బుట్టాయగూడెం (ఏలూరు జిల్లా): బెంగాల్ పులులు.. బంగారు బల్లులు.. గిరి నాగులు.. అలుగులు.. అరెంజ్ ఓకలీఫ్ సీతాకోక చిలుకలు వంటి అరుదైన జీవజాలానికి నిలయమైన పాపికొండలు అభయారణ్యంలో తాజాగా మరో అతిథికి చోటు దక్కింది. కొమ్ము కత్తిరి (ఇండియన్ హార్న్‌బిల్) పక్షులకు ఈ అభయారణ్యం అలవాలంగా మారింది. ఏలూరు, అల్లూరి సీతారామరాజు, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పరిధిలో గలగల పారే అందాల గోదావరికి ఇరువైపులా 1,01,200 హెక్టార్లలో పాపికొండలు అభయారణ్యం విస్తరించి ఉంది.
ఇక్కడ విలువైన వృక్షాలు, వివిధ జంతువులతో పాటు కొమ్ము కత్తిరి పక్షులు కిలకిలారావాలు ఆలపిస్తున్నాయి. కొన్నిచోట్ల వీటిని ఇబిరిత పక్షులని కూడా పిలుస్తారు. పొడవాటి ముక్కుతో ఉండే ఈ పెద్ద పక్షుల రెక్కలు నలుపు రంగులో ఉంటాయి. రెక్కల మధ్యలోని తెలుపు చారలు అవి ఎగురుతున్నప్పుడు మెరుస్తుంటాయి. పాపికొండలు అభయారణ్యంలో ఈ అరుదైన పక్షులు బాలాజీ అనే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ కెమెరాకు చిక్కాయి.
జీవితమంతా ఒక పక్షితోనే..
ఈ పక్షులు పండ్లు, పురుగులను ఆహారంగా తీసు కుంటాయి. ఇవి జీవిత కాలమంతా ఒక పక్షితోనే జత కడతాయి. వీటికి ప్రేమ పక్షులనే పేరు కూడా ఉంది. ఆడ, మగ పక్షులు జతగా ఉంటాయి. గుడ్లు పొదిగే సమయంలో ఆడ పక్షికి కావాల్సిన ఆహారం, గూడు సమకూర్చే బాధ్యత మగ పక్షి తీసుకుంటుంది. చెట్లలో సహజంగా ఉండే తొర్ర లనే ఇవి గూడుగా ఏర్పాటు చేసుకుని వాటిలో నివసిస్తాయి. హార్న్‌బిల్ ఆడ పక్షి సుమా రు 4 నెలలపాటు గూట్లోనే ఉంటూ గుడ్లు పెట్టి పొదుగుతుంది. ఆ సమయంలో మగ పక్షులే ఆహారాన్ని తీసుకొచ్చి చెట్టు తొర్రల కన్నం ద్వారా ఆడ పక్షికి తినిపిస్తాయి. పిల్లలు పుట్టాక తల్లి, పిల్ల పక్షులకు సైతం ఆహారం తీసుకొచ్చి పెడుతుంటాయి.
పోలవరం పరిసర ప్రాంతాల్లో..
పాపికొండలు అభయారణ్యంలో వీటిలో అత్యధికంగా 150 వరకు ఇండియన్ హార్న్‌బిల్ జాతి పక్షులు ఉన్నట్టు వైల్డ్‌లైఫ్ అధికారులు చెప్పారు. పోలవరం మండలంలోని శివగిరి, సిరివాక, పేరంటాలపల్లి, కొరుటూరు తదితర ప్రాంతాల్లో ఈ పక్షులు ఎక్కువగా సంచరిస్తున్నాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల పలు గ్రామాలు ముంపు ప్రభావిత ప్రాంతాలుగా మారడంతో అనేక గ్రామాలను అధికారులు ఖాళీ చేయించారు. దీంతో ఆయా గ్రామాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఈ పక్షులు ఆయా ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే వీటి సంతతి పెరుగుతున్నట్టు గుర్తించామని వైల్డ్‌లైఫ్ అధికారులు వెల్లడించారు.
వన్య ప్రాణుల సంరక్షణపై ప్రత్యేక చర్యలు
పాపికొండల అభయారణ్యంలో జీవవైవిధ్యం పెరిగింది. అరుదైన జంతువులు, పక్షుల సంఖ్య కూడా పెరుగుతోంది. వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం సరిహద్దుల్లో బేస్ క్యాంప్‌లు ఏర్పాటు చేశాం. ప్రత్యేక బృందాల ద్వారా పహారా కాసే ఏర్పాట్లు చేశాం. వన్యప్రాణులను వేటాడాలని చూస్తే కఠిన శిక్షలు తప్పవు.
– దావీద్‌రాజు నాయుడు, ఫారెస్ట్ రేంజ్ అధికారి, పోలవరం
Comments
Please login to add a commentAdd a comment