responsive
-
హెచ్ఎంలు బాధ్యతగా పనిచేయాలి
ఒంగోలు వన్‌టౌన్ : ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బాధ్యతాయుతంగా పనిచేయాలని పాఠశాల విద్య గుంటూరు ఆర్జేడీ పి.పార్వతి ఆదేశించారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. స్థానిక అంబేద్కర్ భవన్లో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒంగోలు, పర్చూరు విద్యాడివిజన్ల ప్రధానోపాధ్యాయుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ మాట్లాడుతూ ఇటీవల తాను కొన్ని పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించానని, ప్రధానోపాధ్యాయులు బాధ్యత లేకుండా రిజిస్టర్లో సంతకాలు పెట్టి వెళ్లిపోయారని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితులు పునరావృతమైతే ఉపేక్షించేది లేదని ఆమె హెచ్చరించారు. ఉన్నత పాఠశాలల్లో కచ్చితంగా మూమెంట్ రిజిస్టర్ నిర్వహించాలన్నారు. పాఠశాల వదిలి వెళ్లేటప్పుడు ఎక్కడకు వెళ్తుందీ స్పష్టంగా మూమెంట్ రిజిస్టర్లో నమోదు చేయాలని హెచ్ఎంలను ఆదేశించారు. ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాఠశాలలో ప్రార్థనా సమావేశాలకు హాజరుకావాలన్నారు. ప్రార్థనా సమావేశాలకు హాజరుకాని ఉపాధ్యాయులకు సీఎల్ మార్కు వేయాలని ఆమె సూచించారు. పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లను ఎట్టి పరిస్థితుల్లో బోధనేతర పనులకు వినియోగించరాదన్నారు. సక్సెస్ స్కూళ్లలో ఇంగ్లిష్, తెలుగు మీడియం విద్యార్థులకు వేరువేరుగా తరగతులు నిర్వహించాలన్నారు. ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలోనే బోధన జరిగేలా హెచ్ఎంలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలలకు వరుస సెలవులు ప్రకటించరాదన్నారు. పాఠశాలల్లో చదవడం, రాయడం రాని విద్యార్థులను గుర్తించి వారి కోసం ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని చెప్పారు. డివిజన్ స్థాయిలో తాను ప్రతినెలా హెచ్ఎంల సమావేశం నిర్వహించి పనితీరును సమీక్షిస్తానని తెలిపారు. హైస్కూళ్లల్లో సక్రమంగా పనిచేయని మధ్యాహ్న భోజనం కుకింగ్ ఏజెన్సీలను తొలగించి సెల్ఫ్‌హెల్ప్ గ్రూపులను కుకింగ్ ఏజెన్సీలుగా నియమించాలని ఆమె సూచించారు. పాఠశాలలోని గ్రంథాలయ పుస్తకాలను పాఠ్యాంశాలకు అనుగుణంగా విద్యార్థులకు అందజేసి వారితో చదివించాలన్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు సైన్సుబోధనలో కచ్చితంగా ప్రయోగాలు చేసి చూపించాలని ఆర్జేడీ సూచించారు. ప్రాథమిక, మాధ్యమికను ప్రోత్సహించాలి... ఉన్నత పాఠశాలల్లోని హిందీ టీచర్లు విద్యార్థులతో ప్రాథమిక, మాధ్యమిక లాంటి పరీక్షలు రాయించేందుకు ప్రోత్సహించాలని ఆర్జేడీ పార్వతి సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు ప్రతిరోజూ ఒక ఉపాధ్యాయుడ్ని పర్యవేక్షకునిగా ఏర్పాటు చేయాలన్నారు. తరగతి గదులకు సెల్ఫోన్లు తీసుకెళ్లే ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటి వరకు ఆధార్ అనుసంధానం కాని విద్యార్థులకు వెంటనే ఆధార్ నంబర్లు అనుసంధానం చేయాలన్నారు. ప్రశ్నపత్రాలను ఉపాధ్యాయులే తయారు చేసి పరీక్షలు నిర్వహించాలని ఆమె పేర్కొన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన డీఈవో బి.విజయభాస్కర్ మాట్లాడుతూ ఆర్‌ఎంఎస్‌ఏ గ్రాంట్ల వినియోగానికి సంబంధించి 11, 12, 13 తేదీల్లో ప్రత్యేక బృందాలు పాఠశాలలను సందర్శిస్తాయని తెలిపారు. అనంతరం పదో తరగతి విద్యార్థులు త్రైమాసిక పరీక్షల్లో సాధించిన మార్కులపై ఆర్జేడీ సమీక్షించారు. సమావేశంలో ఒంగోలు ఉపవిద్యాశాఖాధికారి ఇ.సాల్మన్, హెచ్ఎంల సంఘ జిల్లా అధ్యక్షుడు వై.వెంకట్రావు, డీసీఈబీ కార్యదర్శి ఆర్.హనుమంతరావు, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసరెడ్డి, ఆర్‌ఎంఎస్‌ఏ ఉపవిద్యాశాఖాధికారి వి.రామ్మోహనరావు పాల్గొన్నారు. -
బాధ్యతాయుతంగా పనిచేయాలి
గోదావరిఖని : జర్నలిస్టులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ప్రెస్ అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు అల్లం నారాయణ అన్నారు. శనివారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్ సర్వసభ్య సమావేశం అనంతరం ‘తెలంగాణలో మీడియా- సవాళ్లు’ అనే అంశంపై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు, అక్రిడిటేషన్‌కార్డులు, హెల్త్‌కార్డుల జారీ, ఇతర సమస్యలు పరిష్కరించేందుకు చొరవచూపాలని, లేకపోతే వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తామన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర అనిర్వచనీయమైందని, రాష్ట్రం ఏర్పడినందున పునర్నిర్మాణం కోసం అదే స్ఫూర్తితో పాటుపడాలని, తెలంగాణలో నిలిపివేసిన రెండు చానెళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలని ఎంఎస్‌వోలను కోరారు. తెలంగాణ సమాజాన్ని అస్థిర పరిచేందుకు ఆంధ్రా మీడియా కుట్రపన్నుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం ముందుకురాని సమయంలో బతుకమ్మ పండుగ అంటే ఏమిటో మీడియా చానెళ్లకు తెలియదని, గతేడాదితో ప్రపంచానికి బతుకమ్మ పండుగ విశిష్టత తెలిసిందన్నారు. అనంతరం ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో అల్లం నారాయణను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి సన్మానపత్రాన్ని, జ్ఞాపికను అందజేశారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు మాదాసు రామ్మూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు పల్లె రవికుమార్, పిట్టల శ్రీశైలం, ఇస్మాయిల్, కొరివి వెంకటస్వామి, జిల్లా అధ్యక్షులు విజయసింహారావు, అడెపు లక్ష్మీనారాయణ, సీనియర్ జర్నలిస్టులు ఎస్.కుమార్, భాగ్యనగర్ భాస్కర్‌కుమార్, సంజీవ్‌రెడ్డి, కార్పొరేటర్ బొమ్మక శైలజ- రాజేశ్, క్లబ్ ప్రధాన కార్యదర్శి నాగపురి సత్యం, అల్లంకి లచ్చయ్య, పి.శ్యాంసుందర్, ఎ.రవీందర్‌రెడ్డి, జక్కం సత్యనారాయణ, దయానంద్‌గాంధీ, రాంశంకర్, పూదరి కుమార్, తగరపు శంకర్, విజయ్‌కుమార్, రమణ, కె.ఎస్.వాసు, ముచ్చకుర్తి కుమార్, కె.మధుకర్, చంద్రశేఖర్‌రెడ్డి, కోడం రాజు, న్యాతరి అంజయ్య, మధుబాబు, దబ్బెట శంకర్, జి.శ్యాంసుందర్ పాల్గొన్నారు. అంతకుముందు గోదావరిఖని ప్రధాన చౌరస్తా నుంచి ప్రెస్‌క్లబ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించగా స్థానిక కార్పొరేటర్ బొమ్మక శైలజ ఆధ్వర్యంలో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం క్లబ్ ఆవరణలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీయూడబ్ల్యూజే నాయకులు మొక్కలు నాటారు.