐసీసీ నాకౌట్‌లోనే సౌతాఫ్రికా ఓటమిపాలైంది. 2023 వన్డే సెమీఫైనల్లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియా చేతిలో చిత్తైంది. క్లాసెన్ ప్రాతినిథ్యం వహించిన రెండో ఐసీసీ నాకౌట్‌లో సౌతాఫ్రికా గుండెబద్దలైంది. 2024 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో ఆ జట్టు భారత్ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది.
తాజాగా క్లాసెన్ ప్రాతినిథ్యం వహించిన మూడో ఐసీసీ నాకౌట్‌లో కూడా సౌతాఫ్రికాకు చేదు అనుభవమే మిగిలింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో సౌతాఫ్రికాను న్యూజిలాండ్ చిత్తుగా ఓడించింది. నాకౌట్ మ్యాచ్‌ల్లో ఇన్ని పరాభవాలు ఎదురుకావడంతో క్లాసెన్‌పై క్రికెట్ అభిమానులు జాలి చూపిస్తున్నారు. పాపం క్లాసెన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో సౌతాఫ్రికా గ్రూప్ దశలో అదిరిపోయే ప్రదర్శనలు చేసింది. ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్‌పై ఘన విజయాలు సాధించింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. అయినప్పటికీ సౌతాఫ్రికా గ్రూప్ టాపర్‌గా సెమీస్‌కు చేరింది.
సెమీస్‌లోనూ మంచి ప్రదర్శనే చేసినప్పటికీ న్యూజిలాండ్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ సూపర్ సెంచరీలు చేసి సౌతాఫ్రికా చేతి నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. సెమీస్‌లో సౌతాఫ్రికాను చిత్తు చేసిన న్యూజిలాండ్ ఫైనల్లో భారత్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment