చాయ్ చమక్
Can't leave it
బ్లాక్‌లూ గ్రీన్‌లే కాదు మరో నాలుగైదు రంగుల టీ అందుబాటులో ఉందని తెలుసా? బార్‌లు, పబ్‌లూ మాత్రమే కాదు ‘టీ’ బార్‌లను సిటీలో కనుగొన్నారా? స్పూన్ అంత సైజ్ ఉండే చిన్నపాటి చైనీస్ కప్‌లో ఒక్కో సిప్‌తో ఒక్కో ఫ్లేవర్‌ను ఎంజాయ్ చేసే ట్రెం‘టీ’ స్టైల్స్ గురించి విన్నారా? ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నలభై రకాల దాకా టీ లీవ్స్ మనకు తేనీటి వైవిధ్యాన్ని రుచి చూపుతున్నాయి గమనించారా?
..:: ఎస్.సత్యబాబు
చార్మినార్ అంత చారిత్ర నేపథ్యాన్ని ఇముడ్చుకున్న చాయ్.. ఇప్పుడు సరికొత్త పొగలు కక్కుతోంది. బ్లాక్ కలర్‌తో మొదలుపెట్టి అరడజనుకు పైగా రంగులున్న తేనీరు.. నగరవాసుల వైరె ‘టీ’ ప్రియత్వాన్ని సంతృప్తి పరుస్తోంది. హిస్టరీ ఇచ్చిన అలవాట్లను హెల్దీస్టైల్‌కు మార్చుకునే తెలివిడి ఉన్న సి‘టి’జనులు టీ హ్యాబిట్‌కి వినూత్న అర్థాలు చెబుతున్నారు.
కలర్‘ఫుల్’
హెల్దీ టీల వేటలో తొలుత వచ్చిన బ్లాక్ టీకి ఆదరణ పెరుగుతోంది. అలాగే గ్రీన్ టీ పచ్చగా ప్రాభవాన్ని చాటుకుంటోంది. వీటితో పాటే ఇప్పుడు సిటీలో తేలికపాటి గోల్డెన్ కలర్లో లభించే వైట్ టీ, చైనీస్ లీవ్స్‌తో పింక్ టీ, ఎల్లో టీ, అస్సాం, ఆఫ్రికా దేశపు ఆకులతో తయారు చేసే రెడ్ టీ.. వంటివి లభిస్తున్నాయి. ప్రస్తుతం సిటీలో డిఫరెంట్ లీవ్స్‌తో రూపొందించిన దాదాపు 40 రకాల టీలు లభిస్తున్నాయి. అత్యంత ఖరీదైన ఫ్లేవర్‌లుగా జాస్మిన్ పెరల్స్, జిన్సెంగ్ ఊలాంగ్ (చైనా) వంటివి, అందుబాటు ధరల్లో అస్సామ్ రెడ్ టిప్స్ వంటివి ఉన్నాయి. ఇక చైనీస్ ఫ్లవర్స్, రోజ్ బర్డ్స్ వంటివి సాధారణ లీవ్స్ రూపంలో లేకపోవడం విశేషం.
ఐస్ ఐస్ బేబీ..
వేడి వేడి పొగలు కక్కే టీ రోజులకు విరామం. చల్లగా, జిహ్వని జివ్వు మనిపించే కోల్డ్ టీలు రంగంలోకి దిగాయి. హాట్ టీతో పాటుగా ఐస్ టీ కూడా మార్కెట్లో ఉంది. ‘ఐస్ టీని ఎక్కువగా యూత్ ఇష్టపడుతున్నారు’ అని పికిల్స్ కాఫీషాప్ నిర్వాహకులు అఖిలేష్ చెప్పారు. ఈ ఐస్‌టీ కోసం ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతైన లీవ్స్‌ను వినియోగిస్తున్నారు. ఐస్ టీ, గ్రీన్ టీలను ట్రాన్స్‌పరెంట్ గ్లాస్‌లో సేవిస్తే దాని టేస్ట్ మరింత ఖచ్చితంగా ఆస్వాదించవచ్చని తయారీదారులు అంటున్నారు.
మిక్స్‌డ్ రుచులు...
టీ సెర్మనీ పేరుతో రెస్టారెంట్స్ ఒకేసారి నాలుగైదు రకాల ఫ్లేవర్డ్ టీలను సర్వ్ చేస్తున్నాయి. ఒకే సిప్‌కు మాత్రమే ఉపయోగపడే స్పూన్ సైజ్ ఉండే చైనీస్ కప్స్‌ను దీని కోసం వినియోగిస్తున్నాయి. ఒకటి తర్వాత ఒకటిగా విభిన్న రకాల తేయాకు రకాలతో తయారైన టీలను సేవించడం ఓ విభిన్నమైన అనుభూతి. కేవలం వెయిట్‌లాస్‌కు ఉపయోగించండి అంటూ స్లిమ్మింగ్ టీ సైతం మార్కెట్‌లోకి వచ్చింది. దీని ఫలితాల సంగతెలా ఉన్నా.. దీని పేరు చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఇక కొన్ని చోట్ల టీ హిస్టరీ తెలిపే బుక్స్, జర్నల్స్, ప్రొడక్ట్స్ డిస్‌ప్లే చేస్తున్నారు.
అపోహలకు ‘పాత’ర...
టీ హాబీకి సంబంధించి వచ్చిన మార్పుల కారణంగా ‘టీ’ నుంచి పాలూ పంచదారలకు పోయేకాలం దాపురించినట్టు కనిపిస్తోంది. ఆరోగ్యస్పృహతో పాటు అసలైన రుచిని ఆస్వాదించాలనే తపన కూడా దీనికి కారణం. నైట్ టైమ్ టీ తాగితే నిద్రకు దూరం అవుతామనే ఆలోచన రాన్రానూ పాతబడుతోంది. సిటీలో సాయంత్రం నుంచి రాత్రి దాకా టీ తాగడమే ఎక్కువైంది. సాయంత్రం 5 తర్వాత తమకు స్టెప్పింగ్ బాగా ఉంటుందని బంజారాహిల్స్‌లోని టీ బార్ ఫిన్జాన్ నిర్వాహకులు చెప్పారు. టీ విత్ స్నాక్స్ అనేది కూడా పాత ట్రెండ్ అయిపోయింది. తేనీటితో మరో స్నాక్ ఏదైనా కలిపి తీసుకోవడం ద్వారా అసలు సిసలైన ఫ్లేవర్‌కు దూరమవుతామని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు.