ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా అల్లం నారాయణ బాధ్యతల స్వీకారం
సీమాంధ్ర మీడియా చిన్నచూపు చూడకుండా కృషిచేస్తానని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జర్నలిస్టులపై సీమాంధ్ర మీడియా చిన్నచూపు చూడకుండా ఆయా సంస్థలతో చర్చించేందుకు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్, సీనియర్ సంపాదకుడు అల్లం నారాయణ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా కొన్ని సీమాంధ్ర మీడియా గ్రూప్‌లు తెలంగాణ ప్రజల యాస, భాషపై వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉందన్నారు. సోమవారం నాంపల్లి చాపెల్ రోడ్డులోని ప్రెస్ అకాడమీ కార్యాలయంలో ఆయన తెలంగాణ ప్రెస్ అకాడమీ తొలి చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టులకు సరైన ప్రోత్సాహం, గౌరవం లభించే విధంగా సీమాంధ్ర మీడియా యజమానులతో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి చర్చలు జరుపుతానని తెలిపారు. మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ జర్నలిస్టుల తరఫున ఉద్యమ నాయకుడిగా ఎనలేని కృషి చేసిన అల్లం నారాయణకు సీఎం కేసీఆర్ ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి అప్పగించడం సంతోషంగా ఉందన్నారు.