ప్రశ్నించే గొంతులు లేకుండా కుట్ర
⇒ రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ జేఏసీ ఆరోపణ
⇒ పిట్టల, ప్రహ్లాద్‌లను సస్పెండ్ చేస్తూ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను లేకుండా చేయాలనే కుట్రలో భాగంగానే కొందరిని ప్రలోభాలకు గురిచేసి ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని తెలంగాణ జేఏసీ ఆరోపించింది. తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ మంగళవారం హైదరాబాద్‌లో సమావేశమైంది. అనంతరం ఈ అంశంపై మీడియాకు ప్రకటన విడుదల చేసింది. జేఏసీ నుంచి కన్వీనర్ పిట్టల రవీందర్, కో–చైర్మన్ నల్లపు ప్రహ్లాద్‌ను సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. నిరుద్యోగ నిరసన ర్యాలీ విజయవంతం కావడాన్ని, ప్రజల బలమైన గొంతుకగా జేఏసీ ఎదగడాన్ని జీర్ణించుకోలేని పాలకులు కుట్రలను తీవ్రతరం చేశారని టీజేఏసీ విమర్శించింది.
ప్రజల పక్షాన జేఏసీ ప్రశ్నిస్తుంటే అందులోని కొందరిని ప్రలోభాలకు గురిచేస్తూ ప్రభుత్వం పాల్పడుతున్న కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చింది. ప్రలోభాలకు లోబడి కొందరు చేస్తున్న ప్రకటనల వల్ల జేఏసీకి వచ్చిన ఇబ్బందేమీ లేదని... ఇలాంటి వాటి వల్ల కార్యాచరణను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకుపోవడానికి అవకాశం ఏర్పడిందని పేర్కొంది. కాగా, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల నియంత్రణపై సర్కారు చర్యలు చేపట్టకపోవడాన్ని తప్పుబట్టిన జేఏసీ...ఈ విషయంలో పేద విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గించేలా ‘ఫీజు పోరు’పై కార్యాచరణ చేపడతామని ప్రకటించింది. అలాగే బడ్జెట్‌ను అధ్యయనం చేసి బలహీన వర్గాలకు కేటాయించిన నిధుల తరలింపును వెలుగులోకి తేవాలని జేఏసీ నిర్ణయించింది. ప్రజాసమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో జిల్లాల్లో యాత్రలు చేపడతామని టీజేఏసీ ప్రకటించింది.