లవ్ బిజినెస్
రెడ్ రోస్.. ప్రేమకు చిహ్నం! దాని ఖరీదు ఎంతో తెలుసా? ఒకే ఒక్క రోజా పువ్వు ధర..ఒక్క రోజు వంద రూపాయలు!
టెడ్డీబేర్.. ప్రియురాలికి ఇష్టమైన సాఫ్ట్ టాయ్.. జానెడు బొమ్మ వెల ఆరడుగుల ప్రియుడిని బేర్‌మనేలా చేస్తోంది!
లవర్స్‌ను ఊరించే కానుక ఉంగరం! కాని దాని కాస్ట్ ఇమిటేషన్స్‌లోనే వేలు పలుకుతుంటే ఖంగుమంటున్నారు!
పెర్‌ఫ్యూమ్.. ప్రేమికులను దరిచేర్చే పరిమళం! ఒక్క స్ప్రేతో లవ్‌ను లాక్కుందామనుకుంటే ప్రైస్ ట్యాగ్ ముందుకు ప్రొసీడ్ కాకుండా లాక్ చేస్తోంది!
ఏ శుభకార్యాన్నయినా తీపితో మొదలుపెట్టడం మన ఆనవాయితీ!
అందుకే ఐ లవ్యూ అనే మంచి మాటను తియ్యగా చెబుదామంటే చాక్‌లేట్ ధర చేదు రుచిని తలపిస్తోంది!
ఇక్కడ ఉదాహరణలే కాదు కానుకలనే ఊహల వెల కూడా ఆకాశానికి ఉయ్యాలేసి లవ్‌బర్డ్స్‌ను ఊరిస్తోంది అందుకోమని!
తమ ప్రెషస్ ప్రేమ పారమీటర్ వందలు దాటి వెలకు చేరుతోంటే పట్టుకోవడానికి ప్లాన్ వేసుకుంటున్నారు ప్రేమికులు!
అదే అదను అని సొమ్ము చేసుకుంటున్నారు వ్యాపారులు! ఇది ప్రేమికుల రోజు కథ.. వాలంటైన్స్ డే స్పెషల్!
ప్రేమించడానికి మనసుంటే సరిపోతుంది.. కానుకలెందుకు? బ్లాక్ అండ్ వైట్ కాలంనాటి మాట ఇప్పుడు చెల్లదండీ! ఏ కానుకల్లేకుండా ప్రేమను పేలవంగా చెప్తే ఏం బాగుంటుంది? గిఫ్ట్స్‌తో గుబాళించాలి! అప్పుడే అవతలి వాళ్లు అట్రాక్ట్ అవుతారు అనేది కొత్త కాన్సెప్ట్! ప్రేమించడానికి ఇటు అబ్బాయిల జేబు, అటు అమ్మాయిల పర్స్ రెండూ నిండుగానే ఉండాలి. నిండుకుంటే లవ్ వే గేట్స్ మూసేసుకుంటుంది. వాలెంటైన్ జానపద గాథను ప్రేమకు చిరునామాగా మలచి వ్యాపారులు ఆ దారిని పరిస్తే మీడియా ట్రెండ్‌గా పాపులర్ చేసింది! ప్రేమికులు బ్లైండ్‌గా ఫాలో అవుతున్నారు! అందుకే ఇంతకుముందు గుట్టుచప్పుడు కాకుండా సాగిన ప్రేమాయణం ఇప్పుడు కాస్టీ›్ల వ్యవహారంగా సందడిచేస్తోంది.. కాసులను ఖర్చుపెట్టిస్తోంది. వ్యాపారుల పంట పండిస్తోంది.
ఎర్ర గులాబీ గుసగుసలు
అన్ని డేస్‌లాగే పాశ్చాత్య ప్రపంచం వాలెంటైన్ డేనూ మూడో ప్రపంచం మీదకు వదిలింది. తన లవ్‌బిజినెస్ ఫార్ములాను ఆ దేశాల మార్కెట్‌కూ అందించింది. ఉత్పత్తులను దించింది. వీటికి ఎంత గిరాకీ అంటే ఇండిపెండెన్స్ డే ఇంపార్టెన్స్‌ను మరిచిపోయినా వాలంటైన్స్‌డే సెలబ్రేషన్స్‌ను మాత్రం గుర్తుపెట్టుకుంటోంది యూత్. వ్యాపారులకు కావాల్సిందీ అదే! వాలంటైన్స్‌డేను ఫేమస్ చేయడానికి పెట్టిన ఖర్చును అణాపైసలతో సహా రాబట్టుకుంటున్నాయి ఆ సంస్థలు. ఇదంతా ఓ పథకం.. ప్రణాళిక. వాటి జోలికి పోకుండా వాలంటైన్స్ డే రోజు డిమాండ్‌లో ఉన్న ఉత్పత్తులేంటి? వాటిని మార్కెట్‌లోకి వదిలిన శక్తులేంటో తెలుసుకుందాం!
ఆ తొమ్మిది కంపెనీలు..
వాలంటైన్స్ డే లవ్‌బిజినెస్ ఐడియాను క్రియేట్ చేసింది, ఇంప్లిమెంట్ చేసిందీ అమెరికానే! స్వీట్‌నథింగ్స్‌ను కరెన్సీ రేపర్‌లో చుట్టి ప్రేమికుల కళ్లబడేలా పేర్చింది. ఈ కష్టానికి క్రెడిట్ అమెరికాలోని 9 కంపెనీల ఖాతాలోనే జమవుతుంది. ది నేషనల్ రిటైల్ ఫెడరేషన్ (అమెరికా) లెక్క ప్రకారం వాలంటైన్స్ డే ఒక్కరోజే ఈ కంపెనీల లాభం లక్షా పదమూడు వేల తొమ్మిది వందల కోట్ల పై మాటే. 1-800 ఫ్లవర్స్, ది హర్‌షే కంపెనీ, హాల్‌మార్క్‌కార్డ్స్, నెకో, వెర్‌మోంట్ టెడ్డీ బేర్, విక్టోరియాస్ సీక్రెట్, టిఫనీ అండ్ కో, అర్మెల్లిని ఎక్స్‌ప్రెస్‌లైన్స్, ది యూఎస్ పోస్టల్ సర్వీస్ మొదలైన 9 కంపెనీలు ఆ జాబితాలో ఉన్నాయి.
1-800 ఫ్లవర్స్... మోస్ట్ వాంటెడ్ ఫర్ లవర్స్
ఇది ప్రేమ గులాబీలు అంటే రెడ్‌రోజెస్‌ను, ఇతర కానుకలను అమ్మే సంస్థ. ఒక్క ప్రేమికులరోజు నాడే తన యేడాది ఆదాయం కన్నా పది శాతం అధిక సేల్స్ ఉంటాయి ఈ కంపెనీకి. గిఫ్ట్స్ ఆర్డర్ చేసిన లవర్స్‌కి క్షణం ఆలస్యం చేయకుండా అందించేందుకు వాలంటైన్స్‌డే ఒక్కరోజే అదనంగా ఆరువేల మంది వర్కర్స్‌ను అపాయింట్ చేసుకుంటుందంటే ఎంత డిమాండో అర్థం చేసుకోవచ్చు. ఆ ఖర్చుకి ఆరింతల లాభం వస్తుందని చెప్తాడు 1-800 కంపెనీ సీఈవో జిమ్ మెకాన్. యేటా 40 శాతం మంది కొత్త కస్టమర్స్ కూడా పెరుగుతారట.
హర్‌షే ... కాక పుట్టించే చాక్‌లేట్
ఇది అమెరికన్ పాపులర్ చాక్‌లేట్స్ కంపెనీ. యేడాది మొత్తంలో కన్నా యాభై యాతం అధికంగా వాలెంటైన్స్‌డే రోజు హర్‌షేకి బిజినెస్ ఉంటుందట.
హాల్‌మార్క్ కార్డ్స్.. గ్రీటింగ్స్‌కే హాల్‌మార్క్
వాలెంటైన్స్ డే గ్రీటింగ్స్ కార్డ్స్‌కి ఈ కంపెనీ ప్రసిద్ధమైంది. దాదాపు పధ్నాలుగువందల వాలంటైన్స్‌డే కార్డ్స్ డిజైన్స్‌ను క్రియేట్ చేసింది. స్టాటిస్టిక్ బ్రెయిన్ సర్వే ప్రకారం కిందటేడాది వాలంటైన్స్ డే రోజు 150 మిలియన్ల మంది హాల్‌మార్క్ కార్డ్స్‌ను తమ ప్రేమికులకు పంపారు. క్రిస్‌మస్ తర్వాత అంత పెద్దమొత్తంలో ఆదాయం తెచ్చిపెట్టేది వాలెంటైన్స్ డేనే అని ఒప్పుకుంటుంది హాల్‌మార్క్ కార్డ్స్ యాజమాన్యం.
నెకో.. లవ్స్ స్వీట్‌హార్ట్
క్యాండీస్ కంపెనీ. ఇది చతురస్రాకారం, బేస్‌బాల్స్, వాచెస్ ఆకారంలో క్యాండీస్‌ను తయారు చేసినన్నాళ్లు దీనికి పెద్ద గిరాకీ లేదు. ఎప్పుడైతే పిప్పర్‌మెంట్ సైజులో హార్ట్‌షేప్ ఆకారంలో క్యాండీస్‌ను తయారు చేయడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి సప్లయ్ చేయలేనంతటి డిమాండ్ పెరిగిందట. దీన్ని వాలెంటైన్స్ డేకి యూఎస్‌పిగా ఎలా మలచుకోవాలో ఆలోచించమని మార్కెటింగ్ స్టాఫ్‌కి ఆర్డర్ వేసింది యాజమాన్యం. ఈ హార్ట్‌షేప్‌లోని క్యాండీస్ మీద ప్రేమికులకు సంబంధించిన సేయింగ్స్, కొటేషన్స్‌ను ముద్రించి మార్కెట్‌లోకి రాసులు పోశారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 14 వరకు ప్రతిరోజూ ప్రపంచ వ్యాప్తంగా లక్షపౌండ్ల క్యాండీహార్ట్స్‌ను అమ్మి ఆదాయం గడిస్తోంది నెకో!
వెర్‌మోంట్ టెడ్డీ బేర్.. వాలెంటైన్స్ డిమాండ్
ఈ కంపెనీ టెడ్డి బేర్ వరల్డ్ ఫేమస్. మల్టీ మిలియన్ డాలర్ బిజినెస్ కంపెనీ. వాలంటైన్స్ డే గిఫ్ట్‌గా ఇది తయారు చేసే టెడ్డీకి ఎంత బెట్టంటే ఆర్నెల్ల ముందుగానే ఆర్డర్ ఇచ్చేంత. ఈ పాటికి అర్థమయ్యే ఉండాలి వెర్‌మెంట్‌కి వాలెంటైన్స్ డే బిజినెస్ ఎంతో!
విక్టోరియాస్ సీక్రెట్.. హాటెస్ట్ గిఫ్ట్
మాయిశ్చరైజర్స్, పెర్‌ఫ్యూమ్స్, లోదుస్తులు తయారు చేసే కంపెనీ ఇది. కాని లోదుస్తులకే బ్రాండ్ నేమ్ సంపాదించుకుంది. వాలెంటైన్స్ డే రోజు పాశ్చాత్య దేశాల్లోని ప్రతి ప్రేమికుడు తన ప్రియురాలికి విక్టోరియాస్ సీక్రెట్ కంపెనీ లో దుస్తులు గిఫ్ట్‌గా ఇచ్చి తన ప్రేయసి మనసెరిగిన ప్రియుడిగా ముద్ర వేయించుకోవాలని తపనపడుతుంటాడట. రిచ్ బాయ్‌ఫ్రెండ్‌గా బిల్డప్ ఇవ్వాలనుకుంటాడట. ఈ లెక్కన ఆ ఒక్కరోజు ఈ కంపెనీ లాభాలెంతో అంచనాకు అందే ఉంటాయి కదా!
టిఫనీ అండ్ కో.. జ్యుయెలరీ అందుకో
మొదట ఇది స్టేషనరీ షాప్. తర్వాత వరల్డ్ ఫేమస్ జ్యుయలరీ కంపెనీ. వాలెంటైన్స్ డే రోజు ప్రతి ముగ్గురిలో ఒక పురుషుడు తన ప్రియురాలికో, భార్యకో టిఫనీ అండ్ కో జ్యుయలరీని ప్రెజెంట్ చేయాలనుకుంటాడు. ఆ రోజుకి తన సేల్స్ ఎంతో చెప్పకుండా సీక్రెట్‌గా ఉంచుతుంది ఈ కంపెనీ. బిలియన్లలోనే ఆదాయం ఉంటుందంటారు మార్కెట్ విశ్లేషకులు.
అర్మెల్లిని ఎక్స్‌ప్రెస్ లైన్స్ .. ప్రేమ డెలివరీ లైన్స్
పువ్వుల రవాణాలో పేరుమోసిన సంస్థ. వాలంటైన్స్ డే రోజు ఎర్రగులాబీలను పంపిణీ చేయడానికి రెండు నెలల ముందునుంచే సమాయత్తమవుతుంది. అదనంగా ట్రక్ డ్రైవర్స్‌ను నియమించుకుంటుంది. మామూలు రోజుల్లో కన్నా ప్రేమికుల రోజు నాడు నాలుగున్నరరెట్లు ఎక్కువుంటుంది దీని వ్యాపారం!
యూఎస్ పోస్టల్ సర్వీస్.. సందేశాలను మోసుకొచ్చే సర్వీస్
మెయిల్స్, మొబైల్స్, వాట్సప్ మెస్సేజెస్ ఎన్ని ఉన్నా.. పోస్టల్ సర్వీస్‌లో వచ్చిన చిన్న కార్డుముక్క అందించే ఆనందం వేరు..ఆస్వాదించే దగ్గరి తనం వేరు. ఆ సంప్రదాయాన్నే నిలుపుతోంది ది యూఎస్ పోస్టల్ సర్వీస్. ప్రేమికుల అనురాగ సందేశాలను, ప్రేమ పలుకులను పొదువుకున్న గ్రీటింగ్ కార్డ్స్‌ను పదిలంగా పట్టుకొచ్చి అప్పజెప్పడంలో ది యూఎస్ పోస్టల్ సర్వీస్‌ను మించిన సర్వీసే లేదట. అందుకే వాలెంటైన్స్ డేకి వారం ముందునుంచే బిజీ అయిపోతుంది.. అయిదు నుంచి ఏడు శాతం అధికంగా వచ్చిపడే కార్డ్స్, ప్యాకేజెస్ అండ్ పార్సిల్స్‌తో. క్రిస్‌మస్ తర్వాత అంత పని, అంతేపెద్ద మొత్తంలో ఆదాయమూ వచ్చే పండగ ప్రేమికుల పండగే అని సంబరపడ్తోంది ఈ పోస్టల్ సర్వీస్ సంస్థ.
నాట్ ఓన్లీ ఫర్ కపుల్స్..
పాశ్చాత్య సమాజంలో వాలెంటైన్స్ డేను కేవలం జంటలే కాదు ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితులు, క్లాస్‌మేట్స్, టీచర్లు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ ధోరణి ఈసారి ఆసియా దేశాల్లోనూ కనిపించే అవకాశం ఉంది.
వాలెంటైన్స్‌డే డెస్టినేషన్స్
గిఫ్ట్స్ తయారు చేసే కార్పోరేట్ సంస్థలు, ట్రావెల్ హౌజెస్ ప్రేమికుల రోజు కోసం కేరళ, గోవా, నైనిటాల్, మౌంట్ అబు, డెహ్రాడూన్, ముస్సోరి, కసౌలి, షిమ్లా, పంచవటి మొదలైన ప్రదేశాలకు ప్రత్యేక టూర్ ప్యాకేజ్‌లను అందిస్తున్నాయి. వీటి ధర ఆరు వేల నుంచి అరవై వేల రూపాయల వరకు ఉంటోంది. వాలెంటైన్స్ డే పిచ్చిని ఎయిర్‌లైన్స్ సంస్థలూ సొమ్ము చేసుకుంటు న్నాయి. విమాన చార్జీల్లో రాయితీలుస్తూ స్పెషల్‌హాళఇడే ప్యాకేజేస్‌తో గాల్లో విహరింపచేస్తున్నాయి.
వాలెంటైన్స్ డే కథ
నిజానికి ఇది ప్రేమపక్షుల కథ కాదు. స్నేహం కథ! తల్లిదండ్రులు-బిడ్డలు, అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ములు, స్నేహితులు, రాజు - పేద, యజమాని- ఉద్యోగి మధ్య స్నేహాన్ని, ప్రేమను పెంచే కథ.. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచాన్ని ప్రేమమయం చేయమని చాటే ఓ సెయింట్ కథ. మూడో శతాబ్దంనాటి గ్రీకు కథ. రోమ్ చక్రవర్తి అయిన క్లాడియస్ 2 .. తాను నమ్మే పన్నెండు దేవతలను మాత్రమే పూజించాలని రోమన్లందరినీ ఆజ్ఞాపిస్తాడు. క్రిస్టియన్లతో ఎవరైనా సన్నిహితంగా మెదిలారని తెలిస్తే మరణశిక్ష ఖాయమనీ హెచ్చరిస్తాడు. కాని వాలెంటినస్ అనే సాధువు చక్రవర్తి మాటను చెవికెక్కించుకోడు. తన జీవితాన్ని క్రీస్తుకే అంకితం చేస్తాడు. దాంతో కన్నెర్ర చేసిన క్లాడియస్.. వాలెంటినస్‌ను జైల్లో పెట్టి మరణ శిక్ష విధిస్తాడు. ఆయనకు జూలియా అనే కూతురు ఉంటుంది. ఆమె పుట్టుకతో అంధురాలు. వాలెంటినస్ తన కూతురుకి అన్నీ నేర్పిస్తాడు. తనకళ్లతో ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. వారం రోజుల్లో ఆ సాధువుకు మరణశిక్ష అమలవుతుందనగా జైలర్ ఆయన్ని అడుగుతాడు.. ‘నీ కూతుర్ని చూడాలనుకుంటున్నావా?’ అని. పిలిపిస్తాడు. జైల్లోంచే తన కూతురుకి జీవన సత్యాలు బోధిస్తుం టాడు. ఆ జ్ఞానంతో జూలియాకు చూపు వస్తుంది. చివరకు తాను చనిపోయే ముందు రోజు జూలియాకు ఓ ఉత్తరం రాస్తాడు.. ‘దైవాన్ని నమ్ము.. ప్రపంచాన్ని ప్రేమించు.. ఫ్రమ్ యువర్ వాలెంటైన్’ అని! ఆ తర్వాత రోజు అంటే క్రీ.శ. 270, ఫ్రిబవరి 14న వాలెంటినస్‌కు మరణశిక్ష అమలవుతుంది. తన తండ్రిని సమాధి చేసిన చోట గులాబిరంగులో పూత పూసే బాదం మొక్క నాటుతుంది ఆమె. ఆ మొక్క తర్వాత కాలంలో వృక్షమై ప్రేమ, స్నేహానికి చిహ్నంగా నిలిచింది అంటారు. ఆ ప్రేమను, స్నేహాన్ని ప్రపంచానికి చాటడానికే ప్రతి ఫిబ్రవరి 14న వాలెంటినస్ పేరుమీద వాలెంటైన్స్ డేని జరుపుకోవడం మొదలుపెట్టింది ప్రపంచం.