తెలంగాణకు తూట్లు పొడిస్తే ఉపేక్షించం: కోదండరాం
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఏపీఎన్జీవోలు నిజంగా ఉద్యోగుల హక్కుకోసం పోరాడితే వారికి మా పూర్తి మద్దతు ఇస్తామని, కానీ దాని ముసుగులో తెలంగాణకు తూట్లు పొడవాలని చూస్తే ఉపేక్షించేది లేదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరించారు. ‘సీమాంధ్ర పాలకుల కుట్రలను ఎదిరిద్దాం- తెలంగాణ సాధిద్దాం’అనే నినాదంతో హైదరాబాద్‌లో ఈనెల 17న శాంతి ప్రదర్శన నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. సీమాంధ్రకు చెందిన టీడీపీ నాయకుడు విద్యుత్‌సౌధకు వచ్చి ఆ ప్రాంత ఉద్యోగులను రెచ్చగొడుతుంటే తెలంగాణకు చెందిన టీడీపీ, కాంగ్రెస్ నాయకులు నోరు మెదకపోవడం విడ్డూరమన్నారు.
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు అల్లం నారాయణ అధ్యక్షతన ‘తెలంగాణ అనివార్యం- మాకు శాంతి కావాలి’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.కోదండరాం మాట్లాడుతూ ‘మన డిమాండ్లపై మనం పోరాడాలని, సీమాంధ్రులు ఏవో చేస్తున్నారని మన కార్యాచరణ మార్చకూడదు’ అని తెలిపారు. పదిరోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఇచ్చిన ప్రకటనను ఎక్కడ వెనక్కి తీసుకుంటారో అనే సందేహం కలుగుతోందని, తెలంగాణ ప్రజలకు స్పష్టత ఇచ్చేవరకు జేఏసీ ఆధ్వర్యంలో శాంతిర్యాలీలు, సదస్సులు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
ఉద్యోగ సంఘం నాయకులు దేవీప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపజేసే వరకు పోరాటాన్ని ఆపేది లేదని అన్నారు. ఇక్కడ మంత్రుల ఇళ్ల వద్ద డప్పులు కొడితేనే జైళ్లలో వేశారని, కానీ అక్కడ వారి ఇళ్లపై రాళ్లతో దాడిచేసినా ఒక్కకేసూ పెట్టలేదని అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఉద్యోగులను రెచ్చగొడితే జరిగే అనర్థాలకు ఎపీఎన్జీవోలదే బాధ్యత అన్నారు. గెజిటెడ్ అధికారుల సంఘం ప్రతినిధి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. సచివాలయంలో 144 సెక్షన్, ఎస్మా ఉన్నా సీమాంధ్రులపై ఎందుకు ప్రయోగించడం లేదని, అవి తెలంగాణ వారిపై ఉపయోగించడానికే ఉన్నాయా అని ప్రశ్నించారు. తెలంగాణకు తాము అనుకూలమని ఒకవైపు చెబుతుంటే ఆ పార్టీ ఎంపీలు సమైక్యాంధ్ర అంటూ పార్లమెంట్ ఉభయసభలను స్తంభింపజేయడం ఎంతవరకు సబబు అన్నారు.