
డెస్క్ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి
టీజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు అల్లం నారాయణ
హన్మకొండ, న్యూస్‌లైన్: డెస్క్ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని టీజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు అల్లం నారాయణ హామీ ఇచ్చారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) నేతృత్వంలో ఈ మేరకు పోరాటం చేస్తామన్నారు. వరంగల్ డెస్క్ జర్నలిస్టుల ఫోరం (డీజేఎఫ్) ఆధ్వర్యంలో హన్మకొండలో గురువారం తెలంగాణ డెస్క్ జర్నలిస్టు ప్రతినిధుల సమావేశం జరిగింది. ముందుగా డెస్క్ జర్నలిస్టులు తమ సమస్యలను ప్రస్తావించారు. అనంతరం అల్లం నారాయణ మాట్లాడుతూ ఇటీవలి కాలంలో పెరిగిన పత్రికల వల్ల డెస్క్ సిబ్బంది పెరిగారని, వారికి ప్రయోజనాలు కల్పించాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు ఇవ్వాలనే డిమాండ్‌ను టీయూడబ్ల్యూజే మొదటి అంశంగా తీసుకుని పోరాడతామని హామీ ఇచ్చారు. ఇదేకాకుండా...హెల్త్‌కార్డులను విలేకరులతోపాటు డెస్క్ జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు వర్తింపజేయడం...ఇళ్ల స్థలాలు అందించడం వంటి డిమాండ్లను టీయూడబ్ల్యూజే నేతృత్వంలో నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు. హైదరాబాద్‌లో డెస్క్ జర్నలిస్టుల మహా గర్జన నిర్వహిస్తే బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమానికి ఎలక్ట్రానిక్ మీడియా డెస్క్‌లలో పనిచేసే వారిని కూడా భాగస్వాములను చేయాలని సూచించారు.