న్యూయార్క్‌లో సిటీ డిజైన్స్
‘అత్యాధునిక ధోరణులను ఫాలో అవుతూనే మన హ్యాండ్‌లూమ్స్, హ్యాండీ క్రాఫ్ట్స్‌కు విశ్వవ్యాప్త గుర్తింపు తేవాలన్నది నా లక్ష్యం’ అంటారు వర్షా మహేంద్ర. హైదరాబాద్‌కు చెందిన ఈ ఫ్యాషన్ డిజైనర్... ఇటీవలే యూఎన్ ఆధ్వర్యంలో న్యూయార్క్‌లోని ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్‌లో తొలిసారి నిర్వహించిన ఫ్యాషన్ షోలో ఆమె పాల్గొన్నారు. అంజలీశర్మ (బెంగళూరు) తర్వాత మన దేశం తరపున ఈ షోలో పార్టిసిపేట్ చేసిన మరో డిజైనర్ వర్షా మహేంద్రానే. ఆ ఈవెంట్ నిర్వాహకుల తరపున కొంత కాలం పాటు భారతీయ ప్రతినిధిగా వర్ష కొనసాగుతారు. బంజారాహిల్స్‌లో జస్ట్ బ్లౌజెస్, ఖైరతాబాద్‌లో హాఫ్ శారీ పేరుతో ఎక్స్‌క్లూజివ్ బొటిక్‌లు నిర్వహిస్తున్న వర్ష... ‘సిటీప్లస్’తో తన న్యూయార్క్ షో విశేషాలు పంచుకున్నారు.
న్యూయార్క్ ఫ్యాషన్ షోలో పాల్గొనే అద్భుతమైన అవకాశం అనూహ్యంగా వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌లను గుర్తించి ప్రోత్సహించే ఉద్దేశంతో యునెటైడ్ నేషన్స్ ఆధ్వర్యంలో తొలిసారి నిర్వహిస్తున్న విమెన్ ఎంపవరింగ్ కార్యక్రమం అది. సిటీలోని ఐఎస్‌బీలో పది వేల మంది మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించా. అదే ఈ ఈవెంట్‌కు నన్ను ఎంపిక చేయడానికి కారణం. బెంగళూరులో బొటిక్ నిర్వహిస్తున్న అంజలీశర్మ కూడా ఈ అవకాశం దక్కించుకున్నారు.
మరిచిపోలేను...
ప్రపంచవ్యాప్తంగా 18 మంది డిజైనర్లు ఈ షోలో పాల్గొన్నారు. నాకు ఒకే ఒక్క సీక్వెన్స్ సమర్పించే అవకాశం వచ్చింది. కచ్, లంబాడా శైలికి మెరుగులు అద్ది, హ్యాండ్ ఎంబ్రాయిడరీలతో నేను సృష్టించిన డిజైన్లు అందర్నీ ఆకట్టుకున్నాయి. చాలా ఎంక్వయిరీలు వచ్చాయి. ఆన్ ద స్పాట్ బుకింగ్స్, ఆర్డర్స్ కూడా లభించాయి. ఈ షోలో చెర్రీ బ్లెయిర్ లాంటి ప్రముఖులు పాల్గొన్నారు. నా డిజైన్లకు మోడల్‌గా ఇంటర్నేషనల్ సూపర్ మోడల్ కామెరూన్ రస్సెల్ వంటి వారు ర్యాంప్ వాక్ చేయడం గ్రేట్ ఫీలింగ్. హిల్లరీ క్లింటన్‌తో డిన్నర్ చేసే అవకాశం ఊహలకు అందని ఆనందాన్నిచ్చింది.
లండన్-న్యూయార్క్ ఫెస్టివల్ (ఎల్‌డీఎన్‌వై) పేరిట నెల మొత్తం కొనసాగే ఈవెంట్‌లో భాగం ఇది. ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ (ఐటీసీ), వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, యునెటైడ్ నేషన్స్‌ల సంయుక్త నిర్వహణలో గత సెప్టెంబరు నెలాఖరున ప్రారంభమైంది. మహిళల స్వయం సాధికారతకు, క్రమబద్ధమైన పురోగతికి ఫ్యాషన్ ఎలా ఉపకరిస్తుందనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్ రంగ ప్రతినిధులను ఎంపిక చేస్తే అందులో నాకూ స్థానం దక్కింది. వచ్చే ఏడాది కూడా ఈ షో కొనసాగుతుంది.
- ఎస్.సత్యబాబు