journalists issues
-
‘తోపుడు బండిపై ఆస్పత్రికి’.. వార్త రాసిన జర్నలిస్టులపై ఐటీ చట్టం కింద కేసు!
భోపాల్: అనారోగ్యానికి గురైన ఓ వృద్ధుడిని కుటుంబ సభ్యులు తోపుడు బండిపై ఆసుపత్రికి తరలించారు. ఆ కుటుంబం పడిన బాధను వివరిస్తూ వార్త ఇచ్చారు స్థానిక జర్నలిస్టులు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు.. ముగ్గురు స్థానిక జర్నలిస్టులపై చీటింగ్, వర్గాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టటం, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ ప్రకారం.. వారు ఇచ్చిన వార్త పూర్తిగా తప్పు, ఎలాంటి ఆధారాలు లేవు. అయితే, వీడియోలోని కుటుంబం తాము పడిన ఇబ్బంది నిజమేనని, వార్తల్లో వచ్చిందంతా నిజమేనని పేర్కొనటం గమనార్హం. ఈ సంఘటన మధ్యప్రదేశ్, భింద్ జిల్లాలోని లహర్ ప్రాంతం మార్పురా గ్రామంలో జరిగింది. జిల్లా కలెక్టర్ సతీశ్ కుమార్ ఏర్పాటు చేసిన రెవెన్యూ, ఆరోగ్య విభాగాల దర్యాప్తు బృందాలు.. బాధిత కుటుంబం అంబులెన్స్ కోసం ఎలాంటి ఫోన్‌కాల్ చేయలేదని నివేదించాయి. వృద్ధుడు జ్ఞానప్రసాద్ విశ్వకర్మను ముందుగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారని, గవర్నమెంట్ ఆసుపత్రికి కాదని పేర్కొన్నాయి. ఈ నివేదిక ఆధారంగా.. డాక్టర్ రాజీవ్ కౌరవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వార్త రాసిన కుంజ్‌బిహారీ కౌరవ్, అనిల్ శర్మ, ఎన్కే భతేలేపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అంబులెన్స్ రాకపోవటంతో తోపుడు బండిపై 5 కిలోమీటర్లు తాము ఫోన్ చేసినా అంబులెన్స్ రాకపోవటంతో 5 కిలోమీటర్లు తోపుడు బండిపై తీసుకెళ్లినట్లు బాధితుడి కుమారుడు హరిక్రిష్ణ, కూతురు పుష్ప తెలిపారు. తమ కుటుంబం వివిధ ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందినట్లు దర్యాప్తు బృందాలు నివేదించటాన్ని తప్పుపట్టారు పుష్ప. తమకు పీఎం ఆవాస్ యోజన కింద ఒకే ఇన్స్టాల్మెంట్ వచ్చిందని, అధికారులు మా సోదరుడి ఇంటి ముందు నిలబెట్టి ఫోటోలు తీసుకెళ్లారని అధికారులపై విమర్శలు గుప్పించారు. ఇటీవల తమ గుడిసె వద్దకు వచ్చి తెల్లపేపర్‌పై సంతకాలు చేయించుకుని వెళ్లారన్నారు. అయితే, ఈ ఆరోపణలపై అధికారులు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇదీ చదవండి: ‘ఈ జిమ్మిక్కులు ఏమిటి.. మోదీ జీ?’.. ట్రావెల్ బ్యాన్పై మనీశ్ సిసోడియా విమర్శలు -
‘జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ జర్నలిస్టులకు పెద్దపీట వేసి సంస్థాగతంగా గౌరవించిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జర్నలిస్టు, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ను తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో అభినందించారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్ హాజరై ప్రసంగించారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా జర్నలిస్టుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే బాధ్యత తనదని కేటీఆర్ స్పష్టం చేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఓ సంక్షేమ నిధిని ఏర్పాటు చేశామన్నారు. కోర్టు వివాదాలు లేకుండా ఇళ్ల స్థలాలు, హెల్త్‌కార్డుల పంపిణీకి చిత్తశుద్ధితో ముందుకు పోతున్నామన్నారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల భవనానికి స్థలం కేటాయించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. చంద్రబాబు నాయుడివి ఆపద మొక్కులు అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మన పథకాలను ఏపీ సీఎం చంద్రబాబు కాపీకొడుతున్నారన్నారు. కేసీఆర్ ఏం చేస్తే, అవి చేస్తే తాను కూడా గెలుస్తానని చంద్రబాబు అనుకుంటున్నాడని, చిత్తశుద్ది లేని శివపూజలు చేస్తే ఏం ఒరిగేది లేదన్నారు. ఆంధ్రా ప్రజలు, అక్కడి జర్నలిస్టులు తెలివైన వాళ్లు. చైతన్యవంతులు అని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికే కొన్ని సమస్యలు పరిష్కారం చేసిందని, మరి కోన్ని సమస్యలు ఇంకా పరిష్కరించాల్సి ఉందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వం జర్నలిస్టులకు100కోట్ల నిధి ఏర్పాటు చేసిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మన సమస్యలు తెలుసని, ఇవాళ కేటీఆర్ మనతో ఉన్నారు కాబట్టి మనకు ఒక భరోసా ఉందని తెలిపారు. సాధ్యమైనంత వరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. -
జర్నలిస్టుల సమస్యలపై 4న ‘చలో ఢిల్లీ’
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం టీయూడబ్ల్యూజే(ఐజేయూ) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 4న చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నట్లు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ తెలిపారు. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలోనే గవర్నర్‌ను కలవనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో నాలుగేళ్లలో 220 మంది జర్నలిస్టులు అకాల మరణం పొందారన్నారు. జర్నలిస్టుల హెల్త్‌కార్డులు ఎక్కడా పనిచేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో జర్నలిస్టుల అకాల మరణాల నిలుపుదల కోసమే టీయూడబ్ల్యూజే చలో ఢిల్లీకి పిలుపునిచ్చిందని చెప్పారు. జర్నలిస్టులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని, ఎలక్ట్రానిక్ మీడియాకు చట్టబద్ధత కల్పించాలని కోరారు. మీడియా స్వేచ్ఛను హరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ సెప్టెంబర్ 1న దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయనున్నట్లు చెప్పారు. త్రిపుర, అస్సాంలో మాదిరిగా దేశ వ్యాప్తంగా 60 ఏళ్లు నిండిన జర్నలిస్టులకు రూ.10 వేల పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టాలన్నారు. ఐజేయూ సీనియర్ నేత కె. శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ వేజ్‌బోర్డు సిఫారసులు అమలు చేయాలని చాలా కాలంగా కోరుతున్నా పరిష్కారాం కావటంలేదన్నారు. జర్నలిస్టుల సంఘాలతో మంత్రి కేటీఆర్ చర్చలు జరిపినా ఫలితం కనపడటంలేదన్నారు. -
జర్నలిస్టుల కోసం ఆమరణ దీక్ష చేస్తా: అల్లం
నాగారం(నిజామాబాద్): వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, హెల్త్‌కార్డులు, డబుల్బెడ్రూం ఇళ్లు తదితర సౌకర్యాల కల్పనపై త్వరలోనే పరిష్కారం లభిస్తుందని, ఒకవేళ సమస్యలు పరిష్కారం కాకపోతే ఆమరణ దీక్ష చేపడతానన్నారు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో సోమవారం జర్నలిస్టు సంఘాలు ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడిన అల్లం.. కొన్ని కారణాల వల్ల అక్రిడిటేషన్ల జారీలో ఆలస్యమవుతున్నదని పేర్కొన్నారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డుల కోసం తెలంగాణలోని 10 జిల్లాల నుంచి 24 వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపిన ఆయన.. చిన్నతరహా మాస పత్రికలు కూడా తమ సంస్థల్లో 100 మంది జర్నలిస్టులు పనిచేస్తున్నారని చూపడంపై విస్మయం వ్యక్తంచేశారు. నిజమైన జర్నలిస్టులకు కచ్చితంగా హెల్త్‌కార్డులు రావాల్సిందేనని, అందుకే పరిశీలన జరుగుతున్నదని చెప్పారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు రమణ, ప్రధాన కార్యదర్శి ఇస్మాయిల్, రాష్ట్ర ప్రతినిధులు జమాల్పూర్ గణేష్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలార్జున్‌గౌడ్, కొట్టూరు శ్రీనివాస్, నర్సింహాచారి, శ్రీకాంత్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.