వెంకటాపురంలో విదేశీ విహంగాల సందడి
ఆస్ట్రేలియాకు చెందిన పెయింటెడ్ స్టార్క్(ఎర్రకాళ్ల కొంగల)ల సందడి ఆ గ్రామంలో మొదలైంది. సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్లు దాటి వచ్చే విదేశీ అతిథుల కోసం గ్రామమంతా ఎదురు చూస్తుంది. అవి వచ్చాక తమ ఇంటి బిడ్డలే వచ్చారు అన్నంతగా గ్రామంలో పండుగ వాతావరణం కనిపిస్తుంది. సరైన రక్షణ చర్యలు, సౌకర్యాలు లేకపోయినా తామే వాటికి రక్షణ కవచంలా నిలబడతారు. దశాబ్దాలుగా తమ గ్రామానికి వస్తున్న పక్షులను వెంకటాపురం గ్రామస్తులు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. చిన్న పక్షి నేలరాలినా విలవిలలాడతారు.
వెంకటాపురం(పెనుగంచిప్రోలు): గ్రామంలో ఆస్ట్రేలియాకు చెందిన ఎర్రకాళ్ల కొంగల (పెయింటెడ్ స్టార్క్) సందడి మొదలైంది. ఏటా ఈపక్షులు వేల మైళ్లు ప్రయాణించి నవంబర్, డిసెంబర్ నెలల్లో గ్రామానికి చేరుకుంటాయి. ఈఏడాది కొంచెం ఆలస్యంగా గ్రామానికి చేరుకున్నాయి. నాలుగు రోజుల క్రితం ఇక్కడి నేలపై అడుగుపెట్టాయి. ఆరు నెలల పాటు ఇక్కడి చెట్లపై ఆవాసాలు ఏర్పాటు చేసుకొని గుడ్లుపెట్టి, పిల్లలను వృద్ధి చేసుకొని మే చివరి వారం లేదా జూన్‌లో తిరిగి తమ ప్రాంతానికి వెళ్లిపోతాయి.
పక్షుల రాకతో గ్రామానికి మేలు
ఏటేట తమ గ్రామానికి వచ్చే విదేశీ పక్షులను స్థానికులు తమ పిల్లల్లా చూసుకుంటారు. నవంబర్ మాసం వచ్చిందంటే పక్షులు ఇంకా రాలేదనే చర్చ నడుస్తుంది. అవి వచ్చేంత వరకు ఎదురు చూస్తారు. అవి వచ్చాక పుట్టింటికి వచ్చిన తమ బిడ్డల్లా చూసుకుంటారు. ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఈపక్షుల వల్లనే తమ గ్రామం పాడిపంటలు, సుఖశాంతులతో వర్ధిల్లుతుందని వారి నమ్మకం. దశాబ్దాల క్రితం ఈపక్షులు గ్రామానికి రావటం నాటి నుంచే గ్రామం సుభిక్షంగా ఉందని, వాటికి ఎవరైనా హాని తలపెడితే ఊరుకోమని గ్రామస్తులు అంటున్నారు.
సంరక్షణ చర్యలు కరువు
గ్రామానికి తరలి వచ్చే విదేశీ పక్షుల సంరక్షణను పట్టించుకోవటం లేదు. గ్రామం మధ్య నుంచి వెళ్లే 11 కేవీ విద్యుత్ తీగల వలన ప్రతి ఏడాది వందల సంఖ్యలో పక్షులు మృత్యువాత పడుతున్నాయి. దీనిపై గ్రీన్ టీం నిర్వాహకుడు జూటూరి అప్పారావు, వైఎస్సార్ సీపీ నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు సహకారంతో గతంలో తీగలకు ప్లాస్టిక్ పైపులు అమర్చారు. అయితే ఇంకా పైపులు తొడగాల్సి ఉంది. గ్రామంలో చెట్లు కొట్టటం, నీటి వసతి లేకపోవటం కూడా పక్షుల ఆవాసానికి అవరోధంగా ఉన్నాయి. అయితే ఈఏడాది చెరువుల్లో, గ్రామంలో ఉన్న నీటి కుంటలో నీరు పుష్కలంగా ఉండటంతో పక్షులకు తాగునీటి కష్టాలు తొలిగినట్టే అని గ్రామస్తులు అంటున్నారు. గ్రామాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తామని గత టీడీపీ ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీలు నీటిమూటలుగా మిగిలి పోయాయి. ఇప్పటికైనా విదేశీ పక్షుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని పక్షి ప్రేమికులు కోరుతున్నారు.
పక్షుల కోలాహలం
రంగు రంగుల రెక్కలు, పొడవాటి ఎర్రని ముక్కులు, పెద్ద శరీరం, పెద్ద కళ్లతో చూపరులకు ఎంతో సంతోషాన్నిచ్చేలా ఉండే ఈపక్షులు సందడి చేస్తాయి. వాటి కోలాహలం మంత్ర ముగ్ధులను చేస్తుంది. రాత్రుళ్లు అవి చేసే పెద్ద అరుపులను సైతం పట్టించుకోకుండా గ్రామస్తులు వాటి సంరక్షణను తమ బాధ్యతగా చూసుకుంటారు. ముందుగా కొన్ని పక్షులు గ్రామానికి వచ్చి పరిసరాలు, ఆహార లభ్యత చూసుకొని అనువుగా ఉంటే వెనక్కి వెళ్లి తోటి పక్షులతో గ్రామానికి చేరుకుంటాయి. సమీపంలో దొరికే పుల్లలు, గడ్డిని తెచ్చి చెట్ల కొమ్మలపైకి చేర్చి గూడులు చేసి గుడ్లు పెడతాయి. చెరువులు, మునేరులో దొరికే చేపలు తిని బతుకుతాయి. అందమైన ఎర్రకాళ్ల కొంగలను చూసేందుకు వచ్చే సందర్శకులకు ఈ ప్రాంతంలో ఎటువంటి సౌకర్యాలు లేకపోవడం లోటు.
Comments
Please login to add a commentAdd a comment