నాగారం(నిజామాబాద్): వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, హెల్త్‌కార్డులు, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు తదితర సౌకర్యాల కల్పనపై త్వరలోనే పరిష్కారం లభిస్తుందని, ఒకవేళ సమస్యలు పరిష్కారం కాకపోతే ఆమరణ దీక్ష చేపడతానన్నారు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో సోమవారం జర్నలిస్టు సంఘాలు ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడిన అల్లం.. కొన్ని కారణాల వల్ల అక్రిడిటేషన్‌ల జారీలో ఆలస్యమవుతున్నదని పేర్కొన్నారు.
జర్నలిస్టులకు హెల్త్ కార్డుల కోసం తెలంగాణలోని 10 జిల్లాల నుంచి 24 వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపిన ఆయన.. చిన్నతరహా మాస పత్రికలు కూడా తమ సంస్థల్లో 100 మంది జర్నలిస్టులు పనిచేస్తున్నారని చూపడంపై విస్మయం వ్యక్తంచేశారు. నిజమైన జర్నలిస్టులకు కచ్చితంగా హెల్త్‌కార్డులు రావాల్సిందేనని, అందుకే పరిశీలన జరుగుతున్నదని చెప్పారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు రమణ, ప్రధాన కార్యదర్శి ఇస్మాయిల్, రాష్ట్ర ప్రతినిధులు జమాల్‌పూర్ గణేష్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలార్జున్‌గౌడ్, కొట్టూరు శ్రీనివాస్, నర్సింహాచారి, శ్రీకాంత్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.