వెంకటాపురం(పెనుగంచిప్రోలు): వెంకటాపురంలో విదేశీ విహంగాల సందడి మొదలైంది. ‘ఆస్ట్రేలియా’లోని ఎర్రకాళ్ల కొంగలు (పెయింటెడ్ స్టాక్స్) పక్షి ప్రేమికులను పలకరిస్తున్నాయి. గ్రామస్తులకు కనువిందు చేస్తున్నాయి.
కొల్లేరు తర్వాత ఇక్కడికే..
ఏటా ఈ పక్షులు వేల మైళ్లు ప్రయాణించి నవంబర్, డిసెంబర్ నెలల్లో గ్రామానికి చేరుకుంటాయి. అయితే ఈ ఏడాది విదేశీ పక్షులు సుమారు వెయ్యికి పైగా చేరుకొని నాలుగైదు రోజులవుతోంది. ఇవి ఆరు నెలల పాటు ఇక్కడి చెట్లపై ఆవాసాలు ఏర్పాటు చేసుకొని గుడ్లుపెట్టి, సంతానత్పోత్తి చేసుకుని మే చివరి వారంలోగానీ, జూన్‌లోగానీ తిరిగి తమ ప్రాంతానికి వెళ్తాయి. కొల్లేరు తర్వాత విదేశీ పక్షులు అధికంగా వచ్చేది వెంకటాపురం గ్రామానికే. ఇది పెనుగంచిప్రోలుకు పది కిలోమీటర్ల దూరంలోనే ఉంది.
పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డలా
విదేశీ పక్షుల రాకతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏటా గ్రామానికి వచ్చే పక్షులను గ్రామస్తులు పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డలా చూసుకుంటారు. ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఈ పక్షుల కారణంగా గ్రామం పాడిపంటలు, సుఖ శాంతులతో వరి్ధల్లుతోందని వారి నమ్మకం.
పక్షుల కోలాహలం
రంగు రంగుల రెక్కలు, పొడవాటి ఎర్రని ముక్కు, పెద్ద కళ్లతో సందడి చేస్తున్నాయి. ముందుగా కొన్ని పక్షులు గ్రామానికి వచ్చి పరిసరాలు, ఆహార లభ్యత చూసుకొని అనువుగా ఉంటే వెనక్కు వెళ్లి తోటి పక్షులతో గ్రామానికి చేరుకుంటాయి. సమీపంలో దొరికే పుల్లలు, గడ్డిని తెచ్చి చెట్ల కొమ్మలపైకి చేర్చి గూళ్లు చేసి గుడ్లు పెడతాయి. గ్రామానికి తరలి వచ్చే విదేశీ పక్షుల సంరక్షణను పట్టించుకోవటం లేదు.
గ్రామం మధ్య నుంచి వెళ్లే 11 కేవీ విద్యుత్ తీగల కారణంగా ఏటా పెద్ద సంఖ్యలో పక్షులు మృత్యువాత పడుతున్నాయి. దీనిపై గ్రీన్ టీం నిర్వాహకులు జూటూరి అప్పారావు, వైఎస్సార్ సీపీ నేత గూడపాటి శ్రీనివాసరావు సహకారంతో గతంలో తీగలకు ప్లాస్టిక్ పైపులు అమర్చారు. అయితే ఇంకా పైపులు తొడగాల్సి ఉంది. కోతుల వల్ల పక్షుల ఆవాసానికి అవరోధం కలుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment