Love Birds
-
మరో అతిథికి చోటు: ప్రేమ పక్షులివి.. జీవిత కాలమంతా ఒక్క పక్షితో...
బుట్టాయగూడెం (ఏలూరు జిల్లా): బెంగాల్ పులులు.. బంగారు బల్లులు.. గిరి నాగులు.. అలుగులు.. అరెంజ్ ఓకలీఫ్ సీతాకోక చిలుకలు వంటి అరుదైన జీవజాలానికి నిలయమైన పాపికొండలు అభయారణ్యంలో తాజాగా మరో అతిథికి చోటు దక్కింది. కొమ్ము కత్తిరి (ఇండియన్ హార్న్‌బిల్) పక్షులకు ఈ అభయారణ్యం అలవాలంగా మారింది. ఏలూరు, అల్లూరి సీతారామరాజు, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పరిధిలో గలగల పారే అందాల గోదావరికి ఇరువైపులా 1,01,200 హెక్టార్లలో పాపికొండలు అభయారణ్యం విస్తరించి ఉంది. ఇక్కడ విలువైన వృక్షాలు, వివిధ జంతువులతో పాటు కొమ్ము కత్తిరి పక్షులు కిలకిలారావాలు ఆలపిస్తున్నాయి. కొన్నిచోట్ల వీటిని ఇబిరిత పక్షులని కూడా పిలుస్తారు. పొడవాటి ముక్కుతో ఉండే ఈ పెద్ద పక్షుల రెక్కలు నలుపు రంగులో ఉంటాయి. రెక్కల మధ్యలోని తెలుపు చారలు అవి ఎగురుతున్నప్పుడు మెరుస్తుంటాయి. పాపికొండలు అభయారణ్యంలో ఈ అరుదైన పక్షులు బాలాజీ అనే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ కెమెరాకు చిక్కాయి. జీవితమంతా ఒక పక్షితోనే.. ఈ పక్షులు పండ్లు, పురుగులను ఆహారంగా తీసు కుంటాయి. ఇవి జీవిత కాలమంతా ఒక పక్షితోనే జత కడతాయి. వీటికి ప్రేమ పక్షులనే పేరు కూడా ఉంది. ఆడ, మగ పక్షులు జతగా ఉంటాయి. గుడ్లు పొదిగే సమయంలో ఆడ పక్షికి కావాల్సిన ఆహారం, గూడు సమకూర్చే బాధ్యత మగ పక్షి తీసుకుంటుంది. చెట్లలో సహజంగా ఉండే తొర్ర లనే ఇవి గూడుగా ఏర్పాటు చేసుకుని వాటిలో నివసిస్తాయి. హార్న్‌బిల్ ఆడ పక్షి సుమా రు 4 నెలలపాటు గూట్లోనే ఉంటూ గుడ్లు పెట్టి పొదుగుతుంది. ఆ సమయంలో మగ పక్షులే ఆహారాన్ని తీసుకొచ్చి చెట్టు తొర్రల కన్నం ద్వారా ఆడ పక్షికి తినిపిస్తాయి. పిల్లలు పుట్టాక తల్లి, పిల్ల పక్షులకు సైతం ఆహారం తీసుకొచ్చి పెడుతుంటాయి. పోలవరం పరిసర ప్రాంతాల్లో.. పాపికొండలు అభయారణ్యంలో వీటిలో అత్యధికంగా 150 వరకు ఇండియన్ హార్న్‌బిల్ జాతి పక్షులు ఉన్నట్టు వైల్డ్‌లైఫ్ అధికారులు చెప్పారు. పోలవరం మండలంలోని శివగిరి, సిరివాక, పేరంటాలపల్లి, కొరుటూరు తదితర ప్రాంతాల్లో ఈ పక్షులు ఎక్కువగా సంచరిస్తున్నాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల పలు గ్రామాలు ముంపు ప్రభావిత ప్రాంతాలుగా మారడంతో అనేక గ్రామాలను అధికారులు ఖాళీ చేయించారు. దీంతో ఆయా గ్రామాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఈ పక్షులు ఆయా ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే వీటి సంతతి పెరుగుతున్నట్టు గుర్తించామని వైల్డ్‌లైఫ్ అధికారులు వెల్లడించారు. వన్య ప్రాణుల సంరక్షణపై ప్రత్యేక చర్యలు పాపికొండల అభయారణ్యంలో జీవవైవిధ్యం పెరిగింది. అరుదైన జంతువులు, పక్షుల సంఖ్య కూడా పెరుగుతోంది. వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం సరిహద్దుల్లో బేస్ క్యాంప్‌లు ఏర్పాటు చేశాం. ప్రత్యేక బృందాల ద్వారా పహారా కాసే ఏర్పాట్లు చేశాం. వన్యప్రాణులను వేటాడాలని చూస్తే కఠిన శిక్షలు తప్పవు. – దావీద్‌రాజు నాయుడు, ఫారెస్ట్ రేంజ్ అధికారి, పోలవరం -
నడిరోడ్డుపై రెచ్చిపోయిన లవ్ బర్డ్స్.. బెడిసి కొట్టి..
లక్నో: సోషల్ మీడియాలో అడ్డదిడ్డమైన పోస్టులతో రెచ్చిపోతోంది ఇప్పటి యువత. లైకులు, షేర్ల కోసం ఇష్టానుసారం అప్ లోడ్ చేస్తోంది. అయితే ఫేమ్ అవ్వడం మాటేమోగానీ.. విమర్శలు ఎదుర్కోవడం పరిపాటిగా మారుతోంది. తాజాగా ఏపీ వైజాగ్‌లో ఘటన మర్చిపోకముందే.. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అయితే.. లవర్ అడిగింది రైడ్‌కు తీసుకెళ్లాడట ఓ వ్యక్తి. కానీ, వాళ్లు అక్కడితోనే ఆగలేదు. రెచ్చిపోయారు.. బండి మీద వెళ్తూ.. కౌగిలింతలు, ముద్దులు అంతకు మించి అసభ్య చేష్టలకు పాల్పడింది ఓ ప్రేమ జంట. యూపీ లక్నో హజరత్గంజ్లో జరిగిన ఈ ఘటన.. సోషల్ మీడియా ద్వారా విపరీతంగా వైరల్ అయ్యింది. దారినపోయే కొందరు ఆ వీడియో తీసి ఇంటర్నెట్లో వదిలారు. ఇంకేం.. అడ్డూ అదుపు లేకుండా వైరల్ అయ్యిందా వీడియో. ప్రజల దృష్టిని ఆకర్షించడమే కాదు.. కాస్త చిరాకు తెప్పించింది ఆ వీడియో. వీడియో ఆధారంగా ఆ బండిని ట్రేస్ చేసిన లక్నో పోలీసులు.. బండి ఓనర్, ఆ వీడియోలోని వ్యక్తి అయిన విక్కీ శర్మను అదుపులోకి తీసుకున్నారు. ర్యాష్ డ్రైవింగ్, అసభ్య చేష్టలకుగానూ బండిని సీజ్ చేసి.. యువకుడిపై ఐపీసీ సెక్షన్ 294, 279 కింద కేసులు నమోదు చేశారు. ఇక వీడియోలో ఉంది మైనర్ కావడంతో.. ఆ అమ్మాయిని తల్లిదండ్రుల సమక్షంలో వార్నింగ్ ఇచ్చి వదిలేశారు పోలీసులు. వీడియోల కోసం క్లిక్ చేయండి -
పిల్ల అడిగిందని రైడ్‌కు తీసుకుపోవడం తప్పు కాదు. కానీ, అతి చేష్టలకు పాల్పడితేనే..
-
స్టేజ్‌పైనే ప్రియుడికి ముద్దుపెట్టిన జోర్దార్ సుజాత
తెలంగాన యాసలో మాట్లాడుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది జోర్దార్ సుజాత. బిగ్‌బాస్ షోలో పాల్గొని మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇక ఇటీవలె రాకింగ్ రాకేశ్ అనే కమెడియన్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరి లవ్ ట్రాక్ రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ నడుస్తుంది. ఇప్పటికే తమ ప్రేమ గురించి బహిరంగంగానే మాట్లాడిన ఈ జోడీ తాజాగా మరోసారి హాట్ టాపిక్‌గా నిలిచారు. ఓ షోపై వీరి జంట సందడి చేసింది. ఈ సందర్భంగా రాకేశ్ మాట్లాడుతూ.. తమది ప్రమోషన్ కోసం పుట్టిన ప్రేమ కాదు.. షో కోసం చేసే షో కాదు.. జీవితాంతం కలిసుండే ప్రేమ అంటూ స్టేజీ మీద అందరి ముందే చెప్పేశాడు. రాకేశ్ మాటలకు ఫిదా అయిన సుజాత స్టేజ్‌పైనే అతడిని కౌగిలించుకొని ముద్దు పెట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. -
వైరల్: గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేయడానికి వెళ్తూ..
వాషింగ్టన్: తమ స్నేహితురాలికి ఎప్పటికీ గుర్తుండిపోయేలా తమ ప్రేమను ప్రత్యేకంగా వ్యక్తం చేయాలనుకుంటారు అబ్బాయిలు. అదే విధంగా అమెరికాకు చెందిన జాక్సన్ కూడా తన గర్ల్‌ఫ్రెండ్ మరియా గుగ్లోట్టాకు వినూత్నంగా ప్రపోజ్ చేసి మధర జ్ఞాపకంగా మలచుకోవాలనుకున్నాడు. ఇందుకోసం తన స్నేహితురాలిని ఆమెరికాలోని మిచిగాన్ సరస్సు వద్దకు తీసుకెళ్లాడు. తనకు ప్రపోజ్ చేస్తూ సరస్సులో జారిపడ్డ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించి వీడియోను మరియా తన ఫేస్బుక్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. (చదవండి: ఈ బుడ్డోడు నిజంగా సూపర్) ఈ వీడియోలో మరియా సరస్సు ఒడ్డున నిలుచుని ఉంది. దీంతో జాక్సన్ తనకు రింగు తొడిగి ప్రపోజ్ చేసేందుకు తనవైపు నడుస్తూ ఉండగా అల తన కాలుని తాకడంతో జారిపడ్డాడు. ఆ తర్వాత లేచి మోకాళ్లపై నిలుచుని తనకు రింగ్ తోడిగి ప్రపోజ్ చేశాడు. ఈ వీడియోకు ఇప్పటి వరకు వేలల్లో వ్యూస్, వందల్లో కామెంట్స్ వస్తున్నాయి. ‘ఇది ఎప్పటికి గుర్తుండిపోయే సంఘటన’, ‘ఇది అద్భుతం’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
లవ్ జర్నీ
‘చేతిలోన చెయ్యేసి చెప్పేయవా....’ అంటూ న్యూయార్క్ వీధుల్లో పాడుకుంటున్నారు లవ్ బర్డ్స్ ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా, హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. వీలు కుదిరినప్పుడల్లా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారీ జోడీ. ఇటీవలే ఇండియాకు వచ్చిన నిక్, ప్రియాంక, పరిణీతీ చోప్రాతో కలసి గోవా వెకేషన్ ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే.ఆ తర్వాత నిక్‌తో కలసి ప్రియాంక న్యూయార్క్ రిటర్న్ అయ్యారు. ఇప్పుడు అక్కడ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. చేతులు కలుపుకుంటూ న్యూయార్క్ స్ట్రీట్స్‌లో షికారు చేస్తున్నారు, సైక్లింగ్ చేస్తూ వీధులన్నీ చుట్టేస్తున్నారు. ఇలా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట కలసి ఏడడుగులు ఎప్పుడేస్తారని ఎదురు చూస్తున్నారు ప్రియాంక అభిమానులు. 25 దాటేశారు కేవలం ఒక్కరోజు గ్యాప్‌లోనే 25 క్రాస్ చేశారు దీపికా పదుకోన్, ప్రియాంకా చోప్రా. మూడు పదుల వయసు దాటిన వీళ్లు ఇప్పుడు 25 క్రాస్ చేయడమేంటంటే అది ఏజ్‌లో కాదండీ.. ఫాలోయింగ్‌లో. ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఇద్దరు భామలు 25 మిలియన్ (రెండున్నర కోట్లు) ఫ్యాన్స్‌ను సాధించారు. ఈ ఫీట్‌ను ప్రియాంకా గురువారం చేరుకోగా, ఆ మరుసటి రోజే దీపికా పదుకోన్ 25 మిలియన్స్‌ను చేరుకోవడం విశేషం. -
‘ప్రేమ’పక్షులు
ఇద్దరు ప్రేమికులు ఎలా ముచ్చట్లు చెప్పుకుంటారో..? ఒకరు ఆలస్యంగా వస్తే.. మరొకరు ఎలా చిరుకోపం ప్రదర్శిస్తారు. ఆ తర్వాత వారిని సముదాయించి తాను ఆలస్యంగా రావడానికి కారణాలు చెప్పి ఆ లవర్‌ను కూల్ చేస్తారు. అలాగే ఇక్కడ ఈ చిలుకలను చూస్తే ఇలాంటి కథనే అల్లాలనిపిస్తుంది.. కదూ..? ఓ చిలుక అప్పుడే మరో చిలుక వద్దకు వచ్చింది.. దీంతో ఆలస్యంగా వచ్చినందుకు మరో చిలుకపై చిరుకోపం ప్రదర్శించింది. దీంతో సారీ అంటూ సముదాయించి..బుజ్జగించి ముద్దులు పెట్టుకున్నది. ఈ దృశ్యాలు దానవాయిగూడెం వద్ద ‘సాక్షి’ కెమెరాకు చిక్కాయి. – ‘సాక్షి’ ఫొటో జర్నలిస్టు, ఖమ్మం -
లవ్ బిజినెస్
రెడ్ రోస్.. ప్రేమకు చిహ్నం! దాని ఖరీదు ఎంతో తెలుసా? ఒకే ఒక్క రోజా పువ్వు ధర..ఒక్క రోజు వంద రూపాయలు! టెడ్డీబేర్.. ప్రియురాలికి ఇష్టమైన సాఫ్ట్ టాయ్.. జానెడు బొమ్మ వెల ఆరడుగుల ప్రియుడిని బేర్మనేలా చేస్తోంది! లవర్స్‌ను ఊరించే కానుక ఉంగరం! కాని దాని కాస్ట్ ఇమిటేషన్స్లోనే వేలు పలుకుతుంటే ఖంగుమంటున్నారు! పెర్ఫ్యూమ్.. ప్రేమికులను దరిచేర్చే పరిమళం! ఒక్క స్ప్రేతో లవ్‌ను లాక్కుందామనుకుంటే ప్రైస్ ట్యాగ్ ముందుకు ప్రొసీడ్ కాకుండా లాక్ చేస్తోంది! ఏ శుభకార్యాన్నయినా తీపితో మొదలుపెట్టడం మన ఆనవాయితీ! అందుకే ఐ లవ్యూ అనే మంచి మాటను తియ్యగా చెబుదామంటే చాక్లేట్ ధర చేదు రుచిని తలపిస్తోంది! ఇక్కడ ఉదాహరణలే కాదు కానుకలనే ఊహల వెల కూడా ఆకాశానికి ఉయ్యాలేసి లవ్‌బర్డ్స్‌ను ఊరిస్తోంది అందుకోమని! తమ ప్రెషస్ ప్రేమ పారమీటర్ వందలు దాటి వెలకు చేరుతోంటే పట్టుకోవడానికి ప్లాన్ వేసుకుంటున్నారు ప్రేమికులు! అదే అదను అని సొమ్ము చేసుకుంటున్నారు వ్యాపారులు! ఇది ప్రేమికుల రోజు కథ.. వాలంటైన్స్ డే స్పెషల్! ప్రేమించడానికి మనసుంటే సరిపోతుంది.. కానుకలెందుకు? బ్లాక్ అండ్ వైట్ కాలంనాటి మాట ఇప్పుడు చెల్లదండీ! ఏ కానుకల్లేకుండా ప్రేమను పేలవంగా చెప్తే ఏం బాగుంటుంది? గిఫ్ట్స్‌తో గుబాళించాలి! అప్పుడే అవతలి వాళ్లు అట్రాక్ట్ అవుతారు అనేది కొత్త కాన్సెప్ట్! ప్రేమించడానికి ఇటు అబ్బాయిల జేబు, అటు అమ్మాయిల పర్స్ రెండూ నిండుగానే ఉండాలి. నిండుకుంటే లవ్ వే గేట్స్ మూసేసుకుంటుంది. వాలెంటైన్ జానపద గాథను ప్రేమకు చిరునామాగా మలచి వ్యాపారులు ఆ దారిని పరిస్తే మీడియా ట్రెండ్‌గా పాపులర్ చేసింది! ప్రేమికులు బ్లైండ్‌గా ఫాలో అవుతున్నారు! అందుకే ఇంతకుముందు గుట్టుచప్పుడు కాకుండా సాగిన ప్రేమాయణం ఇప్పుడు కాస్టీ›్ల వ్యవహారంగా సందడిచేస్తోంది.. కాసులను ఖర్చుపెట్టిస్తోంది. వ్యాపారుల పంట పండిస్తోంది. ఎర్ర గులాబీ గుసగుసలు అన్ని డేస్లాగే పాశ్చాత్య ప్రపంచం వాలెంటైన్ డేనూ మూడో ప్రపంచం మీదకు వదిలింది. తన లవ్బిజినెస్ ఫార్ములాను ఆ దేశాల మార్కెట్‌కూ అందించింది. ఉత్పత్తులను దించింది. వీటికి ఎంత గిరాకీ అంటే ఇండిపెండెన్స్ డే ఇంపార్టెన్స్‌ను మరిచిపోయినా వాలంటైన్స్‌డే సెలబ్రేషన్స్‌ను మాత్రం గుర్తుపెట్టుకుంటోంది యూత్. వ్యాపారులకు కావాల్సిందీ అదే! వాలంటైన్స్డేను ఫేమస్ చేయడానికి పెట్టిన ఖర్చును అణాపైసలతో సహా రాబట్టుకుంటున్నాయి ఆ సంస్థలు. ఇదంతా ఓ పథకం.. ప్రణాళిక. వాటి జోలికి పోకుండా వాలంటైన్స్ డే రోజు డిమాండ్‌లో ఉన్న ఉత్పత్తులేంటి? వాటిని మార్కెట్లోకి వదిలిన శక్తులేంటో తెలుసుకుందాం! ఆ తొమ్మిది కంపెనీలు.. వాలంటైన్స్ డే లవ్బిజినెస్ ఐడియాను క్రియేట్ చేసింది, ఇంప్లిమెంట్ చేసిందీ అమెరికానే! స్వీట్నథింగ్స్ను కరెన్సీ రేపర్లో చుట్టి ప్రేమికుల కళ్లబడేలా పేర్చింది. ఈ కష్టానికి క్రెడిట్ అమెరికాలోని 9 కంపెనీల ఖాతాలోనే జమవుతుంది. ది నేషనల్ రిటైల్ ఫెడరేషన్ (అమెరికా) లెక్క ప్రకారం వాలంటైన్స్ డే ఒక్కరోజే ఈ కంపెనీల లాభం లక్షా పదమూడు వేల తొమ్మిది వందల కోట్ల పై మాటే. 1-800 ఫ్లవర్స్, ది హర్షే కంపెనీ, హాల్మార్క్కార్డ్స్, నెకో, వెర్మోంట్ టెడ్డీ బేర్, విక్టోరియాస్ సీక్రెట్, టిఫనీ అండ్ కో, అర్మెల్లిని ఎక్స్ప్రెస్లైన్స్, ది యూఎస్ పోస్టల్ సర్వీస్ మొదలైన 9 కంపెనీలు ఆ జాబితాలో ఉన్నాయి. 1-800 ఫ్లవర్స్... మోస్ట్ వాంటెడ్ ఫర్ లవర్స్ ఇది ప్రేమ గులాబీలు అంటే రెడ్రోజెస్ను, ఇతర కానుకలను అమ్మే సంస్థ. ఒక్క ప్రేమికులరోజు నాడే తన యేడాది ఆదాయం కన్నా పది శాతం అధిక సేల్స్ ఉంటాయి ఈ కంపెనీకి. గిఫ్ట్స్ ఆర్డర్ చేసిన లవర్స్‌కి క్షణం ఆలస్యం చేయకుండా అందించేందుకు వాలంటైన్స్‌డే ఒక్కరోజే అదనంగా ఆరువేల మంది వర్కర్స్‌ను అపాయింట్ చేసుకుంటుందంటే ఎంత డిమాండో అర్థం చేసుకోవచ్చు. ఆ ఖర్చుకి ఆరింతల లాభం వస్తుందని చెప్తాడు 1-800 కంపెనీ సీఈవో జిమ్ మెకాన్. యేటా 40 శాతం మంది కొత్త కస్టమర్స్ కూడా పెరుగుతారట. హర్షే ... కాక పుట్టించే చాక్లేట్ ఇది అమెరికన్ పాపులర్ చాక్లేట్స్ కంపెనీ. యేడాది మొత్తంలో కన్నా యాభై యాతం అధికంగా వాలెంటైన్స్‌డే రోజు హర్షేకి బిజినెస్ ఉంటుందట. హాల్‌మార్క్ కార్డ్స్.. గ్రీటింగ్స్కే హాల్‌మార్క్ వాలెంటైన్స్ డే గ్రీటింగ్స్ కార్డ్స్‌కి ఈ కంపెనీ ప్రసిద్ధమైంది. దాదాపు పధ్నాలుగువందల వాలంటైన్స్‌డే కార్డ్స్ డిజైన్స్‌ను క్రియేట్ చేసింది. స్టాటిస్టిక్ బ్రెయిన్ సర్వే ప్రకారం కిందటేడాది వాలంటైన్స్ డే రోజు 150 మిలియన్ల మంది హాల్‌మార్క్ కార్డ్స్‌ను తమ ప్రేమికులకు పంపారు. క్రిస్మస్ తర్వాత అంత పెద్దమొత్తంలో ఆదాయం తెచ్చిపెట్టేది వాలెంటైన్స్ డేనే అని ఒప్పుకుంటుంది హాల్‌మార్క్ కార్డ్స్ యాజమాన్యం. నెకో.. లవ్స్ స్వీట్హార్ట్ క్యాండీస్ కంపెనీ. ఇది చతురస్రాకారం, బేస్బాల్స్, వాచెస్ ఆకారంలో క్యాండీస్‌ను తయారు చేసినన్నాళ్లు దీనికి పెద్ద గిరాకీ లేదు. ఎప్పుడైతే పిప్పర్మెంట్ సైజులో హార్ట్‌షేప్ ఆకారంలో క్యాండీస్‌ను తయారు చేయడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి సప్లయ్ చేయలేనంతటి డిమాండ్ పెరిగిందట. దీన్ని వాలెంటైన్స్ డేకి యూఎస్పిగా ఎలా మలచుకోవాలో ఆలోచించమని మార్కెటింగ్ స్టాఫ్‌కి ఆర్డర్ వేసింది యాజమాన్యం. ఈ హార్ట్షేప్లోని క్యాండీస్ మీద ప్రేమికులకు సంబంధించిన సేయింగ్స్, కొటేషన్స్‌ను ముద్రించి మార్కెట్లోకి రాసులు పోశారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 14 వరకు ప్రతిరోజూ ప్రపంచ వ్యాప్తంగా లక్షపౌండ్ల క్యాండీహార్ట్స్ను అమ్మి ఆదాయం గడిస్తోంది నెకో! వెర్మోంట్ టెడ్డీ బేర్.. వాలెంటైన్స్ డిమాండ్ ఈ కంపెనీ టెడ్డి బేర్ వరల్డ్ ఫేమస్. మల్టీ మిలియన్ డాలర్ బిజినెస్ కంపెనీ. వాలంటైన్స్ డే గిఫ్ట్‌గా ఇది తయారు చేసే టెడ్డీకి ఎంత బెట్టంటే ఆర్నెల్ల ముందుగానే ఆర్డర్ ఇచ్చేంత. ఈ పాటికి అర్థమయ్యే ఉండాలి వెర్మెంట్కి వాలెంటైన్స్ డే బిజినెస్ ఎంతో! విక్టోరియాస్ సీక్రెట్.. హాటెస్ట్ గిఫ్ట్ మాయిశ్చరైజర్స్, పెర్ఫ్యూమ్స్, లోదుస్తులు తయారు చేసే కంపెనీ ఇది. కాని లోదుస్తులకే బ్రాండ్ నేమ్ సంపాదించుకుంది. వాలెంటైన్స్ డే రోజు పాశ్చాత్య దేశాల్లోని ప్రతి ప్రేమికుడు తన ప్రియురాలికి విక్టోరియాస్ సీక్రెట్ కంపెనీ లో దుస్తులు గిఫ్ట్‌గా ఇచ్చి తన ప్రేయసి మనసెరిగిన ప్రియుడిగా ముద్ర వేయించుకోవాలని తపనపడుతుంటాడట. రిచ్ బాయ్‌ఫ్రెండ్‌గా బిల్డప్ ఇవ్వాలనుకుంటాడట. ఈ లెక్కన ఆ ఒక్కరోజు ఈ కంపెనీ లాభాలెంతో అంచనాకు అందే ఉంటాయి కదా! టిఫనీ అండ్ కో.. జ్యుయెలరీ అందుకో మొదట ఇది స్టేషనరీ షాప్. తర్వాత వరల్డ్ ఫేమస్ జ్యుయలరీ కంపెనీ. వాలెంటైన్స్ డే రోజు ప్రతి ముగ్గురిలో ఒక పురుషుడు తన ప్రియురాలికో, భార్యకో టిఫనీ అండ్ కో జ్యుయలరీని ప్రెజెంట్ చేయాలనుకుంటాడు. ఆ రోజుకి తన సేల్స్ ఎంతో చెప్పకుండా సీక్రెట్‌గా ఉంచుతుంది ఈ కంపెనీ. బిలియన్లలోనే ఆదాయం ఉంటుందంటారు మార్కెట్ విశ్లేషకులు. అర్మెల్లిని ఎక్స్‌ప్రెస్ లైన్స్ .. ప్రేమ డెలివరీ లైన్స్ పువ్వుల రవాణాలో పేరుమోసిన సంస్థ. వాలంటైన్స్ డే రోజు ఎర్రగులాబీలను పంపిణీ చేయడానికి రెండు నెలల ముందునుంచే సమాయత్తమవుతుంది. అదనంగా ట్రక్ డ్రైవర్స్‌ను నియమించుకుంటుంది. మామూలు రోజుల్లో కన్నా ప్రేమికుల రోజు నాడు నాలుగున్నరరెట్లు ఎక్కువుంటుంది దీని వ్యాపారం! యూఎస్ పోస్టల్ సర్వీస్.. సందేశాలను మోసుకొచ్చే సర్వీస్ మెయిల్స్, మొబైల్స్, వాట్సప్ మెస్సేజెస్ ఎన్ని ఉన్నా.. పోస్టల్ సర్వీస్‌లో వచ్చిన చిన్న కార్డుముక్క అందించే ఆనందం వేరు..ఆస్వాదించే దగ్గరి తనం వేరు. ఆ సంప్రదాయాన్నే నిలుపుతోంది ది యూఎస్ పోస్టల్ సర్వీస్. ప్రేమికుల అనురాగ సందేశాలను, ప్రేమ పలుకులను పొదువుకున్న గ్రీటింగ్ కార్డ్స్‌ను పదిలంగా పట్టుకొచ్చి అప్పజెప్పడంలో ది యూఎస్ పోస్టల్ సర్వీస్‌ను మించిన సర్వీసే లేదట. అందుకే వాలెంటైన్స్ డేకి వారం ముందునుంచే బిజీ అయిపోతుంది.. అయిదు నుంచి ఏడు శాతం అధికంగా వచ్చిపడే కార్డ్స్, ప్యాకేజెస్ అండ్ పార్సిల్స్‌తో. క్రిస్మస్ తర్వాత అంత పని, అంతేపెద్ద మొత్తంలో ఆదాయమూ వచ్చే పండగ ప్రేమికుల పండగే అని సంబరపడ్తోంది ఈ పోస్టల్ సర్వీస్ సంస్థ. నాట్ ఓన్లీ ఫర్ కపుల్స్.. పాశ్చాత్య సమాజంలో వాలెంటైన్స్ డేను కేవలం జంటలే కాదు ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితులు, క్లాస్మేట్స్, టీచర్లు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ ధోరణి ఈసారి ఆసియా దేశాల్లోనూ కనిపించే అవకాశం ఉంది. వాలెంటైన్స్‌డే డెస్టినేషన్స్ గిఫ్ట్స్ తయారు చేసే కార్పోరేట్ సంస్థలు, ట్రావెల్ హౌజెస్ ప్రేమికుల రోజు కోసం కేరళ, గోవా, నైనిటాల్, మౌంట్ అబు, డెహ్రాడూన్, ముస్సోరి, కసౌలి, షిమ్లా, పంచవటి మొదలైన ప్రదేశాలకు ప్రత్యేక టూర్ ప్యాకేజ్‌లను అందిస్తున్నాయి. వీటి ధర ఆరు వేల నుంచి అరవై వేల రూపాయల వరకు ఉంటోంది. వాలెంటైన్స్ డే పిచ్చిని ఎయిర్‌లైన్స్ సంస్థలూ సొమ్ము చేసుకుంటు న్నాయి. విమాన చార్జీల్లో రాయితీలుస్తూ స్పెషల్హాళఇడే ప్యాకేజేస్తో గాల్లో విహరింపచేస్తున్నాయి. వాలెంటైన్స్ డే కథ నిజానికి ఇది ప్రేమపక్షుల కథ కాదు. స్నేహం కథ! తల్లిదండ్రులు-బిడ్డలు, అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ములు, స్నేహితులు, రాజు - పేద, యజమాని- ఉద్యోగి మధ్య స్నేహాన్ని, ప్రేమను పెంచే కథ.. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచాన్ని ప్రేమమయం చేయమని చాటే ఓ సెయింట్ కథ. మూడో శతాబ్దంనాటి గ్రీకు కథ. రోమ్ చక్రవర్తి అయిన క్లాడియస్ 2 .. తాను నమ్మే పన్నెండు దేవతలను మాత్రమే పూజించాలని రోమన్లందరినీ ఆజ్ఞాపిస్తాడు. క్రిస్టియన్లతో ఎవరైనా సన్నిహితంగా మెదిలారని తెలిస్తే మరణశిక్ష ఖాయమనీ హెచ్చరిస్తాడు. కాని వాలెంటినస్ అనే సాధువు చక్రవర్తి మాటను చెవికెక్కించుకోడు. తన జీవితాన్ని క్రీస్తుకే అంకితం చేస్తాడు. దాంతో కన్నెర్ర చేసిన క్లాడియస్.. వాలెంటినస్‌ను జైల్లో పెట్టి మరణ శిక్ష విధిస్తాడు. ఆయనకు జూలియా అనే కూతురు ఉంటుంది. ఆమె పుట్టుకతో అంధురాలు. వాలెంటినస్ తన కూతురుకి అన్నీ నేర్పిస్తాడు. తనకళ్లతో ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. వారం రోజుల్లో ఆ సాధువుకు మరణశిక్ష అమలవుతుందనగా జైలర్ ఆయన్ని అడుగుతాడు.. ‘నీ కూతుర్ని చూడాలనుకుంటున్నావా?’ అని. పిలిపిస్తాడు. జైల్లోంచే తన కూతురుకి జీవన సత్యాలు బోధిస్తుం టాడు. ఆ జ్ఞానంతో జూలియాకు చూపు వస్తుంది. చివరకు తాను చనిపోయే ముందు రోజు జూలియాకు ఓ ఉత్తరం రాస్తాడు.. ‘దైవాన్ని నమ్ము.. ప్రపంచాన్ని ప్రేమించు.. ఫ్రమ్ యువర్ వాలెంటైన్’ అని! ఆ తర్వాత రోజు అంటే క్రీ.శ. 270, ఫ్రిబవరి 14న వాలెంటినస్కు మరణశిక్ష అమలవుతుంది. తన తండ్రిని సమాధి చేసిన చోట గులాబిరంగులో పూత పూసే బాదం మొక్క నాటుతుంది ఆమె. ఆ మొక్క తర్వాత కాలంలో వృక్షమై ప్రేమ, స్నేహానికి చిహ్నంగా నిలిచింది అంటారు. ఆ ప్రేమను, స్నేహాన్ని ప్రపంచానికి చాటడానికే ప్రతి ఫిబ్రవరి 14న వాలెంటినస్ పేరుమీద వాలెంటైన్స్ డేని జరుపుకోవడం మొదలుపెట్టింది ప్రపంచం. -
ప్రేమికులకు శుభవార్త..
ప్రేమికులకు శుభవార్త. నాలుగు మాటలతో మొదలై కప్పు కాఫీ దాకా.. అటుపై పార్కుల్లో చక్కర్ల నుంచి షాపింగ్ మాల్లో చిలిపి సరదాల వరకు.. ఆఖరికి హోటల్ లేదా లాడ్జ్ గదుల్లో తీవ్రమైన ముచ్చట్లదాకా ఎలాంటి బెరుకు లేకుండా పార్ట్నర్తో హాయిగా గడపొచ్చు. మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చెయ్యరు. ఆమాటకొస్తే పోలీసులు కూడా మిమ్మల్ని లైట్ తీసుకుంటారు. నమ్మకం కుదరకుంటే ఓ సారి ముంబై వెళ్లిరండి. వయసుతో నిమిత్తం లేకుండా జంటగా కనపడే ఎవ్వరి జోలికీ వెళ్లకూడదని, వాళ్లు ఎంత దగ్గరగా ఉన్నప్పటికీ ఏమీ అనొద్దని ఇటీవలే ముంబై పోలీసులను కమిషనర్ రాకేశ్ మారియా ఆదేశించారు . మోరల్ పోలీసింగ్ పేరుతో ఇకపై సిబ్బంది ఎవ్వరూ ప్రేమజంటల్ని వేధించొద్దని ఉత్తర్వులు జారీ చేశారు. ముంబై కమిషనరేట్‌లోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ ఉత్తర్వులు అమలయ్యేలా ఆయా స్టేషన్ల ఇన్చార్జిలకు సూచనలిచ్చారు. ఉన్నట్టుండి పోలీసులకు ప్రేమికులపై ఇంత ప్రేమ పెరగడానికి కారణం ఏమంటారా.. ఈ నెల మొదటివారంలో ముంబై లంకప్రాంతాలైన అక్సా, మాధ్, దానాపానిల్లోని హోటళ్లు, పార్కులపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఆయా పరిసరాల్లో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ మొత్తం 64 మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో అత్యధికులు ప్రేమపక్షులే కావడం విశేషం. కౌన్సెలింగ్ పేరుతో ఆ ప్రేమ జంటలకు హితబోధ చేసిన పోలీసులు.. చివరికి వారి తల్లిదండ్రులను పిలిపించి తీవ్రస్థాయిలో హెచ్చరించి పంపారు. అలా ఇంటికెళ్లినవారిలో.. ఓ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది. తాను పరిధిదాటి ప్రవర్తించనప్పటికీ పోలీసుల తీరుతో తల్లిదండ్రుల ముందు దోషిగా నిలబడాల్సి వచ్చిందని, అప్పటి నుంచి పేరెంట్స్ తనతో మాట్లాడటంలేదని, విపరీతమైన మానసిక వ్యధకు గురయ్యానని సూసైడ్ నోట్లో రాసింది. 'మిడ్ డే' పత్రిక ఈ వార్తను వెలుగులోకి తెచ్చింది. అంతే.. నగరం ఒక్కసారిగా భగ్గుమంది. మోరల్ పోలీసింగ్‌ను నిరసిస్తూ యువత ఐక్యమైంది. ఈ నేపథ్యంలోనే పౌరుల స్వేచ్ఛకు భంగం కల్గించేలా వ్యవహరించొద్దంటూ ముంబై కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. -
లవ్ బర్డ్స్..!
లేదు లేదంటూనే ఒకరికొకరు అన్నీ అయిపోతున్నట్టున్నారు క్రికెట్ స్టార్ విరాట్ కొహ్లీ- బాలీవుడ్ భామ అనుష్కాశర్మా. ఆసీస్ టూర్లో ఉన్న విరాట్‌తో క్రిస్మస్, న్యూ ఇయర్ గడిపేందుకు వెళ్లిన అనుష్కా... అక్కడ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తోంది. ఆన్ ఫీల్డ్‌లో విరాట్ నుంచి ఫ్లయింగ్ కిస్‌లు అందుకుంటున్న అమ్మడు... ఆఫ్ ఫీల్డ్‌లోనూ అతగాడిని వదిలిపెట్టకుండా తిరిగేస్తోంది. కొత్త సంవత్సరం రోజు ఈ ఇద్దరూ సిడ్నీలో క్యాజువల్ డ్రెస్సుల్లో షికార్లు కొట్టారట. నెట్లో సదరు ‘క్లిక్’లు ‘హిట్టు’ కొడుతున్నాయి. టెస్టు మ్యాచ్ కోసం ప్రస్తుతం మెల్బోర్న్లో ఉన్న విరాట్‌ను ఎంకరేజ్ చేసేందుకు అనుష్క తన టూర్ కూడా కొనసాగిస్తుందని సమాచారం. -
దీపికకు అతడే స్ఫూర్తి.. దీప్తి!!
గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారతీయ మహిళా స్క్వాష్ ప్లేయర్లు దీపికా పల్లికల్, జోష్న చిన్నప్ప స్వర్ణపతకం సాధించారు. అయితే, వాళ్లలో దీపిక గురించే ఎక్కువగా చర్చ జరిగింది. ట్విట్టర్లో అయితే, వాళ్లు విజేతలుగా నిలిచిన శనివారం రాత్రంతా దీపిక గురించే కబుర్లు నడిచాయి. అయితే.. ఆమెను ముందుండి నడిపించింది, దీపికకు స్ఫూర్తినిచ్చింది ఎవరో తెలుసా.. క్రికెటర్ దినేష్ కార్తీక్. 2013 నవంబర్‌లో వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ అయ్యింది. ఈ చెన్నై సుందరి, దినేష్ కార్తీక్ ఇద్దరూ ఒకే కోచ్ వద్ద ఫిట్నెస్ పాఠాలు నేర్చుకోవడంతో అక్కడే వీరిద్దరి ప్రేమపాఠాలు కూడా కొనసాగాయి. అది చివరకు ఎక్కడివరకు వెళ్లిందంటే.. ''ఆ మేజికల్ రోజున నావాడు నాకు తోడుంటే ఎంత బాగుండేదో'' అని ఆమె ట్వీట్ చేసింది. దాంతోపాటే వాళ్లిద్దరూ కలిసి తీయించుకున్న ఫొటో కూడా పెట్టింది. దాంతో దినేష్ కార్తీక్ కూడా తనకు కాబోయే భార్య సాధించిన విజయం పట్ల చాలా గర్వంగా ఉందంటూ చెప్పాడు. అంతేనా.. కార్తీక్ ఐపీఎల్లో ఆడుతున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు కెప్టెన్ కెవిన్ పీటర్సన్ అయితే ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేశాడు. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడలకు బయల్దేరే ముందు కార్తీక్ స్వయంగా వచ్చి విమానాశ్రయంలో తనకు కాబోయే భార్యామణిని దింపాడు. కనీసం ఒక్క పతకమైనా తీసుకురావాలని ఆమెకు మరీ మరీ చెప్పాడు. తొలిసారి ఆమె స్క్వాష్ మ్యాచ్ చూసినప్పటినుంచే దినేష్ కార్తీక్ పల్లికల్‌తో ప్రేమలో పడిపోయాడు. So glad I could have my man with me on such a magical day! @DineshKarthik pic.twitter.com/1Za4qSAKzd — Dipika Pallikal (@DipikaPallikal) August 2, 2014 -
కబూతర్.. ఆ.. జా.. .జా..
ఒకప్పుడు చక్రవర్తుల రాచకార్యాలు చక్కబెట్టిన ‘వేగు’చుక్క.. ప్రేమ రాయాబారాలు విజయవంతంగా నడిపి చెలి హృదయాన్ని కానుకగా తెచ్చి ఇచ్చిన ప్రేమ పావురం.. ఆపై కవుల కావ్యాలలో హుందాగా విహరించింది. సినీవినీలాకాశంలో పాటై.. ఎగిరిపోయే కపోతమై.. పరవశించింది. కాంక్రీట్ వనం కబూతర్ జా..జా.. అని కసురుతున్నా.. నేనూ పక్కా హైదరాబాదీనే అంటూ గూడుకట్టుకుని వేలాడుతోంది. పట్నవాసంలో.. ఆకాశహర్మ్యాల్లో హుందాగా బతుకుతున్న వారికి మాత్రం ఈ ప్రేమపావురాల మీద కన్నుకుట్టింది. కువకువ సడులతో సందడి చేసే శాంతి కపోతాలపై.. భరించలేని శబ్ద తరంగాలతో దాడి చేసి బెదరగొడుతున్నారు. జాలీలు బిగించి ఉసురు తీస్తున్నారు. నాలుగు గింజలు విదిలిస్తే శాంతి పావురాలు మన జోలికి రావన్న వాస్తవం తెలియక వాటిని చెదరగొడుతున్నారు. విశాల నగరంలో కాసింత జాలి కరువవ్వడంతో ఎటు ఎగిరిపోవాలో దిక్కు తోచక కపోతబాలలు బిక్కుబిక్కుమంటున్నాయి. అపార్ట్మెంట్లకు జాలీలు సిటీలోని చాలా అపార్ట్మెంట్లకు జాలీలను బిగిస్తున్నారు. ఫ్లాట్‌కి ఫ్లాట్‌కి మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో నుంచి పావురాలు లోనికి రాకుండా సన్నటి జాలీలను ఏర్పాటు చేస్తున్నారు. బాల ్కనీలకు కూడా మెష్లను పెట్టేస్తున్నారు. అదేమిటని అడిగితే.. పావురాల బెడద అంటున్నారు. ‘సందు దొరికితే చాలు...లోపలికి వచ్చేస్తున్నాయి. కిచెన్‌లో, బాత్రూంలో ఎక్కడ కాస్త చోటు కనపడినా గూళ్లు కట్టి గుడ్లు పెట్టేస్తున్నాయి. చూస్తూ..చూస్తూ గుడ్లతో ఉన్న గూళ్లని బయట పడేయలేం కదా! అందుకే జాలీలు పెట్టుకున్నాం’ ఓ మహిళ ఆవేదన. పావురం.. శాంతికి చిహ్నం. ఎవరికీ హాని చేయని ఈ పక్షి అపార్టుమెంటు వాసులకు శత్రువైపోవడం వెనుకున్న కారణం ఒకటే.. ఆహారం.‘కడుపు నిండా తిండి దొరికితే.. పావురం మీ ఇంటికి రాదు’ అని వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో వారు అంటున్నారు. మొన్నామధ్య ఉప్పల్‌లో కొన్ని అపార్ట్మెంట్లలో జాలీలను బిగించడం వల్ల వాటిల్లో చిక్కుకుని కొన్ని పావురాలు చనిపోయాయి. విషయం తెలుసుకున్న వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ అధికారులు అపార్ట్మెంట్ వాసులపై కేసులు పెట్టారు. వెంటనే జాలీలను తొలగించారు. ‘పొద్దున లేవగానే అపార్ట్మెంట్ కింద శుభ్రం చేయాలి. పావురాలు తెచ్చే చెత్తాచెదారం, వాటి రెట్టలతో చండాలమైపోతుంది. అపార్ట్మెంట్లో వాచ్మెన్ పనంటే మట్టి తగలకుండా బతకడం అనుకొని వచ్చాం. కానీ.. ఇక్కడ పావురాల పెంటంతా ఎత్తిపోసే సరికి ప్రాణం పోతోంది’ అంటూ సనత్‌నగర్‌లోని ఒక అపార్ట్మెంట్ వాచ్మెన్ వాపోయాడు. టెక్నాలజీ సాయంతో... కొన్ని ప్రాంతాల్లో సంపన్నవర్గాలవారు ఓ అడుగు ముందుకేసి పావురాలకు సౌండ్ ట్రీట్మెంట్ షాక్ ఇచ్చారు. అపార్ట్మెంట్, భవంతుల్లో ఆ మిషన్‌ను ఏర్పాటు చేయడంతో పావురాలు అటువైపు కన్నెత్తి చూడవు. ఆ మిషన్‌ని నుంచి వచ్చే ఒక రకమైన శబ్దం వల్ల పావురాలు వాటంతటవే వెళ్లిపోతాయి. అయితే ఆ మిషన్‌వల్ల నివాసితులకు కూడా కొన్ని ఇబ్బందులు రావడంతో వాటిని తొలిగించేశారు. ఇక లాభం లేదని వాళ్లు కూడా జాలీలనే ఆశ్రయించారు. నాలుగు గింజలే.. పరిష్కారం పావురమంటే అందరికీ ఇష్టమే. కానీ.. అది మా అపార్ట్‌మెంట్‌పై వాలితే మాత్రం నచ్చదంటున్నారు కొందరు. ఆకాశంలో హాయిగా ఎగిరిపోయే పావురాలను చూసి ఆనందిస్తాం కానీ.., మా నట్టింట గూడు కడితే భరించలేమంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టింది వైల్ట్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో. లక్షల రూపాయలు వెచ్చించి మెష్‌లు, మిషన్లు పెట్టే బదులు నాలుగు గింజలతో సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవచ్చని సూచిస్తున్నారు. ‘మొదట్లో చాలా అపార్ట్మెంట్లకు వెళ్లి చెబితే ఎవరూ నమ్మలేదు. ఇక లాభం లేదని డెమో ఇచ్చాం. అపార్టుమెంట్ టైపై గింజలు ఆహారంగా చల్లి వచ్చాం. ప్రతి రోజూ ఇలా చేయడం వల్ల అపార్టుమెంట్ ఆవాసంగా ఉన్న కపోతాలు గూడు, గుడ్లు సర్దుకుని బయటకు వెళ్లిపోయాయి. ఇక అప్పటి నుంచి ఆ అపార్ట్‌మెంట్‌వాసులు అదే ఫాలో అయ్యారు. కర్మాన్‌ఘాట్, హిమాయత్ నగర్, ముషీరాబాద్ ప్రాంతాల్లో మొత్తం ఇరవై అపార్ట్మెంట్లలో పొద్దున ఏడింటికల్లా టైపైన పావురాలకు ఆహారం వేస్తున్నారు. ప్రస్తుతం వారి ఇళ్లకు పావురాలు రావడం లేదు’ అంటూ తమ సక్సెస్ గురించి చెప్పారు ఓ అధికారి. నాన్ బెయిలబుల్ కేసు పొరపాటునో, కావాలనో పావురాన్ని చంపినా.. దాని చావుకి కారణమైనా.. బాధ్యులపై నాన్ బెయిలబుల్ కేసు పెడతారు. మూడేళ్ల కఠిన కారాగార శిక్షను విధిస్తారు. రూ.25 వేల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒకటీ అరా తప్ప ఇళ్లలోకి వచ్చి మనుషుల్ని ఇబ్బంది పెట్టే పావురాలు చాలా అరుదు. చేతనైతే నాలుగు గింజలు వేయాలి. లేదంటే ఊరుకోవాలి. అంతేగానీ.. వాటికి హానీ తలపెడితే మాత్రం చట్టం కఠినంగా శిక్షిస్తుంది. ఒకప్పుడు హైదరాబాద్‌లో బోలెడన్ని పిచ్చుకలు, పిట్టలు కనిపించేవి. వాటిని కూడా ఇలాగే తరిమి వేయడం వల్ల ఇప్పుడు పిల్లలకు వాటిని పుస్తకాల్లో చూపించాల్సి వస్తుంది. పావురాలపై ప్రేమ చూపకపోతే.. భవిష్యత్తులో వాటిని కూడా పుస్తకాల్లోనే చూసుకోవాల్సి వస్తుంది. - స్వామి స్వయం భగవాన్‌దాస్ స్టేట్ అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ మెంబర్ మీ అపార్ట్‌మెంట్‌కీ వస్తాం... ప్రతి రోజు ఉదయం ఏడింటికి నాలుగు దోసిళ్ల జొన్నలు, బియ్యం, పుట్నాలు, సజ్జలు చల్లితే చాలు.. అవి తినేసి వెళ్లిపోతాయి. మర్నాడు పొద్దున ఏడింటి వరకూ ఆ ఛాయలకు కూడా రావు. హైదరాబాద్‌లో పావురాలకు ఆవాసాలుగా మారిన అపార్ట్మెంట్లు వేల సంఖ్యలో ఉన్నాయి. వాళ్లందరికీ పావురాలు శత్రువులుగా కాకుండా.. స్నేహితులుగా మారాలంటే వాటి చిట్టి బొజ్జ నింపడం ఒకటే పరిష్కారం. మిషన్లు పెట్టడం, మెష్‌లు బిగించడం.. అన్నీ చట్టారీత్యా నేరమే. ఈ ప్రపంచంలో స్వేచ్ఛగా జీవించే హక్కు మనకెంత ఉందో.. పక్షులకూ అంతే ఉంది. వాటి హక్కుని ఏమాత్రం భంగం కలిగించినా శిక్షకు అర్హులవుతారు. ఒక సమస్య నుంచి బయటపడడానికి మరో పెద్ద సమస్యలో ఇరుక్కోవడం అంటే ఇదే. పావురాల సమస్యపై సాయమేమైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. - మహేశ్ అగర్వాల్, వైల్ట్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో స్పెషల్ ఆఫీసర్ ఫోన్ నెంబర్: 9394005600 -
బుల్లితెర మీద ప్రేమపావురం!
‘కబూతర్ జా జా జా కబూతర్ జా’ అంటూ వెండితెర మీద ఆమె కదులుతుంటే కుర్రాళ్ల ఊపిరి ఆగిపోయినంత పనయ్యింది అప్పట్లో. ఆ ఒక్క సినిమా ఆమెని అందరి మనసుల్లోనూ శాశ్వతంగా నిలబెట్టేసింది. ఆమె ఎవరో అర్థమైపోయింది కదూ... అవును, భాగ్యశ్రీనే. ‘మైనే ప్యార్ కియా’ని ఆమె కోసమే మళ్లీ మళ్లీ చూసినవాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆ చిత్రం డబ్బింగ్ వెర్షన్ ‘ప్రేమ పావురాలు’తో తెలుగువారి మనసులనూ దోచేసింది శ్రీ. కానీ ఆ తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు చేయలేదు. ఇరవై సినిమాలు కూడా చేయకుండానే సినిమాల నుంచి తప్పుకుంది. తెలుగులో చేసిన ‘ఓంకారం’ చిత్రమే ఆమె చివరి సినిమా. ఆ తరువాత కాపురం, పిల్లలు అంటూ ఓ సాధారణ మహిళలా బతకసాగింది. అయితే ఆమె లోని నటీమణి అలానే ఉండిపోలేకపోయింది. హిందీ సీరియళ్లతో పునఃప్రవేశం చేసింది. ఇంతవరకూ ఓ అయిదు సీరియళ్లు చేసింది. ఇప్పుడు ఆరో సీరియల్ ‘లౌట్ ఆవో త్రిష’తో రాబోతోంది. పద్దెనిమిదేళ్ల కూతురు హఠాత్తుగా కనిపించకుండా పోతే తల్లి పడే ఆవేదన, ఆతృత ఎలా ఉంటాయన్నదే ఈ సీరియల్. త్రిష అనే అమ్మాయికి తల్లిగా భాగ్యశ్రీ నటిస్తోంది. దాదాపు సీరియల్ అంతా ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. త్రిష అదృశ్యం కావడం, ఆమెను వెతుక్కుంటూ వెళ్తున్న క్రమంలో విచిత్రమైన అనుభవాలు ఎదురు కావడం, వాటిని సమర్థంగా ఎదుర్కోవడం వంటి విషయాలు ఆసక్తికరంగా ఉంటాయని ఊరిస్తున్నారు... ఈ సీరియల్‌ని ప్రసారం చేయనున్న లైఫ్ ఓకే చానెల్ వారు. ఏబీసీ చానెల్లో ప్రసారమైన ‘మిస్సింగ్’ ఆధారంగా ఈ సీరియల్‌ని రూపొందించారు. ‘మిస్సింగ్‌ను కేవలం పదే పది ఎపిసోడ్లతో ముగించారు. మరి హిందీలో ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి! -
ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
వికారాబాద్ రూరల్ న్యూస్‌లైన్: పెద్దలు తమ వివాహానికి అంగీకరించలేదని మనస్తాపం చెందిన ఓ ప్రేమజంట పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ప్రియుడు మృతిచెందగా.. ప్రియురాలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. వికారాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం ఈ విషాదం చోటుచేసుకుంది. ఎస్ఐ హన్మానాయక్ కథనం ప్రకారం.. నవాబుపేట్ మండలం మూలమాడ గ్రామానికి చెందిన తెలుగు భాస్కర్ (22), మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్ పసుల గ్రామానికి చెందిన రమ్య(19) కాటేదాన్‌లోని ఓ బిస్కెట్ కంపెనీలో ఏడేళ్లుగా పనిచేస్తున్నారు. వీరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమ చిగురించింది. పెద్దల అంగీకారంతో వివాహం చేసుకోవాలనుకున్న వారు.. విషయం ఇంట్లో తెలిపారు. ఇద్దరు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారవడంతో ఇరువర్గాల వారు పెళ్లికి నిరాకరించారు. గురువారం ఉదయం ప్రేమికులు రామయ్యగూడలో ఉన్న భాస్కర్ బంధువుల ఇంటికి వచ్చారు. ఉదయం 10:30 గంటల సమయంలో వికారాబాద్ నుంచి తాండూరు వెళ్లే ప్రధాన రహదారిలో కోర్టు ఎదుట పురుగుమందు తాగి పడిపోయారు. గమనించిన ఓ ఆటో డ్రైవర్ వెంటనే వారిని పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్యులు హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలించారు. గురువారం రాత్రి 7.30 గంటలకు పరిస్థితి విషమించి భాస్కర్ మృతిచెందాడు. రమ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.