‘కబూతర్ జా జా జా కబూతర్ జా’ అంటూ వెండితెర మీద ఆమె కదులుతుంటే కుర్రాళ్ల ఊపిరి ఆగిపోయినంత పనయ్యింది అప్పట్లో. ఆ ఒక్క సినిమా ఆమెని అందరి మనసుల్లోనూ శాశ్వతంగా నిలబెట్టేసింది. ఆమె ఎవరో అర్థమైపోయింది కదూ... అవును, భాగ్యశ్రీనే. ‘మైనే ప్యార్ కియా’ని ఆమె కోసమే మళ్లీ మళ్లీ చూసినవాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆ చిత్రం డబ్బింగ్ వెర్షన్ ‘ప్రేమ పావురాలు’తో తెలుగువారి మనసులనూ దోచేసింది శ్రీ. కానీ ఆ తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు చేయలేదు. ఇరవై సినిమాలు కూడా చేయకుండానే సినిమాల నుంచి తప్పుకుంది. తెలుగులో చేసిన ‘ఓంకారం’ చిత్రమే ఆమె చివరి సినిమా. ఆ తరువాత కాపురం, పిల్లలు అంటూ ఓ సాధారణ మహిళలా బతకసాగింది. అయితే ఆమె లోని నటీమణి అలానే ఉండిపోలేకపోయింది. హిందీ సీరియళ్లతో పునఃప్రవేశం చేసింది. ఇంతవరకూ ఓ అయిదు సీరియళ్లు చేసింది. ఇప్పుడు ఆరో సీరియల్ ‘లౌట్ ఆవో త్రిష’తో రాబోతోంది.
పద్దెనిమిదేళ్ల కూతురు హఠాత్తుగా కనిపించకుండా పోతే తల్లి పడే ఆవేదన, ఆతృత ఎలా ఉంటాయన్నదే ఈ సీరియల్. త్రిష అనే అమ్మాయికి తల్లిగా భాగ్యశ్రీ నటిస్తోంది. దాదాపు సీరియల్ అంతా ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. త్రిష అదృశ్యం కావడం, ఆమెను వెతుక్కుంటూ వెళ్తున్న క్రమంలో విచిత్రమైన అనుభవాలు ఎదురు కావడం, వాటిని సమర్థంగా ఎదుర్కోవడం వంటి విషయాలు ఆసక్తికరంగా ఉంటాయని ఊరిస్తున్నారు... ఈ సీరియల్‌ని ప్రసారం చేయనున్న లైఫ్ ఓకే చానెల్ వారు. ఏబీసీ చానెల్లో ప్రసారమైన ‘మిస్సింగ్’ ఆధారంగా ఈ సీరియల్‌ని రూపొందించారు. ‘మిస్సింగ్‌ను కేవలం పదే పది ఎపిసోడ్లతో ముగించారు. మరి హిందీలో ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి!
బుల్లితెర మీద ప్రేమపావురం!
Published Sun, Jul 6 2014 1:16 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 AM
Advertisement
Advertisement