కలల బాటసారి విజ్జన్న యాది...
జర్నలిస్టుల గురువుకి నివాళి
కరీంనగర్ చరిత్ర పొడవునా ఏ కొత్త కల కంటే ఆ కల వెంట నడిచిన బాటసారి విజ్జన్న గురించి మాట్లాడటమంటే విద్యార్థుల, బుద్ధిజీవుల కలల ప్రపంచం గురించి మాట్లాడటమే. తెలంగాణలో మామూలు మనుషులు మహా మనుషులైన, ఒక చరిత్ర క్రమం గురించి మాట్లాడటమే.
ముందరి లాకప్ గది లో చేతులు పైకి కట్టేసి, లాకప్ పదమూడు సలాకలకు వేలాడదీసిన ఒక మనిషి. ఆ మనిషి నిద్రపోకుండా ఉండేందుకు లాకప్ ముందర నీళ్ల బకెట్. ఆ మనిషి కనురెప్పలు మూతబడితే ముఖం మీద చిమ్మే నీళ్లు. అదొక చిత్ర హింస రూపం. అత్యయిక స్థితి. దేశమే జైలయిన కాలం. ఈ కాలాన్ని కంటి రెప్పల కింద పొదువుకొని కాపాడుకున్న వాడే భాగ్యనగరి విజయకుమార్. ఆరోపణ నక్సల్బరీ. కొట్టీ కొట్టీ విసిగిపోయి లాక ప్‌కు వేలాడదీసి చిత్రహింసలు పెట్టారు. కానీ తను చెప్పేందుకేమీ లేదు. ఎదురుగా లాకప్‌లో వెన్ను మీద పోలీసులు కాల్చిన నెత్తుటి గాయంతో చిన్న (నారదాసు) లక్ష్మణ్‌రావు, పోరెడ్డి వెంకటరెడ్డి, మల్లా రాజిరెడ్డి, పున్నయ్య, జి. నారాయణరెడ్డి, శని గరం వెంకటేశ్వరు, అల్లం నారాయణ. విజయ్‌కు మార్ కరీంనగర్ చిన్నాపెద్దలకు విజ్జన్న. జిల్లా రాజ కీయాల కేంద్ర బిందువు. అది 1976 నాటి మాట.
కాలం మారింది. తొమ్మిదేళ్ల తర్వాత కరీంనగర్ శాస్త్రి రోడ్డు చివర పాత బజారు చౌరస్తాలో ఓ మూ లన ఒక గూనకప్పటిల్లు. లోపల నాలుగు టేబుళ్లు, న్యూస్‌ప్రింట్ రఫ్ ప్యాడ్‌లు. సాయంత్రానికల్లా ఆ ఇల్లు కలకలలాడేది. అప్పుడదొక కరీంనగర్ సాం స్కృతిక కేంద్రం. రాజకీయాల అడ్డా. అంతర్జాలా లేవీ లేకుండానే అంగుటిలో అంతర్జాతీయ భావజా లాల నుంచి భావి భారతాల దాకా చర్చలు. ఛాయ్ లు. అది విజ్జన్న స్థాపించిన జీవగడ్డ దినపత్రిక కార్యాలయం. ఆ ఆఫీసు ఇప్పటికీ అట్లాగే ఉన్నది. కరీంనగర్ విస్తరించింది. కానీ దాని పాతదనం అట్లాగే ఉన్నది. ఇప్పుడా మనిషి కరీంనగర్ కొత్త కలల నిర్మాత. ప్రత్యేక తెలంగాణ నుంచి ఎగసి వచ్చిన చైతన్యాన్ని నక్సల్బరీలో కొనసాగించి విప్ల వాల కలలుగన్న క్రాంతిదర్శి, జిల్లాలో ఇప్పటి పేరు గాంచిన జర్నలిస్టుల గురువు. పెన్నుపట్టి రాయిం చిన పెద్ద మనిషి. కరీంనగర్ చరిత్ర పొడవునా ఏ కొత్త కల కంటే ఆ కల వెంట నడిచిన బాటసారి మొ న్న కూలిపోయాడు. ఆరేళ్లుగా పార్కిన్‌సన్‌తో మాట లు దాటి రాక, పెదాల మధ్య శబ్దాలు వెలికిరాక, నిశ్శబ్దంగా బతికిన ఆ అమ్మ చెట్టు కూలిపోయింది. విజ్జన్న మహా నిశ్శబ్దంలోకి వెళ్లిపోయాడు.
వర్తమానం. ప్రెస్ భవన్. కలెక్టర్ భవనం ముందరి ఆ ప్రెస్ భవన్‌కు ఆయన పునాదులేశాడు. తన రెండురెక్కల కష్టాన్ని కూడా చేర్చి పూర్తి చేశాడు. ఎన్నో తలపోతలకు, కలెబోతలకు, తండ్లాటలకు తెలంగాణ మలి ఉద్యమ మహాగర్జనలకు వేదికగా నిలిచిన ప్రెస్ భవన్ హాలులో స్టేజి మీద ఒంటరిగా పరుండి ఉన్నాడు విజ్జన్న. మొఖం నిర్మలంగా ఉన్న ది. సబితా టీచర్ ఏడుస్తున్నది. ఇల్లులేని తనం. చివరకు తాను కట్టిచ్చిన ప్రెస్‌భవనే విజ్జన్న ఆఖరి మజిలీ వేదికైంది. చాలదా దుక్కానికి. జర్నలిస్టు ప్రపంచాని ఓనమాలు దిద్దించిన వాడు. జర్నలిస్టు ఉద్యమానికి దారులు వేసినవాడు. గతంలో ఇల్లు, ప్రింటింగ్ ప్రెస్ కలిగి ఉన్నవాడు. చివరికిలా ఒక నిర్వాసితుని మాదిరి, ఇల్లు కూడా లేని ఒక అతి సామాన్యుని మాదిరి. అదే విజయ్‌కుమార్ జీవితం. అదే ఆయన పాటించిన విలువ.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదటిసారి విఫ లమైన తర్వాత నక్సల్బరీ రాజకీయాలను కరీం నగర్‌కు తెచ్చిన వాడు విజయ్‌కుమార్. విద్యుల్లత విజ్జన్న నడిపిన మొదటి పత్రిక. అది సృజనకన్నా పాపులర్ అయిన కాలం ఒకటుండేది. వరవరరావు అప్పటి నుంచీ ఆయన గురువే. గోపు లింగారెడ్డి, వెంకట్‌రెడ్డి, నల్ల మల్లారెడ్డి, ముప్పాళ్ల నర్సింహా రావు మొట్టమొదటి కథల సంకలనం ‘బద్‌లా’ గానం చేశారు. తిరుగుబాటు కథల చరిత్ర అక్కడే ప్రారంభమైంది. అప్పుడు నిషేధించిన ‘మార్స్’ కవి తా సంకలనం, సాహసంతో అచ్చువేసిన వాడు విజ య్‌కుమార్. ఏంజెలో కాట్రొచ్చీచ్చీ ‘ది బిగినింగ్ ఆఫ్ ఎండ్’ను శ్రీశ్రీ ‘రెక్కవిప్పిన రెవల్యూషన్’గా అను వదిస్తే అచ్చువేసిన వాడూ ఆయనే. ఆ రకంగా విప్ల వోద్యమ సాహిత్యం, విరసం ఏర్పడిన తర్వాత సృజనతోపాటు విద్యుల్లతయైన తొలినాళ్ల సాహిత్యో ద్యమ సారథి విజయ్‌కుమార్. అందుకాయన చిత్ర హింసలు అనుభవించాడు. ఉన్న ప్రింటింగ్ ప్రెస్ నూ అమ్ముకున్నాడు. ఎమర్జెన్సీ చీకటి రోజులనూ అనుభవించాడు. ఆ తర్వాత బహిరంగ జీవితంలో ఉంటూనే తన పరిమితుల్లో ప్రగతిశీల గామిగా, ప్రజాస్వామ్య వాదిగా, స్నాప్నికునిగా జర్నలిస్టు ఉద్యమ నిర్మాతగా బహుముఖంగా విస్తరించిన విజ్జన్న అందరికీ కావలసిన వాడు. తొలి తెలంగాణ నుంచి మలి తెలంగాణ దాకా ఉద్యమ కేతనం అయిందీ ఆయనే. నిజంగానే కరీంనగర్ చరిత్రతో, అది నడిచిన అన్ని దారులతో, అది ఎదిగిన అన్ని రకాల ప్రభావాలతోనూ జీవగడ్డ విజయ్‌కుమార్ సజీవంగా ఉంటాడు. కరీంనగర్ జీవగడ్డ విజ్జన్న యాది చిరకాలం ఉంటుంది. కమాన్ మీద పేరై నిలుస్తుంది. నిజమే. విజ్జన్న మరి లేడు. ఆయన జ్ఞాపకం ఉంది. ఉండాలి. నిలబడాలి. ఈ నాలుగక్ష రాల భిక్ష పెట్టిన విజ్జన్నకు కన్నీటి నివాళి.
వ్యాసకర్త రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్) -అల్లం నారాయణ