పక్షులకు నీటినందించే మట్టి తాగునీటి సీసాలు
అనకాపల్లి: సూర్యుడు ఠారెత్తిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. ఈ సమయం.. పశుపక్ష్యాదులకు గడ్డుకాలం. పల్లెల్లో పక్షులకు ఏదో రూపంలో ఆహారం, నీరు సమకూరుతాయి. పట్టణ ప్రాంతాల్లో జంగిల్ కాంక్రీట్ పుణ్యమా అని నీరు లభించడమే కష్టమవుతోంది. అందుకే పక్షి ప్రేమికులు వాటి కోసం విలక్షణంగా ఆలోచించారు. పట్టణాల్లో కూడా ఆహారం, నీరు అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. పర్యావరణ పరిరక్షణకు విశేష సేవలందించిన కొణతాల ఫణిభూషణ్ శ్రీధర్ ఆధ్వర్యంలో సేవామూర్తులు పక్షులకు అండగా నిలుస్తున్నారు.
చదవండి👉: 11 ఏళ్ల కిందట సంచలనం.. ఇప్పటి యువ ఐపీఎస్‌లకు పాఠమైంది..
పక్షి జాతిని కాపాడుకుందామని ప్రదర్శన చేస్తున్న విద్యార్థినులు
నూనె డబ్బాను నాలుగు అరలుగా అమరిక
చెట్ల వద్ద ఆహారం, నీటి సౌకర్యం
గ్రీన్‌క్లబ్ వ్యవస్థాపకుడైన కొణతాల ఫణిభూషణ్ శ్రీధర్ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. తాను పని చేసే పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దే అలవాటు ఉన్న శ్రీధర్ మాస్టారు.. పర్యావరణ పరిరక్షణలో కూడా ముందుంటారు. వేసవి నేపథ్యంలో పట్టణంలో అక్కడక్కడా ఉండే చెట్ల వద్ద అలమంటించే పక్షులకు ఆహారం, నీటిని అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. నూనె డబ్బాలను సగానికి కోసి దాంట్లో నాలుగు అరలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క అరలో కొర్రలు, గంట్లు వంటి ఆహార పదార్థాలను, మరో అరలో నీటిని వేసి చెట్లకు కట్టించారు. నీటి బాటిళ్లను మట్టిపాత్రలకు అమర్చి పలు చోట్ల ఏర్పాటు చేశారు. పక్షిజాతిని కాపాడుకోవాలని పలుచోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మొక్కకు అమర్చిన మట్టిపాత్ర
పక్షుల కోసమే..
ఇప్పటికే చాలా పక్షిజాతులు అంతరించిపోయాయి. వేసవికాలంలో అవి పడే ఇబ్బందులు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా నగరాల్లో పక్షులకు ఆహారం, మంచినీరు అందించే లక్ష్యంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. పక్షి జాతులకు ఎంతో కొంత సహాయం చేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. ఈ మహాయజ్ఞంలో చాలా మంది పాలు పంచుకుంటున్నారు.
– ఫణిభూషణ్ శ్రీధర్, క్లబ్ వ్యవస్థాపకుడు
Comments
Please login to add a commentAdd a comment