పక్షికి చికిత్స చేస్తున్న స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు
సాక్షి,, సిటీబ్యూరో: వినువీధుల్లో స్వేచ్ఛగా విహరించే పక్షులు గాయాలతో రక్తమోడుతున్నాయి. మాంజా యమపాశమై నేలరాలుతున్నాయి. కాలుష్యం, అంతరించిపోతున్న పచ్చదనంతో పాటు మాంజా సైతం జీవవైవిధ్యానికి పెనుముప్పుగా పరిణమించింది. అనూహ్యమైన పర్యావరణ మార్పులతో ఇప్పటికే వందలాది పక్షి జాతులు అంతరించాయి. ఊరపిచ్చుకలు, పాలపిట్టలు, వడ్లపిట్టలు, నెమళ్లు, కాకులు, కొంగలు, డేగలు తదితర అనేక రకాల పక్షులు ప్రమాదపు అంచుల్లో మనుగడ కొనసాగిస్తున్నాయి. పక్షుల ప్రాణాలకు ప్రమాదాన్ని మరింత రెట్టింపు చేస్తున్న పతంగుల మాంజా నగర జీవవైవిధ్యానికి ముప్పుగా మారింది. అటవీశాఖ, పోలీసులు, పర్యావరణ నిపుణులు, ప్రకృతి ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థల కృషి ఫలితంగా చైనా, నైలాన్ మాంజా వినియోగంలో కొంత మార్పు కనిపించినా ప్రమాదం మాత్రం పొంచే ఉంది. మాం జా తాకిడికి గత వారం రోజులుగా 68 పక్షులు గాయపడగా, మరికొన్ని మృత్యువాత పడ్డాయి. ఇవి స్వచ్ఛంద సంస్థల దృష్టికి వచ్చిన వివరాలు. ఇంకా ఎవరి దృష్టిలో పడకుండా ప్రాణాలు కోల్పోతున్న పక్షులు మరెన్నో ఉండవచ్చునని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అడుగడుగునా ప్రమాదమే...
సంక్రాంతి సంబరాల్లో భాగంగా పతంగులు ఎగరవేసేందుకు వినియోగించే మాంజా పక్షుల పాలిట యమపాశంగా మారింది. సీసం పూతతో తయారు చేసే చైనా, నైలాన్ మాంజాలు పండగ రోజుల్లోనే కాదు.. ఆ తర్వాత కూడా పక్షుల ప్రాణాలకు ముప్పుగానే మారుతున్నాయి. చెట్ల కొమ్మల్లో, భవనాలపై కిలోల కొద్దీ పడి ఉంటుంది. ఈ మాంజాను గుర్తించకుండా కొమ్మలపై, ఇళ్లపై వాలేందుకు వచ్చే పక్షులు గాయపడుతున్నాయి.‘ఇలాంటి మాంజా కేవలం సంక్రాంతి రోజుల్లోనే కాదు. ఏడాది పాటు ప్రమాదమే. ప్రతిరోజు ఎక్కడో ఓచోట గాయపడ్డ పక్షులు మా దృష్టికి వస్తూనే ఉంటాయి. ఇప్పటి వరకు గాయపడిన 58 పక్షులను స్వాధీనం చేసుకొని చికిత్స అందజేస్తున్నాం’ అని చెప్పారు గ్రేటర్ హైదరాబాద్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు ఎనిమల్స్ సంస్థ (జీహెచ్‌ఎస్‌పీసీఏ) కన్వీనర్ సౌధారాం భండారీ. ప్రస్తుతం బేగంబజార్‌లోని ఆ సంస్థకు చెందిన క్లినిక్‌లో వాటికి చికిత్సలు అందజేస్తున్నారు.
‘గాయపడ్డ వాటిలో ఎన్ని బతికి బయటపడతాయో తెలియదు. ఇప్పటికే ఒక పక్షి చనిపోయింది. ఏ చిన్న గాయమైనా అవి కోలుకునేందుకు నెల రోజులకు పైగా సమయం పడుతుంద’ని ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎస్‌పీఏతో పాటు పీపుల్స్ ఫర్ ఎనిమల్స్ (పీఎఫ్‌ఏ) సంస్థలు సంయుక్తంగా నగరంలో పక్షుల సంరక్షణ చర్యలను కొనసాగిస్తున్నాయి. అటవీశాఖ ఆధ్వర్యంలో మరో 10 గాయపడ్డ పక్షులను గుర్తించి జూపార్కులోని పక్షులు, జంతువుల చికిత్స కేంద్రానికి తరలించారు. గాయపడ్డ వాటిలో పావురాలు, చిలుకలు, డేగలు, కొంగలు, కాకులు తదితర ఉన్నాయి. అశోక్‌నగర్, కూకట్‌పల్లి, మెట్టుగూడ, మాసబ్‌ట్యాంక్, పంజగుట్ట, సంతోష్‌నగర్, ఎయిర్‌పోర్టు కాలనీ, లక్డీకాపూల్, పాతబస్తీ తదితర ప్రాంతాల్లో ఈ పక్షులను గుర్తించారు. మరోవైపు అటవీశాఖ ఈసారి నగరంలోని సుమారు 72 షాపులపై దాడులు నిర్వహించి 250 కిలోలకు పైగా చైనా, నైలాన్ మాంజాను స్వాధీనం చేసుకుంది. గతేడాది 150 గాయపడిన పక్షులను గుర్తించి చికిత్స అందజేసినట్లు జీహెచ్‌ఎస్‌పీసీఏ తెలిపింది.
మార్పు నామమాత్రమే....
చైనా, నైలాన్ మాంజాపై ప్రభుత్వం నిషేధం విధించింది. పర్యావరణ పరిరక్షణ చట్టంలోని సెక్షన్–15 ప్రకారం చైనా మాంజాను విక్రయించినా, కలిగి ఉన్నా ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే రూ.లక్ష జరిమానా కూడా విధించవచ్చు. 2016 జనవరి 13న ప్రభుత్వం ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో గత రెండేళ్లుగా కొంత మార్పు కనిపిస్తోంది. 30 శాతం వరకు కాటన్ మాంజా వినియోగంలోకి వచ్చినట్లు పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. కానీ ఇంకా 70శాతం చైనా మాంజా ముప్పు పొంచి ఉన్నట్లే కదా. ఈ మాంజా దెబ్బకు గాయపడిన పక్షులను కాపాడేందుకు జీహెచ్‌ఎస్‌పీసీఏ 24గంటల పాటు అందుబాటులో ఉంటుందని సౌధారాం భండారీ తెలిపారు. నగరంలో ఎక్కడైనా పక్షులకు, జంతువులకు, వన్యప్రాణులకు అపాయం ఉన్నట్లయితే 88867 43881, 85559 55202 నెంబర్లలో తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే అటవీశాఖ కూడా ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 040–23231440 లేదా 18004255364 నెంబర్‌లకు సమాచారం అందజేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment