వృత్తిపట్ల నిబద్ధతున్న వ్యక్తి.. జెస్సీ
ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
హైదరాబాద్: పనిలో నిబద్ధత, అంకిత భావం ఉన్న వ్యక్తి స్పోర్ట్స్ జర్నలిస్ట్ జె.శ్రీనివాసులు (జెస్సీ) అని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ప్రెస్ అకాడమీ తరఫున లక్ష నగదు, ఐదేళ్ల పాటు నెలకు రూ.3 వేల పింఛన్ అతి త్వరలో కల్పిస్తామని, అంతే కాకుండా ప్రభుత్వ పరంగా కూడా ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చా రు. ఆదివారం ప్రెస్‌క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఇటీవల అకస్మాత్తుగా మృతి చెందిన సాక్షి స్పోర్ట్స్ జర్నలిస్టు జెస్సీకి ఆత్మీయ నివాళి కార్యక్రమం జరిగింది. జెస్సీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సీనియర్ పాత్రికేయులు పాల్గొని జెస్సీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అల్లం నారాయణ మాట్లాడుతూ.. జర్నలిజంలో జెస్సీ లాంటి వారు చాలా అరుదుగా ఉంటారని తాను అనుకున్నది కథనంలో చూపేవారని అన్నారు.
జెస్సీ పేరుతో గేమ్ ఈవెంట్స్ నిర్వహించేందుకు కృషి చేద్దామన్నారు. స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ఆప్తుడిని కోల్పోయానని కన్నీటిపర్యంతమయ్యారు. ‘సాక్షి’ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్ రెడ్డి మాట్లాడుతూ.. జెస్సీ మ్యాన్ ఆఫ్ కమిట్‌మెంట్ అని కొనియాడారు. సాక్షి యాజమాన్యం, ఉద్యోగులు అందరూ ఆయన కుటుంబాన్ని ఆదుకోవడానికి చూస్తున్నామని అన్నారు. జెస్సీ స్నేహితుడు మైహోం ఇండస్ట్రీస్ సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆర్.వి.మహేశ్‌బాబు జెస్సీ కుటుంబానికి రూ.50 వేలు సాయం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రాజమౌళి చారి, ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్ రెడ్డి, జెస్సీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.