సాక్షి, సిటీబ్యూరో: చూడముచ్చటైన పక్షులు విలవిలలాడుతున్నాయి. ఖండాంతరాలనుంచి వలస వచ్చి ప్రాణాలను పోగొట్టుకుంటున్నాయి. నగరానికి వస్తున్న విదేశీ విహంగాల పాలిట ప్లాస్టిక్ వ్యర్థాలు, శబ్ద, వాయు కాలుష్యం శాపంలాపరిణమిస్తున్నాయి. ఆహారం, వసతి కోసం నగరంలో పలు మంచినీటిచెరువులకు వలస వస్తున్నవాటిలో ఎన్నో పక్షులు ఇక్కడే మృత్యువాతపడుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు, చేపల కోసం వేసిన వలల్లో చిక్కుకొని ప్రాణాలు విడుస్తున్నాయి. ప్రతి ఏటా అక్టోబర్– ఫిబ్రవరి మధ్యలో వలస వస్తున్న పక్షుల్లో సుమారు 30 నుంచి 40 శాతం తగ్గుముఖం పడుతున్నట్లు పక్షి శాస్త్రవేత్తల గణాంకాలు వివరిస్తున్నాయి. మరోవైపు చేపలు పట్టేందుకు ఏర్పాటు చేస్తున్న వలలకు ఉన్న ప్లాస్టిక్ దారాలు పక్షుల ముక్కులకు, మెడలకు చుట్టుకొని ఊపిరివదలుతుండటంఆందోళన కలిగిస్తోంది. వీటి శాతం సుమారు 13 శాతం ఉన్నట్లు పక్షి శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కనుమరుగవుతున్నపలు జాతుల పక్షులు..
రాజహంసలు.. బాతులు.. కొంగలు.. గోరింకలు.. డేగలు తదితర పక్షుల జాడ క్రమంగా కనుమరుగవుతోంది. శబ్ద, వాయు కాలుష్యం, వాటి సహజ ఆవాసాలైన చెరువులు, కుంటలు, జలాశయాలు కాలుష్యకాసారంగా మారడం, కబ్జాకు గురవడంతో వాటి విస్తీర్ణం తగ్గడం, నగరీకరణ ప్రభావం, పర్యాటక, మానవ తప్పిదాలు, చైనా మాంజా.. ఇలా కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్లుగా వలస పక్షుల పాలిట శాపంగా మారుతున్నాయి. సైబీరియా, యూరప్, ఆఫ్రికా, మియన్మార్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ తదితర దేశాల నుంచి గ్రేటర్ నగరంతో పాటు.. సిటీకి ఆనుకొని ఉన్న పలు పర్యాటక ప్రాంతాలకు ఏటా అక్టోబర్– ఫిబ్రవరి మధ్య కాలంలో వేలాదిగా విభిన్న రకాల పక్షి జాతులు తరలివస్తుంటాయి.
మాయమవుతున్నవాటిలో ఇవీ..
ఈ సమయానికి హిమాయత్‌సాగర్‌కు సుమారు 200 వరకు గుజరాత్ నుంచి రాజహంసలు వలస వస్తాయి. కానీ ఈసారి వీటి సంఖ్య 50కి మించి లేదని పక్షి ప్రేమికులు చెబుతున్నారు. విభిన్న రకాల గోరింక ప్రజాతులదీ ఇదే పరిస్థితి. సుమారు పదివేల కిలోమీటర్ల దూరం నుంచి వలస వచ్చే బార్‌హెడ్‌గూస్ (బాతు) జాడ కూడా కనిపించకపోవడం గమనార్హం. ఆఫ్రికా ఖండం నుంచి వలస వచ్చే పైడ్ క్రస్టెడ్ కకూ అనే పక్షి జాడ లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పక్షి కనిపిస్తే ఆ ప్రాంతంలో వర్షం కురుస్తుందన్న నానుడి ఉండడం విశేషం. పక్షుల రాక తగ్గిపోవడంతో జీవవైవిధ్యం కనుమరుగవుతోందని పక్షి శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
వలస పక్షులకు ఈ ప్రాంతాలు ఆలవాలం
గ్రేటర్‌తో పాటు సిటీకి ఆనుకొని ఉన్న పలు పర్యాటక ప్రాంతాలు ఏటా వలస పక్షులను అక్కున చేర్చుకొని వాటికి ఆహారం, వసతి సమకూరుస్తున్నాయి. ప్రధానంగా కేబీఆర్ పార్క్, అనంతగిరి హిల్స్, ఫాక్స్‌సాగర్ (జీడిమెట్ల), అమీన్‌పూర్ చెరువు, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, మంజీరా జలాశయాలకు ఏటా సుమారు 200 జాతులకు చెందిన వేలాది పక్షులు తరలివస్తాయి. కానీ ఈసారి వీటిలో 30– 40 శాతం తగ్గుముఖం పట్టినట్లు పక్షి శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పక్షుల వలసలకు ప్రధాన కారణాలు..
ప్రధానంగా అధిక ఉష్ణోగ్రతలు, శీతల వాతావరణం ,మంచు ప్రభావంతో ఆహారం, వసతి సమకూర్చుకోవడం కష్టతరంగా మారడంతో వేలాది కిలోమీటర్ల నుంచి నగరానికి పక్షులు వలస వస్తుంటాయి. పక్షులు వలసవచ్చే ప్రాంతాల్లో సమశీతోష్ణ వాతావరణం ఉండడం, వలస వచ్చే ప్రాంతంలో ఉన్న జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గి నీటిలో వృక్ష, జంతు ఫ్లవకాలు, చిన్న కీటకాలు ఆహారంగా లభ్యమవుతాయి. ఆయా కారణాల రీత్యా పక్షులు వలస వస్తాయని నిపుణులు చెబుతున్నారు .
ఈ ప్రాంతాల్లో వలసలు మాయం...
పదేళ్ల క్రితం నగరంలోని హుస్సేన్‌సాగర్‌కు విభిన్న రకాల బాతులు, వాటి ప్రజాతులకు చెందిన పక్షులు వలస వచ్చేవి. ఇప్పుడు ఈ జలాశయం కాలుష్య కాసారం కావడంతో ప్రస్తుతం వలస పక్షుల జాడే కనుమరుగైంది. ఇబ్రహీంపట్నం, సరూర్‌నగర్, కాప్రా, రామకృష్ణాపూర్, బోయిన్‌పల్లి చెరువుల్లోనూ ఇదే దుస్థితి. ఆయా జలాశయాల్లో గుర్రపుడెక్క ఉద్ధృతి తీవ్రంగా ఉండడంతో నీటిపై తేలియాడుతూ జీవించే పక్షి జాతుల మనుగడ కష్టతరమవుతోంది.
ప్రధాన కారణాలివే..
♦ చేపలను పట్టేందుకు ఏర్పాటు చేస్తున్న వలలకున్న ప్లాస్టిక్ దారాలు పక్షుల ముక్కు, మెడకు చుట్టుకొని మృత్యువాత పడుతున్నాయి
♦ ఆయా ప్రాంతాల్లో శబ్ద, వాయు కాలుష్యం అధికంగా ఉండడం
♦ జలాశయాల విస్తీర్ణం క్రమంగా కబ్జాలు, అన్యాక్రాంతం కావడంతోకుంచించుకుపోయాయి.
♦ పట్టణీకరణ ప్రభావంతో ఆయాజలాశయాల చుట్టూ జనావాసాలు,పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు నెలకొనడం
♦ పర్యాటక కార్యకలాపాలు, టూరిస్టుల రాకపోకలు పెరగడంతో దెబ్బతింటున్న పక్షుల సహజ జీవన శైలి
♦ మానవ సంబంధ కార్యకలాపాలు, ఫొటోలు తీయడం, పక్షుల సహజఆవాసాలను దెబ్బతీయడం
♦ చైనీస్ మాంజా చెట్లు, కొమ్మలకుచిక్కుపడడం.. వీటిలో పక్షులుచిక్కి ప్రాణాలు కోల్పోవడం
నగరీకరణ, కాలుష్యం వల్లే..
ప్లాస్టిక్ వ్యర్థాలు, చేపల వలలు, పట్టణీకరణ ప్రభావం, శబ్ద, వాయు కాలుష్యాలే వలస పక్షుల పాలిట శాపంగా మారుతున్నాయి. వీటి మరణాల శాతం క్రమంగా పెరుగుతోంది. వలస పక్షుల సంరక్షణకు అన్ని వర్గాలు పాటుపడాలి.– డాక్టర్ శ్రీనివాసులు, అసిస్టెంట్ ప్రొఫెసర్, జంతుశాస్త్ర విభాగం, ఓయూ
ఈ కేంద్రాలకు వలస వచ్చే ప్రధాన పక్షి జాతులివే: గుజరాత్ రాజహంసలు (గ్రేటర్ ఫ్లెమింగోలు), పిన్‌టెయిల్డ్ డక్ (బాతు), షౌలర్, గార్గినే టేల్, హ్యారియర్స్ డేగలు, ఫ్లైక్యాచెస్, గోరింక ప్రజాతికి చెందిన రోజీపాస్టర్స్, స్టార్ లింక్స్, భార్మెడో గూస్ బాతు, గుజరాత్ రాజహంసలు, పైడ్ క్రస్టడ్ కకూ వీటిలో ప్రధానంగా కొంగలు, బాతులు,డేగలు, గుడ్లగూబలు, నీటికోళ్లు జాతులున్నాయి.
వలస పక్షులకు నిలయాలు.. ఈ ప్రాంతాలు
ప్రాంతం వలస పక్షుల జాతులు, ప్రజాతులు
1 కేబీఆర్ పార్క్ 24 రకాలు
2 అనంతగిరి హిల్స్ 37 ,,
3 ఫాక్స్‌సాగర్ (జీడిమెట్ల) 38 ,,
4 అమీన్‌పూర్ చెరువు 42,,
5 హిమాయత్ సాగర్ 52,,
6 ఉస్మాన్ సాగర్ 99,,
7 మంజీరా 153,,
Comments
Please login to add a commentAdd a comment