ఎక్స్‌ప్రెస్‌ మెట్రో! | Route Clear on Rayadurgam To Shamshabad Metro Express | Sakshi
Sakshi News home page

ఎక్స్‌ప్రెస్‌ మెట్రో!

Published Fri, May 18 2018 9:41 AM | Last Updated on Tue, Oct 16 2018 5:16 PM

Route Clear on Rayadurgam To Shamshabad Metro Express - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: రాయదుర్గం నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి రోడ్డు మార్గంలో చేరుకునేందుకు సుమారు 50 నిమిషాల సమయం పడుతుంది. కానీ మెట్రోరైళ్లలో కేవలం 25 నిమిషాల్లో విమానాశ్రయానికి చేరుకునేందుకు వీలుగా ఎక్స్‌ప్రెస్‌ మెట్రో కారిడార్‌ను ఏర్పాటు చేసేందుకు నగర మెట్రో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈమేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదికకు మరో పక్షం రోజుల్లో తుదిరూపునిచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంచేశారు. ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్‌ అధికారులు నేరుగా క్షేత్రస్థాయిలోకి దిగి శంషాబాద్‌–రాయదుర్గం మార్గంలో పర్యటించారు. ఈమేరకు డీపీఆర్‌ను సిద్ధంచేస్తున్నారు. సుమారు రూ.4500 కోట్ల అంచనావ్యయంతో చేపట్టనున్న ఈ మెట్రోకారిడార్‌ ఏర్పాటుతో గ్రేటర్‌ సిటీ నుంచి విమానాశ్రయానికి వెళ్లే సిటీజన్లకు ట్రాఫిక్‌ అవస్థలు తప్పనున్నాయి. ప్రస్తుతం నగరంలో అందుబాటులో ఉన్న మెట్రో కారిడార్లు విమానాశ్రయానికి కనెక్టివిటీ లేకపోవడంతో..తక్షణం విమానాశ్రయానికి మెట్రో మార్గం ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్‌ఆదేశించడంతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీలో వేగం పెరగడం విశేషం.

ప్రతి ఐదు కిలోమీటర్లకో స్టేషన్‌..!
విమానాశ్రయమార్గంలో ప్రతీ ఐదు కిలోమీటర్లకు ఓ మెట్రో స్టేషన్‌ను ఏర్పాటుచేయనున్నట్లు తెలిసింది. స్టేషన్లకు అనుసంధానంగా రవాణా ఆధారిత ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేషన్లను ఔటర్‌రింగ్‌రోడ్డుకు సమీపంలోని గచ్చిబౌలి,అప్పాజంక్షన్,కిస్మత్‌పూర్,గండిగూడా చౌరస్తా,శంషాబాద్‌ విమానాశ్రయం తదితర ప్రాంతాల్లో  ఏర్పాటుకు స్థలపరిశీలన జరుపుతున్నారు. పిల్లర్ల ఏర్పాటుకు వీలుగా సాయిల్‌టెస్ట్‌ చేస్తున్నట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. డీపీఆర్‌ తయారీతో కచ్చితంగా ఎక్కడ స్టేషన్లు నిర్మించాలన్న అంశంపై స్పష్టతరానుందని పేర్కొన్నాయి. 

పీపీపీ విధానంలో ముందుకొచ్చేదెవరో...?
ప్రస్తుతం నాగోల్‌–రాయదుర్గం,ఎల్భీనగర్‌–మియాపూర్,జేబీఎస్‌–ఫలక్‌నుమా మార్గంలో మొదటిదశ మెట్రో ప్రాజెక్టును పీపీపీ విధానంలో చేపట్టారు. మూడు మార్గాల్లో 72 కి.మీ ప్రాజెక్టు పూర్తికి సుమారు రూ.14 వేల కోట్ల అంచనా వ్యయం అవుతుందని తొలుత అంచనావేశారు. కానీ ఆస్తులసేకరణ ఆలస్యం కావడం, అలైన్‌మెంట్‌ చిక్కులు, రైట్‌ఆఫ్‌వే సమస్యలకారణంగా మెట్రో అంచనా వ్యయం సుమారు రూ.3 వేల కోట్లు అదనంగా పెరిగినట్లు సమాచారం. ఈనేపథ్యంలో రెండోదశ మెట్రో ప్రాజెక్టును పీపీపీ విధానంలో చేపట్టేందుకు ఏ సంస్థ ముందుకొస్తుందా అన్నది సస్పెన్స్‌గా మారింది. కాగా రాయదుర్గం–శంషాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌మెట్రో కారిడార్‌ ఏర్పాటుకు స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌(ప్రత్యేక యంత్రాంగం)ను ప్రభుత్వం ఏర్పాటుచేసిన విషయం విదితమే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement