విదేశీ విహారి..! | Foreign Birds Visit Starts in PSR Nellore | Sakshi
Sakshi News home page

విదేశీ విహారి..!

Published Wed, Sep 25 2019 12:15 PM | Last Updated on Wed, Sep 25 2019 12:15 PM

Foreign Birds Visit Starts in PSR Nellore - Sakshi

నేలపట్టు పక్షుల కేంద్రంలోని కడప చెట్లపై జతలుగా విడిది చేస్తున్న నత్తగుల్లకొంగలు

పర్యాటక ప్రేమికుల మానస సరోవరం.. అందమైన లోకం..దేశ విదేశాల నుంచి రెక్కలు కట్టుకుని వచ్చి వాలిపోయే విహంగాల విడిది.. శీతాకాలంలో సందడి చేయాల్సిన విదేశీ అతిథులు ముందే నేలపట్టుకు వచ్చేశాయి. వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడి కడప చెట్లపై విడిది చేస్తున్నాయి. వందల సంఖ్యలో నత్తగుల్ల కొంగలు జతలు జతలుగా కనువిందు చేస్తున్నాయి. తెల్లకంకణాయిలు సైతం దర్శనమిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పక్షులసంరక్షిత కేంద్రంలోని చెరువుల్లో నీళ్లు వచ్చి చేరాయి. దీంతో విదేశీ పక్షులు ముందుగానే ఇక్కడకు వచ్చి వాలాయి. మామూలుగా అయితే వీటి సీజన్‌ అక్టోబర్‌ నుంచి ఏప్రిల్‌ వరకూ ఉంటుంది.విస్తారంగా వర్షాలు కురిసి చెరువుల్లో నీరు వచ్చి చేరితేనేగూడబాతులు వస్తాయి.

నెల్లూరు, దొరవారిసత్రం:  నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రంలో విదేశీ పక్షుల సందడి మొదలైంది. మామూలుగా వచ్చే నెలలో వీటి సీజన్‌ ప్రారంభం కావల్సి ఉంది. ఈ ఏడాది ముందుగానే వచ్చి చేరాయి. అక్టోబర్‌ మాసంలో వీటి సీజన్‌ ప్రారంభం కానున్న దృష్ట్యా అధికార యంత్రాంగం ఏర్పాట్లను చేస్తోంది.   ఇప్పటికే తాగునీటి వసతి, చెరువు కట్టపై వ్యూ పాయింట్ల వద్ద షెల్టర్లు, సేద తీర్చుకునేందుకు బెంచీలు తదితర ఏర్పాట్లలో అటవీశాఖ అధికారులు, సిబ్బంది బిజీగా ఉన్నారు. వీటితోపాటు పిల్లల పార్కులో దెబ్బతిన్న వస్తువుల మరమ్మతులు, వాచ్‌ టవర్‌ నిర్వహణ వంటి పనులు చకచకా చేయిస్తున్నారు.

టిక్కెట్‌ కౌంటర్‌ ప్రారంభం
నేలపట్టు పక్షుల కేంద్రం ప్రధాన గేట్ల వద్ద గత వారం టిక్కెట్‌ కౌంటర్‌ను అటవీశాఖ అధికారులు ప్రారంభించారు. ప్రవేశ రుసుము వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దలకు రూ.10, పిల్లలకు రూ.5, బైక్‌కు రూ.20, ఆటోకు రూ.50, జీపు, కారులకు రూ.100, మినీబస్, బస్, టెంపో తదితర వాటికి రూ.250, కెమెరాకు రూ.100, బైనాక్యులర్‌కు రూ.50, విదేశీ పర్యాటకులకు అయితే ఒక్కొక్కరికి ప్రవేశ రుసుము రూ.500, విదేశీయుల కెమెరాకు రూ.100 చెల్లించాల్సి ఉంది.

పక్షుల కేంద్రంలో రెస్టారెంట్‌
విదేశీ విహంగాల సీజన్‌లో ఇక్కడకు విచ్చే సందర్శకులకు భోజన వసతి, టీ, బిస్కెట్‌ వంటి సదుపాయాలు లేనందున చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈడీసీ వారే కేంద్రంలో రెస్టారెంట్‌ను నడిపే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. దీనికి చెందిన ప్రతిపాదనల నివేదికను ఉన్నతాధికారులకు పంపాం. 2017–18, 2018–19 రెండేళ్లలో ప్రవేశ రుసుము ద్వారా రూ.14 లక్షల వరకు వచ్చింది. ఈ నిధితో కేంద్రంలో సందర్శకులకు అవసరమైన అభివృద్ధి పనులు, నిర్వహణ పనులు చేపడతాం.           – కె.రామకొండారెడ్డి, రేంజర్, నేలపట్టు పక్షుల కేంద్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement