Birds Fall to Death After Tree Bulldozed, Gadkari Office Reacts - Sakshi
Sakshi News home page

పాపం పక్షులు.. గుండెల్ని పిండేస్తున్న వీడియో.. స్పందించిన గడ్కరీ కార్యాలయం

Published Sat, Sep 3 2022 4:15 PM

Birds Fall to Death After Tree Bulldozed Gadkari Office Reacts - Sakshi

వైరల్‌: గుండెల్ని పిండేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు నెట్‌లో వైరల్‌ అవుతోంది. రోడ్డు విస్తరణలో భాగంగా జేసీబీతో ఓ భారీ వృక్షాన్ని నేల్చకూల్చగా..  అంతకాలం ఆ చెట్టు మీద గూళ్లు కట్టుకుని జీవిస్తున్న పక్షులు చెల్లాచెదురు అయిపోయాయి. అంతకంటే బాధాకరం ఏంటంటే.. పాపం ఆ చెట్టు కిందే నలిగి కొన్ని చనిపోవడం. వైరల్‌ అయిన ఈ వీడియో.. కేంద్రం మంత్రి నితిన్‌ గడ్కరీ కార్యాలయం దాకా చేరడంతో చర్యలకు సిద్ధమయ్యారు అధికారులు. 

వైరల్‌ అవుతున్న వీడియోలో కొన్ని పక్షులు ఎగిరిపోగా.. మరికొన్ని పక్షులు, పిల్ల పక్షులు మాత్రం సమయానికి ఎగరలేక ఆ చెట్టు కిందే నలిగి చనిపోయాయి. అక్కడున్న చాలామంది పక్షుల పరిస్థితిని చూస్తూ అరవడం వీడియోలో గమనించొచ్చు.

చెట్టు నెలకొరిగాక.. చనిపోయిన పక్షుల్ని బాధతో ఒకవైపుగా వేశారు స్థానికులు. ప్రస్తుతం ఈ విషాదకరమైన వీడియో వైరల్‌ అవుతోంది. దీంతో చాలామంది కేంద్ర రోడ్డు రవాణ, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి ట్యాగ్‌ చేస్తూ.. ఫిర్యాదులు చేశారు. మనుషులు ఎంత క్రూరంగా మారిపోయారో అని కామెంట్లు చేస్తున్నారు చాలామంది. దీనికి ఫలితం అనుభవించక తప్పదంటూ మరికొందరు కామెంట్లు చేశారు.

అయితే.. ఈ ఘటన ఆగష్టు తొలివారంలోనే కేరళ మలప్పురం జిల్లా తిరురంగడి వీకే పడి ప్రాంతంలో చోటుచేసుకుంది. ఐఎఫ్‌ఎస్‌ అధికారి సురేందర్‌ మెహ్రా ఈ వీడియోను తాజాగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి.. క్రూరమైన ఈ పనికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాన్ని కోరారు. మరోవైపు ఐఎఫ్‌ఎస్‌ అధికారి ప్రవీణ్‌ కాస్వాన్‌ కూడా ఈ వీడియోను పోస్ట్‌ చేసి తన అసంతృప్తి వెల్లగక్కారు. అటు ఇటు తిరిగి ఈ వీడియో కాస్త గడ్కరీ కార్యాలయానికి చేరింది. దీంతో..

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్యాలయం స్పందించింది. విషయం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ దాకా వెళ్లిందని, ఆయన వీడియో చూసి విచారం వ్యక్తం చేశారని తెలిపింది. సేవల్‌ వెట్‌ల్యాండ్స్‌ ఇంటర్నేషనల్‌ మూమెంట్‌ సీఈవో థామస్‌ లారెస్స్‌ ఫిర్యాదు మేరకు.. స్వయంగా స్పందించిన మంత్రి నితిన్‌ గడ్కరీ.. ఈ ఘటనకు సంబంధించిన కాంట్రాక్టర్‌ను, బాధ్యులైన వాళ్లను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో.. 

రంగంలోకి దిగిన నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా.. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని సదరు కాంట్రాక్టర్‌ను, స్థానిక అధికారులను కోరింది. మరోవైపు ఈ ఘటనపై కేరళ అటవీ శాఖ విభాగం స్పందించింది. ఆ చెట్టు కూల్చివేతలకు అనుమతులు లేకపోవడంతో  జేసీబీ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై కేరళ అటవీ పరిరక్షణ  శాఖ మంత్రిణేకే ససీంద్రన్‌ ఈ ఘటనను క్రూరమైన చర్యగా అభివర్ణించారు. తమ అనుమతులు లేకుండానే ఈ ఘటన జరిగిందని ఆయన నేషనల్‌ హైవేస్‌ అథారిటీపై ఆరోపణలు గుప్పించారు.

ఇదీ చదవండి: మనిషి జీవితం నీటి బుడగ.. అందుకు ఉదాహరణే ఈ వీడియో

Advertisement
 
Advertisement
 
Advertisement