మంచిర్యాల జిల్లా జన్నారం అడవుల్లో పెయింటెడ్ స్టార్క్ పక్షులు
సాక్షి, మంచిర్యాల: ‘‘ఓ పుల్లా, ఓ పుడకా, ఎండుగడ్డి, చిన్నకొమ్మ, చిట్టిగూడు.. పిట్ట బతుకే ఎంతో హాయి’’ అంటూ తన పాటతో పక్షుల జీవితాన్నో ఉత్సవం చేశాడు ప్రజావాగ్గేయకారుడు గోరటి. అలాంటి పక్షుల జీవితాన్ని చూడాలనుకునేవారికో మంచి అవకాశం బర్డ్‌వాక్ ఫెస్టివల్. సహజ సిద్ధ ఆవాసాల్లో పక్షుల కిలకిల రాగాలు, విభిన్న పిట్టల గుంపులు, జంట పక్షుల తుళ్లింతలను ప్రత్యక్షంగా తిలకించే అవకాశం అటవీశాఖ కల్పిస్తోంది. ఈ నెల 8, 9న రెండోవిడత బర్డ్‌వాక్ ఫెస్టివల్‌ను ఆసిఫాబాద్ జిల్లా అటవీఅధికారులు నిర్వహిస్తున్నారు. రెండ్రోజుల పాటు కవ్వాల్ టైగర్ రిజర్వు, ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో ఈ బర్డ్‌వాక్ సాగనుంది.
కాగజ్‌నగర్ అడవుల్లో పక్షుల సందడి
పాలరాపుగుట్ట సహా...
తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు అడవుల్లో పక్షుల ఆవాసాలు చూడొచ్చు. దేశంలో అంతరించిపోయే స్థితిలో ఉన్న పొడుగు ముక్కు రాబంధుల ఆవాసమైన పాలరాపుగుట్టతో సహా ఎంపిక చేసిన 21 ప్రాంతాల్లో ఈ బర్డ్ వాక్ జరగనుంది. సిర్పూర్, బెజ్జూరు, పెంచికల్‌పేట, మంచిర్యాల జిల్లా జన్నారం అడవుల్లో ఎన్నో అరుదైన పక్షులున్నాయి.
250పక్షి జాతులు సందర్శకులను కనువిందు చేయనున్నాయి. ఇప్పటికే కర్ణాటక, నాగ్‌పూర్, చంద్రాపూర్, హైదరాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ తదితర ప్రాంతాల నుంచి వన్యప్రాణి, ప్రకృతి ప్రేమికులు, వైల్డ్ ఫొటోగ్రాఫర్లు తమ ఆసక్తిని చూపించారు.
రిజిస్ట్రేషన్ ఆధారంగా అవకాశం..
కోవిడ్ నేపథ్యంలో పరిమితంగా ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి అవకాశం కల్పిస్తున్నారు. ఒకరికి రూ.2వేలు ఫీజు. వివరాలకు డీఎఫ్‌వో (ఆసిఫాబాద్) 9440810099, ఎఫ్‌డీవో(జన్నారం) 9440810103 నంబరులో సంప్రదించవచ్చు. ఈ నెల 7న కాగజ్‌నగర్ అటవీ ఆఫీసులో నేరుగా మధ్యాహ్నం 3నుంచి 6గంటల వరకు పేర్లు నమోదు చేసుకోవచ్చు. వీక్షకులకు అంతర్గత రవాణా, వసతి సౌకర్యం అటవీశాఖ కల్పిస్తుంది.
పక్షుల సంరక్షణకు దోహదం
పక్షుల సంరక్షణ ప్రాముఖ్యతను తెలియజెప్పడంతో పాటు కొత్త పక్షుల గుర్తింపు, అధ్యయనం కోసం ఈ బర్డ్‌వాక్ దోహదపడుతుంది. ఎంపిక చేసిన ప్రాం తాల్లో సందర్శకులు అధికారుల సమక్షంలో పక్షులను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. వన్యప్రాణి నిపుణులు, వైల్డ్ ఫొటోగ్రాఫర్లు, పక్షి ప్రేమికులు పాల్గొనవచ్చు.
– ఎస్.శాంతారామ్, జిల్లా అటవీ అధికారి, ఆసిఫాబాద్
Comments
Please login to add a commentAdd a comment