నల్లమల అభయారణ్యంలో ప్రేమ పక్షుల సందడి
అరుణాచల్‌ప్రదేశ్, కేరళ రాష్ట్ర పక్షిగా గుర్తింపు
నాగాలాండ్‌లో ఏటా హార్న్‌బిల్ ఉత్సవాలు
పెద్దదోర్నాల: నల్లమల అభయారణ్యం విభిన్న వన్యప్రాణులకు నెలవు. ఇక్కడి అరుదైన పక్షులు, జంతు జాతులు పర్యావరణ ప్రేమికుల్ని అబ్బురపరుస్తాయి. పక్షిజాతుల్లో అత్యంత అరుదైన జీవనశైలి హార్న్‌బిల్ (ఫారెస్ట్ ఫార్మర్) పక్షుల సొంతం. వీటి స్వభావం అచ్చంగా మనుషుల్ని పోలి ఉంటుంది. మగ పక్షులు కుటుంబ బాధ్యతను మోస్తూ.. ఆడ పక్షులకు అవసరమైన తిండిని సంపాదిస్తూ.. వాటిని గూడు దాటకుండా బాధ్యతగా చూసుకుంటాయి. వీటిని అడవి రైతులుగా పిలుస్తుంటారు. పొడవైన ముక్కు, తోకలతో ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనపడతాయి.
స్వచ్ఛమైన ప్రేమకు ప్రతిరూపం
హార్న్‌బిల్ పక్షులు ఎత్తైన చెట్లలో సహజ సిద్ధంగా ఏర్పడ్డ గూళ్లలో నివసిస్తాయి. మగ పక్షులు పితృస్వామ్యాన్ని బాధ్యతగా నిర్వర్తిస్తూ కుటుంబ పోషణను చూసుకుంటాయి. తల్లి పక్షి గూడులో గుడ్లు పెట్టి పిల్లలను పొదుగుతుంది. పిల్లలతో కలిసి మూడు నెలలపాటు ఎటూ కదలకుండా గూట్లోనే ఉండిపోతుంది. మగ హార్న్‌బిల్ ఆ మూడు నెలలు ఆహారాన్ని సేకరించి.. గూట్లో ఉన్న తల్లి, పిల్ల పక్షులకు నోటిద్వారా అందిస్తుంది.
ఆహారం కోసం తిరిగే సమయంలో మగ హార్న్‌బిల్ వేటగాళ్ల బారినపడినా.. ప్రమాదవశాత్తు మరణించినా గూటిలో ఉన్న తల్లి పక్షితోపాటు పిల్ల పక్షులు కూడా ఆకలితో చనిపోతాయే తప్ప ఇంకే ఆహారాన్ని ముట్టవు. దీంతోపాటు హార్న్ బిల్ పక్షుల దాంపత్య జీవనం ఎంతో పవిత్రంగా ఉంటుంది. ఇవి జీవితాంతం ఒకే పక్షితో జత కడతాయే తప్ప మరే పక్షిని దరిచేరనివ్వవు.
నాగాలాండ్‌లో ఏటా ఉత్సవం
హార్న్‌బిల్ పక్షుల జీవన విధానానికి ముగ్ధులైన నాగాలాండ్ వాసులు వాటి పేరిట ఏటా 10 రోజుల పాటు ఉత్సవాన్ని జరుపుకుంటారు. నాగాలాండ్ రాష్ట్ర రాజధాని కోహిమాకు 12 కిలోమీటర్లు దూరంలో గల కిసామాలోని గిరిజనులు హార్న్‌బిల్ ఉత్సవాన్ని సంప్రదాయంగా నిర్వహిస్తారు. డిసెంబర్ 1నుంచి 10వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవంలో చిన్నా పెద్డా తేడా లేకుండా అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకుంటారు.
రెండు రాష్ట్రాల పక్షి
అరుణాచల్ ప్రదేశ్, కేరళ రాష్ట్రాలు రాష్ట్ర పక్షిగా హార్న్‌బిల్‌ను గుర్తించాయి. ఈ పక్షుల జీవన కాలం 40 నుంచి 50 సంత్సరాలని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. వీటి పొడవు 95 నుంచి 120 సెంటీమీటర్లు కాగా.. రెక్కలు విప్పినప్పుడు వీటి వెడల్పు 151 సెంటీమీటర్ల నుంచి 178 సెంటీమీటర్లు ఉంటుందని పేర్కొంటున్నారు. ఇవి సుమారు 4 కేజీల బరువు ఉంటాయి.
ఫారెస్ట్ ఫార్మర్
హార్న్‌బిల్ మగ పక్షి పండ్లను సేకరించి తల్లి, పిల్లలకు ఆహారంగా అందిస్తుంది. గూడుకు చేరుకున్న పక్షి పండ్ల గింజలను తొలగించి మరీ పిల్లలు, తల్లి నోటికి అందిస్తుంది. అలా అందిస్తున్నప్పుడు.. అది వదిలేసిన గింజలు నేలపై పడి.. అడవిలో మొలకెత్తి చెట్లుగా ఎదుగుతాయి. అందుకే.. ఈ పక్షిని అడవి రైతుగా పేర్కొంటారు.
Comments
Please login to add a commentAdd a comment