బాధ్యతాయుతంగా పనిచేయాలి | Responsive work | Sakshi
Sakshi News home page

బాధ్యతాయుతంగా పనిచేయాలి

Published Sun, Sep 14 2014 3:16 AM | Last Updated on Sat, Sep 2 2017 1:19 PM

బాధ్యతాయుతంగా పనిచేయాలి

బాధ్యతాయుతంగా పనిచేయాలి

గోదావరిఖని :
 జర్నలిస్టులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి  పరిష్కారానికి కృషి చేస్తానని ప్రెస్ అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు అల్లం నారాయణ అన్నారు. శనివారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్ సర్వసభ్య సమావేశం అనంతరం ‘తెలంగాణలో మీడియా- సవాళ్లు’ అనే అంశంపై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు, అక్రిడిటేషన్‌కార్డులు, హెల్త్‌కార్డుల జారీ, ఇతర సమస్యలు పరిష్కరించేందుకు చొరవచూపాలని, లేకపోతే వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తామన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర అనిర్వచనీయమైందని, రాష్ట్రం ఏర్పడినందున పునర్నిర్మాణం కోసం అదే స్ఫూర్తితో పాటుపడాలని, తెలంగాణలో నిలిపివేసిన రెండు చానెళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలని ఎంఎస్‌వోలను కోరారు. తెలంగాణ సమాజాన్ని అస్థిర పరిచేందుకు ఆంధ్రా మీడియా కుట్రపన్నుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం ముందుకురాని సమయంలో బతుకమ్మ పండుగ అంటే ఏమిటో మీడియా చానెళ్లకు తెలియదని, గతేడాదితో ప్రపంచానికి బతుకమ్మ పండుగ విశిష్టత తెలిసిందన్నారు. అనంతరం ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో అల్లం నారాయణను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి సన్మానపత్రాన్ని, జ్ఞాపికను అందజేశారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు మాదాసు రామ్మూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు పల్లె రవికుమార్, పిట్టల శ్రీశైలం, ఇస్మాయిల్, కొరివి వెంకటస్వామి, జిల్లా అధ్యక్షులు విజయసింహారావు, అడెపు లక్ష్మీనారాయణ, సీనియర్ జర్నలిస్టులు ఎస్.కుమార్, భాగ్యనగర్ భాస్కర్‌కుమార్, సంజీవ్‌రెడ్డి, కార్పొరేటర్ బొమ్మక శైలజ- రాజేశ్, క్లబ్ ప్రధాన కార్యదర్శి నాగపురి సత్యం, అల్లంకి లచ్చయ్య, పి.శ్యాంసుందర్, ఎ.రవీందర్‌రెడ్డి, జక్కం సత్యనారాయణ, దయానంద్‌గాంధీ, రాంశంకర్, పూదరి కుమార్, తగరపు శంకర్, విజయ్‌కుమార్, రమణ, కె.ఎస్.వాసు, ముచ్చకుర్తి కుమార్, కె.మధుకర్, చంద్రశేఖర్‌రెడ్డి, కోడం రాజు, న్యాతరి అంజయ్య, మధుబాబు, దబ్బెట శంకర్, జి.శ్యాంసుందర్ పాల్గొన్నారు. అంతకుముందు గోదావరిఖని ప్రధాన చౌరస్తా నుంచి ప్రెస్‌క్లబ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించగా స్థానిక కార్పొరేటర్ బొమ్మక శైలజ ఆధ్వర్యంలో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం క్లబ్ ఆవరణలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీయూడబ్ల్యూజే నాయకులు మొక్కలు నాటారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement