బరంపురం: వేసవి కారణంగా ప్రస్తుతం జిల్లాలో పెరుగుతున్న రోజువారీ ఉష్ణోగ్రతలకు చిలికా సరస్సులోని విదేశీ విహంగాలు మృత్యువాత పడుతున్నాయి. చిలికా వన్యప్రాణి సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో గత కొన్నిరోజుల నుంచి జరుగుతున్న సరస్సులోని విదేశీ పక్షుల లెక్కింపు ప్రక్రియ బుధవారం సాయంత్రం నాటికి పూర్తయింది. ఈ లెక్కన సరస్సులోని పలు దీవులు సహా సరస్సు పరిసర ప్రాంతాల్లో మొత్తం 59,687 పక్షులు నివశిస్తున్నట్లు అధికారులు తేల్చారు. వీటిలో 22,395 విదేశీ పక్షులు ఉండగా, మిగతా 39,292 పక్షులు స్థానిక పక్షులుగా అధికారులు గుర్తించారు.
ఏటా నవంబర్‌లో శీతాకాలం సమీపించగానే విడిది కోసం విదేశాల నుంచి ఇక్కడి సరస్సుకి చేరుకునే ఈ అతిథి పక్షులు తిరిగి ఫిబ్రవరిలో వేసవి ప్రారంభం కాగానే తమ స్వదేశానికి బయలుదేరుతాయి. అయితే ప్రస్తుతం అనివార్య కారణాల వల్ల ఇక్కడే ఉండిపోయిన కొన్ని విదేశీ పక్షులు వేసవి ఉష్ణోగ్రతల కారణంగా చనిపోతున్నాయి. మృతి చెందుతున్న వాటిల్లో ఎక్కువగా ఫ్లెమింగో, పెలికాన్, బ్రాహ్మణి డక్ పక్షులు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. రోజూ 36 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో ఈ ఉష్ణాన్ని ఈ పక్షులు తట్టుకోలేకపోతున్న కారణంగానే మృతి చెందుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, విదేశీ పక్షుల మరణాలు జరగకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించాలని పర్యాటకులు, యాత్రికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment