కబూతర్.. ఆ.. జా.. .జా.. | Hyderabad Love birds a love send messages | Sakshi
Sakshi News home page

కబూతర్.. ఆ.. జా.. .జా..

Published Tue, Jul 15 2014 6:27 AM | Last Updated on Sat, Sep 2 2017 10:20 AM

కబూతర్.. ఆ.. జా.. .జా..

కబూతర్.. ఆ.. జా.. .జా..

ఒకప్పుడు చక్రవర్తుల రాచకార్యాలు చక్కబెట్టిన ‘వేగు’చుక్క.. ప్రేమ రాయాబారాలు విజయవంతంగా నడిపి చెలి హృదయాన్ని కానుకగా తెచ్చి ఇచ్చిన ప్రేమ పావురం.. ఆపై కవుల కావ్యాలలో హుందాగా విహరించింది. సినీవినీలాకాశంలో పాటై.. ఎగిరిపోయే కపోతమై.. పరవశించింది. కాంక్రీట్ వనం కబూతర్ జా..జా.. అని కసురుతున్నా.. నేనూ పక్కా హైదరాబాదీనే అంటూ గూడుకట్టుకుని వేలాడుతోంది. పట్నవాసంలో..  ఆకాశహర్మ్యాల్లో హుందాగా బతుకుతున్న వారికి మాత్రం ఈ ప్రేమపావురాల మీద కన్నుకుట్టింది. కువకువ సడులతో సందడి చేసే శాంతి కపోతాలపై.. భరించలేని శబ్ద తరంగాలతో దాడి చేసి బెదరగొడుతున్నారు. జాలీలు బిగించి ఉసురు తీస్తున్నారు.  నాలుగు గింజలు విదిలిస్తే శాంతి పావురాలు మన జోలికి రావన్న వాస్తవం తెలియక వాటిని చెదరగొడుతున్నారు. విశాల నగరంలో కాసింత జాలి కరువవ్వడంతో ఎటు ఎగిరిపోవాలో దిక్కు తోచక కపోతబాలలు బిక్కుబిక్కుమంటున్నాయి.
 
 అపార్ట్‌మెంట్లకు జాలీలు
 సిటీలోని చాలా అపార్ట్‌మెంట్‌లకు జాలీలను బిగిస్తున్నారు. ఫ్లాట్‌కి ఫ్లాట్‌కి మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో నుంచి పావురాలు లోనికి రాకుండా సన్నటి జాలీలను ఏర్పాటు చేస్తున్నారు. బాల ్కనీలకు కూడా మెష్‌లను పెట్టేస్తున్నారు. అదేమిటని అడిగితే.. పావురాల బెడద అంటున్నారు. ‘సందు దొరికితే చాలు...లోపలికి వచ్చేస్తున్నాయి. కిచెన్‌లో, బాత్‌రూంలో ఎక్కడ కాస్త చోటు కనపడినా గూళ్లు కట్టి గుడ్లు పెట్టేస్తున్నాయి. చూస్తూ..చూస్తూ గుడ్లతో ఉన్న గూళ్లని బయట పడేయలేం కదా! అందుకే జాలీలు పెట్టుకున్నాం’ ఓ మహిళ ఆవేదన.
 
 పావురం.. శాంతికి చిహ్నం. ఎవరికీ హాని చేయని ఈ పక్షి అపార్టుమెంటు వాసులకు శత్రువైపోవడం వెనుకున్న కారణం ఒకటే.. ఆహారం.‘కడుపు నిండా తిండి దొరికితే.. పావురం మీ ఇంటికి రాదు’ అని వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో వారు
 
 అంటున్నారు.
 మొన్నామధ్య ఉప్పల్‌లో కొన్ని అపార్ట్‌మెంట్లలో జాలీలను బిగించడం వల్ల వాటిల్లో చిక్కుకుని కొన్ని పావురాలు చనిపోయాయి. విషయం తెలుసుకున్న వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ అధికారులు అపార్ట్‌మెంట్ వాసులపై కేసులు పెట్టారు. వెంటనే జాలీలను తొలగించారు. ‘పొద్దున లేవగానే అపార్ట్‌మెంట్ కింద శుభ్రం చేయాలి. పావురాలు తెచ్చే చెత్తాచెదారం, వాటి రెట్టలతో చండాలమైపోతుంది. అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్ పనంటే మట్టి తగలకుండా బతకడం అనుకొని వచ్చాం. కానీ.. ఇక్కడ పావురాల పెంటంతా ఎత్తిపోసే సరికి ప్రాణం పోతోంది’ అంటూ సనత్‌నగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ వాపోయాడు.
 
 టెక్నాలజీ సాయంతో...
 కొన్ని ప్రాంతాల్లో సంపన్నవర్గాలవారు ఓ అడుగు ముందుకేసి పావురాలకు సౌండ్ ట్రీట్‌మెంట్ షాక్ ఇచ్చారు. అపార్ట్‌మెంట్, భవంతుల్లో ఆ మిషన్‌ను ఏర్పాటు చేయడంతో పావురాలు అటువైపు కన్నెత్తి చూడవు. ఆ మిషన్‌ని నుంచి వచ్చే ఒక రకమైన శబ్దం వల్ల పావురాలు వాటంతటవే వెళ్లిపోతాయి. అయితే ఆ మిషన్‌వల్ల నివాసితులకు కూడా కొన్ని ఇబ్బందులు రావడంతో వాటిని తొలిగించేశారు. ఇక లాభం లేదని వాళ్లు కూడా జాలీలనే ఆశ్రయించారు.
 
 నాలుగు గింజలే.. పరిష్కారం
 పావురమంటే అందరికీ ఇష్టమే. కానీ.. అది మా అపార్ట్‌మెంట్‌పై వాలితే మాత్రం నచ్చదంటున్నారు కొందరు. ఆకాశంలో హాయిగా ఎగిరిపోయే పావురాలను చూసి ఆనందిస్తాం కానీ.., మా నట్టింట గూడు కడితే భరించలేమంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టింది వైల్ట్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో. లక్షల రూపాయలు వెచ్చించి మెష్‌లు, మిషన్లు పెట్టే బదులు నాలుగు గింజలతో సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవచ్చని సూచిస్తున్నారు. ‘మొదట్లో చాలా అపార్ట్‌మెంట్లకు వెళ్లి చెబితే ఎవరూ నమ్మలేదు. ఇక లాభం లేదని డెమో ఇచ్చాం.
 
 అపార్టుమెంట్ టైపై గింజలు ఆహారంగా చల్లి వచ్చాం. ప్రతి రోజూ ఇలా చేయడం వల్ల అపార్టుమెంట్ ఆవాసంగా ఉన్న కపోతాలు గూడు, గుడ్లు సర్దుకుని బయటకు వెళ్లిపోయాయి. ఇక అప్పటి నుంచి ఆ అపార్ట్‌మెంట్‌వాసులు అదే ఫాలో అయ్యారు. కర్మాన్‌ఘాట్, హిమాయత్ నగర్, ముషీరాబాద్ ప్రాంతాల్లో మొత్తం ఇరవై అపార్ట్‌మెంట్లలో పొద్దున ఏడింటికల్లా టైపైన పావురాలకు ఆహారం వేస్తున్నారు. ప్రస్తుతం వారి ఇళ్లకు పావురాలు రావడం లేదు’ అంటూ తమ సక్సెస్ గురించి చెప్పారు ఓ అధికారి.
 
 నాన్ బెయిలబుల్ కేసు
 పొరపాటునో, కావాలనో పావురాన్ని చంపినా.. దాని చావుకి కారణమైనా.. బాధ్యులపై  నాన్ బెయిలబుల్ కేసు పెడతారు. మూడేళ్ల కఠిన కారాగార శిక్షను విధిస్తారు. రూ.25 వేల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒకటీ అరా తప్ప ఇళ్లలోకి వచ్చి మనుషుల్ని ఇబ్బంది పెట్టే పావురాలు చాలా అరుదు. చేతనైతే నాలుగు గింజలు వేయాలి. లేదంటే ఊరుకోవాలి. అంతేగానీ.. వాటికి హానీ తలపెడితే మాత్రం చట్టం కఠినంగా శిక్షిస్తుంది. ఒకప్పుడు హైదరాబాద్‌లో బోలెడన్ని పిచ్చుకలు, పిట్టలు కనిపించేవి. వాటిని కూడా ఇలాగే తరిమి వేయడం వల్ల ఇప్పుడు పిల్లలకు వాటిని పుస్తకాల్లో చూపించాల్సి వస్తుంది. పావురాలపై ప్రేమ చూపకపోతే.. భవిష్యత్తులో వాటిని కూడా పుస్తకాల్లోనే చూసుకోవాల్సి వస్తుంది.
 - స్వామి స్వయం భగవాన్‌దాస్
 స్టేట్ అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ మెంబర్
 
 మీ అపార్ట్‌మెంట్‌కీ వస్తాం...
 ప్రతి రోజు ఉదయం ఏడింటికి నాలుగు దోసిళ్ల జొన్నలు, బియ్యం, పుట్నాలు, సజ్జలు చల్లితే చాలు.. అవి తినేసి వెళ్లిపోతాయి. మర్నాడు పొద్దున ఏడింటి వరకూ ఆ ఛాయలకు కూడా రావు. హైదరాబాద్‌లో పావురాలకు ఆవాసాలుగా మారిన అపార్ట్‌మెంట్‌లు వేల సంఖ్యలో ఉన్నాయి. వాళ్లందరికీ పావురాలు శత్రువులుగా కాకుండా.. స్నేహితులుగా మారాలంటే వాటి చిట్టి బొజ్జ నింపడం ఒకటే పరిష్కారం. మిషన్లు పెట్టడం, మెష్‌లు బిగించడం.. అన్నీ చట్టారీత్యా నేరమే. ఈ ప్రపంచంలో స్వేచ్ఛగా జీవించే హక్కు మనకెంత ఉందో.. పక్షులకూ అంతే ఉంది. వాటి హక్కుని ఏమాత్రం భంగం కలిగించినా శిక్షకు అర్హులవుతారు. ఒక సమస్య నుంచి బయటపడడానికి మరో పెద్ద సమస్యలో ఇరుక్కోవడం అంటే ఇదే. పావురాల సమస్యపై సాయమేమైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు.
 - మహేశ్ అగర్వాల్,
 వైల్ట్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో స్పెషల్ ఆఫీసర్
 ఫోన్ నెంబర్: 9394005600

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement